సాహిత్యంలో ఔచిత్యం-ఆవుల గోపాలకృష్ణమూర్తి

సాహిత్యంలో ఔచిత్యం ఆవుల గోపాలకృష్ణమూర్తి మా ఆలోచనలు ఆవుల గోపాలకృష్ణమూర్తి భావప్రచారకుడు. సాంఘిక ప్రయోజనాన్నుద్దేశించి సాహిత్య పరిశీలన చేశాడు. అంటే సాహిత్యంలో మరో ఔచిత్యాన్వేషణ మొనరించాడు. భావమునకు బలమున్నదనే నమ్మకము గలవాడు గనుక, సాహిత్య భావముల బలము సంఘముపై జాస్తి గనుక, కొంత నిశిత పరిశీలన చేసినాడు. నిశిత పరిశీలనకు నిలబడు సాహిత్యము అల్పముగదా మనకు. ఆవుల సాహితీ రచనలు అనేక విధములు. భావస్పందన కలుగగా మెదలిన ఆలోచనలకు రూపకల్పన చేసిన రచనలు సహజములు. “సాహిత్యములో ఔచిత్యము” తత్ఫలితమే. కొన్ని లభ్యముగాక యిందు జేర్చలేక పోవుటచే క్షంతవ్యులము. భావములోవలె భాయందునూ ఔచితి పరిశీలన అవసరము కదా. హేతువాది గోపాలకృష్ణమూర్తి గ్రాంథికవాది (వీరగ్రాంథికవాది కాదు) కారణాంతములచే వీర వాడుకవాదియై “గోపాక్రిష్నమూర్తి”, “సుబ్రమన్యం”, “రొండు” అనే పదములు వాడిననూ, క్రమేణా “రొండు” మాత్రమే మిగిల్చినాడు. సాహిత్య వ్యాసములలో గ్రాంథిక వాసనలు మెండు. సాంఘీక ప్రయోజనమునకు వాడుక భాష దగ్గర దారియని, గ్రాంథికము వలన కాలహరం జరుగుననీ భావించుటయూ కద్దు. ఇందలి హేతువు చింత్యము. భాషకు నియమము గావలయుననిన అది గ్రాంథికమే. సరళగ్రాంథికము గావచ్చును. వాడుకభాష నియమము తప్పినట్టిది. కనుకనే గోపాలకృష్ణమూర్తి గ్రాంథిక వాసనలు వీడజాలక, వాడుకలోకి దిగజారలేక, డోలాందోళిత మనస్కుడై, రాగా రాగా గ్రాంథో వ్యవహారికము ననుసరించినాడు. వాదోపవాదములలో ఆవుల దిట్ట. ఆయిననూ కొందరి దృష్టిలో వాదములు పాక్షికములు. కనుక అట్టివి కావలయునని వదిలివేసితిమి. మొత్తము మీద సాహిత్య రుచులు గలవాడైననూ, గోపాలకృష్ణమూర్తి దానిపై నొక్కు బెట్టనట్లు, రచనలవలన స్పష్టము. కొన్నిటి యెడల ప్రతిభావ్యుత్పన్నత ద్యోతకమగును. భావమునకుగల బలము భాషకు లేకపోవుట ఆయన గొప్ప లోపము. సృజనాత్మకశక్తిని సద్వినియోగమొనర్చలేదనే చెప్పవలయును సాహితీరంగములో. ఆ ప్రయత్నమేదో మొగ్గయందే వాడిపోవుట బాధాకర విషయము. దాని భావనలే చివరివరకు మిగిలినవి. ఆవుల గోపాలకృష్ణమూర్తికి సంబంధించిన హాలాహలాన్ని కంఠస్థమొనరించి, అమృతాన్ని మాత్రమే అందజేయ ప్రయత్నించిన మా గురువులు ఎలవర్తి రోశయ్యగారి సలహాలు శిరోధార్యములుగ స్వీకరించి యీ గ్రంథమును వెలువరించితిమి. వారికి మా నమభినందనాలు. ఇతరత్రా తోడ్పడిన ఎ.జి.కె. అభిమానులు తోటకూర శ్రీరామమూర్తి, మాధవరావు, పోలు సత్యనారాయణ, వెలిది వెంకటేశ్వర్లు మన్నన పాత్రులు. తమ గ్రంథములలో గోపాలకృష్ణమూర్తి రచనలు పునర్ముద్రించుకొనుటకు తక్షణమే అంగీకరించిన అమ్మిసెట్టి లక్ష్మయ్య, గౌరిబోయిన పోలయ్య, కలపాల సూర్యప్రకాశరావుగారలకు, తమ తమ పత్రికల నుండి పునర్ముద్రణకు అనుమతించిన సంపాదకులకు ధన్యవాదములు. ఎ.జి.కె.పై అవ్యాజానురాగము చూపుచు, మేము కోరినదే తడవుగా గ్రంథ ప్రచురణకు మమ్ములనే తొందరజేసి ప్రచురించిన “తెలుగు విద్యార్థి” సంపాదకులు కొల్లూరి కోటేశ్వరరావుగారు సాహిత్యాభిలాషనేగాక, భావసాహసమును ప్రదర్శించి, మా ప్రేమపాత్రాభిమానులైరి. వారి సేవలు మాన్యములు. ఇట్లు ఎం. శ్రీరామమూర్తి ఎన్. ఇన్నయ్య విషయసూచిక సాహిత్యం – ఔచిత్యం 1958లో ఎ.సి.కళాశాల గుంటూరు ఆంధ్ర భాషా సమితి నుద్దేశించి చేసిన ప్రసంగం భారత సంస్కృతి 1958 జనవరిలో ఆంధ్ర పత్రిక నుండి పునర్ముద్రితం, దీని విస్తృత పాఠం శ్రీ కొల్లా శ్రీకృష్ణారావుగారి “రారాజు” కావ్యంలో పీఠికగా చూడనగును. ఆంధ్ర భాషా ప్రాశస్త్యము ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆంధ్రాభ్యుదయ వారోత్సవాల ప్రారంభోపన్యాసం 1960లో కావ్య ప్రయోజనం రేపల్లె శ్రీ శారదా విద్యాపీఠంలో చేసిన ప్రసంగం 1958లో కావ్యలోకం – రైతు విప్లవం శ్రీ అమ్మిసెట్టి లక్ష్మయ్య (తణుకు) గారి “రైతు కల్యాణము”నకు పీఠిక 1948 సాహిత్యములో సాంఘిక విప్లవము శ్రీ గౌరిబోయిన పోలయ్య (ఇంకొల్లు, గుంటూరు జిల్లా) గారి “పిలక రాయుళ్ళు” గ్రంథానికి పరిచయం. ఏటుకూరి వేంకటనరసయ్య స్మారక సంచికనుండి చల్లా పిచ్చయ్యశాస్త్రిగారి ప్రతిభావ్యుత్పత్పులు ఆంధ్ర పత్రిక నుండి రవీంద్రనాథ ఠాగూరు 1960లో చీరాల సాంస్కృతిక సమితిలో చేసిన ఉపన్యాసం మన కవి కాటూరి కవి అస్తమించిన సమయములో వ్రాసినది ప్రజావాణి నుండి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఆంధ్ర భూమి నుండి, కవి మరణించిన సందర్భంగా వ్రాసినది 1960లో శ్రీ త్రిపురనేని రామస్వామి భావపరిణామం ‘కవిరాజదర్శనం’ నుండి సూతపురాణం ‘కవిరాజదర్శనం’ నుండి భారతీయ సంప్రదాయం – నవ్యతా ప్రభావం 1965లో కేరళ రచయితల సమావేశంలో చదివిన వ్యాసం సాహిత్యం – ఔచిత్యం తెలుగు సాహిత్యం ప్రాఙ్నన్నయకాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో ఉజ్జ్వలంగా వుంది. అయితే మధ్య మధ్యలో కొన్ని దిగజారిపోయిన ఘట్టాలు లేకపోలేదు. సాహిత్యం సమాజానికి ప్రతిబింబం. “మీ సాహిత్యాన్ని మాకు చూపించండి. మీ జీవిత విధానాలను మీ ఆచార వ్యవహారాలను నేను చెబుతాను” అని ఠాగూరు అన్నాడు. అందువల్ల సాహిత్యంలో సమాజం ఎప్పుడైనా ప్రతిఫలించక తప్పదు. నవ్య సాహిత్యం చూస్తే 1900 దాటిన తర్వాత ప్రారంభమైనది అని బాగా చెప్పవచ్చు. ప్రారంభ కాలంలో శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి వంటివారున్నారు. తరువాత నవ్య సాహిత్యం సంగతి, అభ్యుదయ, ప్రజా తెలంగాణా సాహిత్యాలు ఏర్పడ్డాయి. గత ఇరవై సంవత్సరాల్లోనూ సాహిత్యోత్పత్తి బాగానే జరిగింది. ఒప్పుకోవాలి. ఇందులోని ఔచిత్యాన్నిబట్టి చూస్తే సాహిత్యమేదో, సాహిత్యం కానిదేదో మనకు స్పష్టమౌతుంది. “సాహిత్య ప్రయోజనం విశ్వశ్రేయస్సు అనుకొందాం. అప్పుడు విశ్వానికి శ్రేయస్సును కలిగించేవి ప్రాచీన సాహిత్యమంతటిలోను రెండు మూడు వందల గ్రంథాలు తేలుతాయి. పట్టుపట్టి కూర్చుంటే వీటిని నాలుగైదు మాసాల్లో చూడవచ్చు. తరువాత మన అభిమాన గ్రంథాలు అయిన వాటిని శ్రద్ధగా చదువుకోవచ్చు.” “ప్రభుత్వం సాహిత్యానికి అండగా నిలవదు. సాహిత్యకులు ప్రజల ముందుకు రావాలి. తాము వ్రాసేది ప్రజలకు తెలిసేటట్లు చెయ్యాలి. అప్పుడే సాహిత్యానికి జీవనం వుంటుంది. పరిషత్తుల వంటివి పనిచేస్తాయి అనుకోవటం భ్రమ. వాటి అవసరం మనకు లేదు. వూర్వులకూ మనకూ అభిరుచులలో తేడా ఉంది. ఆనాటి వారికి తెలియని ఎన్నో విషయాలు ఈనాడు మనకు తెలుసు. అనేక రంగాల్లో ప్రసరించటంవల్ల మన పాండిత్యం పలచబడింది. పూర్వులకు మల్లే ఏ విషయంలోనూ మనకు కూలంకష పాండిత్యం లేదు. పూర్వం కంటే ఈనాడు రచయిత సంఖ్య బాగా పెరిగింది. రాజకీయాల్లో సంఖ్యా బలాన్ని బట్టి గుణబలం పెరుగుతుందని ఒక విశ్వాసం వుంది. కానీ, సాహిత్య విషయంలో ఆ విధంగా ఔతుందని నాకు నమ్మకం లేదు” “మంచి సాహిత్యానికి జనంతో నిమిత్తం లేదని పూర్వులూ నవ్యులలో కొందరూ అన్నారు. అలా అనుకోడం అనుచితం. అంతకు ముందు ఒక్క చోటనే వున్నదనుకున్న చిక్కు సాహిత్యంలో కూడా ప్రవేశించింది. సినిమా రంగంలో అసూయ పెరిగి పెరిగి సాహిత్యంలో చోటు చేసుకుంది. ఇటువంటి సందర్భంలో కవిశేఖరులైన తిరుపతి వెంకటేశ్వరుల మార్గం అనుసరణీయం. వీరు సాహిత్యాన్ని దేశం ముందుకు తీసుకువచ్చారు. దేశమంతటిలోనూ పద్యమంటే అభిమానం కలగజేసింది వీరే. ఆంగ్లంలో చెప్పాలంటే వీరు కవిత్వాన్ని “డెమోక్రటైజ్” చేశారు. “సాహిత్యానికి, జీవితానికి అవినాభావ సంబంధం ఉందని నా విశ్వాసం. సాహిత్యం లేకపోతే జీవితం లేదు. అయితే “సాహిత్యం తెలియకపోయినా కోటానుకోట్లు బ్రతుకుతూ వున్నారు కదా” అని కొందరు ప్రశ్నిస్తారు. నిజమే ప్రాచీనకాలంలో సాహిత్యం తెలియకపోయినా పురాణ శ్రవణంవల్ల ఆనాటి ప్రజలకు సాహిత్య పిపాస కలిగేది. సాహిత్య సౌందర్యాన్ని ఆరాధించ గలిగేవారు. ఈనాడు ఆ స్థానాన్ని రేడియోవారు ఆక్రమించుకున్నామని అహంభావపడుతున్నారు. కాని ఒకప్పుడు జాషువాగారు “పాడకమ్మ నీవు పాత పాట” అని రేడియోను సంబోధిస్తూ కొన్ని పద్యాలు చెప్పారు. అయితే ఈనాడు వారూ, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారూ, పింగళి లక్ష్మీకాంతంగారూ రేడియోలోనే పని చేస్తున్నారు. కాబట్టి పాతపాటల స్థితి మార్చి కొత్త కొత్త కార్యక్రమాలు అందజేస్తారని ఆశిద్దాం. ఏమైనా రేడియో పురాణ శ్రవణం స్థానాన్ని ఆక్రమించగలదని నాకు నమ్మకం లేదు.” “వీలున్నన్ని చోట్ల సాహిత్య గోష్ఠులు జరగాలి. కాలేజి విద్యార్థులు సెలవు రోజులలో దగ్గరి ప్రదేశాల్లో సాహిత్య గోష్ఠులు జరిపించాలి. అప్పుడే సాహిత్యానికి రినైజాన్స్, ఇప్పుడు మన సాహిత్యం కొనేవాళ్ళు లేరు. అందులోనూ పద్య గ్రంథమైనవి అసలెవరూ చదువరు. “నీవు వ్రాసినది మంచి గ్రంథం” అని మెచ్చుకుంటేనే కవికి ఆనందం. అప్పుడే అతడు ఇంకా ఉత్సాహంతో కావ్యసృష్టి చెయ్యగలడు. ఇప్పుడు మనం సంధియుగంలో వున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలోనే నాలుగువందల మంది కవులైనా మన్నికతో వ్రాయగలవారున్నారు. ఈ ఆసక్తినంతటినీ చదువులోకి మార్చితే మంచి సాహిత్యం వస్తుంది. అప్పుడే ఔచిత్యం గురించిన ఆలోచన.” “ప్రాక్పశ్చిమ సాహిత్యాలలో విమర్శ సాహిత్యం ఒక ప్రత్యేక స్థానాన్ని గణించుకున్నది. తెలుగులో మాత్రం ఇంచుమించుగా విమర్శ సాహిత్యం లేదనే చెప్పాలి. రామలింగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి నడకుదుటి వీర్రాజు, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ప్రభృతులు కొంత కాలం క్రితం విమర్శలు చేశారు. ఈనాడు పై మెట్టుకు వచ్చిన విమర్శకులు ఎవ్వరూ లేరు. శ్రీ హనుమంత రావు వంటివారు ఈనాడు మంచి విమర్శలే చేస్తూవున్నారు.” “విమర్శకునికి బాగా కావ్యపఠనం కావాలి. మంచి సాహిత్యం కావాలి. కవికంటే కూడా విమర్శకునికి బాధ్యత ఎక్కువ. కవి ఊహను, సమాసాన్ని భేదించగల శక్తివుంటేనే విమర్శకుడు చేసే విమర్శ మంచి విమర్శ ఔతుంది. ఈనాటి యువకవులలో చాలామందికి కవితాశక్తి బాగావుంది. కానీ రచనలో కుదురు కనిపించటంలేదు. ఈ విషయాన్ని విమర్శకుడు స్పష్టంగా చెప్పి సరిదిద్దాలి. సాహిత్య గోష్ఠులలో కవులు పాల్గొనేటప్పుడు వాళ్ళతోపాటు విమర్శకులు కూడా వెళ్ళాలి. లేకపోతే నాలుగైదు గోష్ఠులలో పాల్గొన్న వెంటనే కవి గొప్పవాడినైపోయాననుకుంటాడు. అతడ్ని సవరించి మంచి మార్గాలలో పెట్టవలసిన బాధ్యత విమర్శకుడిది.” “ఈనాడు వామపక్ష రాజకీయ సిద్ధాంతాలు వచ్చిన తరువాత సాహిత్యంలో కొత్త ప్రమాదం వచ్చింది. సాహిత్యం సాహిత్యంగా కాక రాజకీయ వాసనతో వస్తూవుంది. దానిని మనం గట్టిగా ప్రతిఘటించాలి. ప్రభుత్వం స్థాపించిన “అకాడమీ” నిజంగా వర్థిల్లితే రాజకీయపు ప్రమాదం మనకు గలుగవచ్చు. రష్యా దేశంలోనూ, ఇంకా ఇతర దేశాల్లోనూ ప్రభుత్వం సాహిత్యాన్ని ఆదేశిస్తుంది. ఇక్కడ కూడా అదే కావచ్చు. అప్పుడు మనం ఔచిత్యం అంటే శృంగభంగం అవుతుంది.” “ఔచిత్య విషయంలో పెద్దకవులే తప్పులు చేస్తారు. కవికి జీవితశాస్త్రం కూడా రావాలి. నన్నయభట్టు వినత తన అండాన్ని చిదిపివేసినప్పుడు “ఉత్తరార్థకాయ సహితుండును అయిన అసురుడు పుట్టాడని” అన్నాడు. కాని పిండోత్పత్తి అట్లా జరగదు. మొదట ఉత్తరార్థం యేర్పడి తరువాత పూర్వార్థం ఏర్పడుతుందని ఆనాటివాళ్లు అనుకునేవారేమో! ఇది నన్నయ్యచేసిన ఔచిత్యభంగం, తెనాలి రామకృష్ణుడు నిగమశర్మ తల్లిదండ్రులను వర్ణిస్తూ, “వడవడవడకు వృద్ధులు” అని అంటాడు. కాని నిగమశర్మకు తమ్ములున్నారని, వాళ్ళు నేలలో వెడలని తమ్ముగుఱ్ఱాలని అంటాడు. ఆవార్థక్యానికి ఈ శిశువులకు సంబంధమా బుద్ధులు చెపుతూ శీలగుణోన్నతిగలిగిన విప్రకన్యలను సహస్రమయినా వరించి రమించమంటుంది. ఆ విధంగా చెప్పటమే ఔచిత్యభంగం, పైగా ఈ నిగమశర్మను శీలగుణోన్నతి కల్గిన కన్యలు ఎట్లా పెండ్లిచేసుకుంటారూ? చేసుకుంటే శీలగుణోన్నతి ఎక్కడ వుంటుంది? మెలకువలు ఔచిత్యంతో పోషణ చెయ్యటానికి శ్రద్ధకావాలి” “నవ్యసాహిత్య నిర్మాతలలో ఒకరైన కందుకూరి శకుంతల నాటకంలో ‘అనాఘ్రాతం పుష్పం’ అనే శ్లోకాన్ని అనువదిస్తూ, వాసన చూడనట్టి ప్రసవమ్ము అని చివరంటా బాగా వ్రాసుకొచ్చాడు. కాని చివర ‘భుజింప విరించి వ్రాసెనో’ అని అనౌచిత్యానికి పాల్పడ్డాడు. తెలుగులో స్త్రీని భుజించటం అని అనరు. అది సంప్రదాయానికి విరుద్ధం. సంస్కృతంలో ఉన్న “భోక్తు” అనేదానికి భుజించుట అనువాదం. కేతన దశకుమార చరిత్ర వ్రాసి కవిబ్రహ్మ అయిన తిక్కన్నకు అంకితం చేశాడు. నాకావ్యాన్ని కవి బ్రహ్మ పుచ్చుకున్నాడు. ఇంక నా కావ్యం గురించి నేనెందుకు చెప్పుకోవాలి అని అన్నాడు. సౌందరనందంలో పింగళి కాటూరి “కేతనతోడి పొత్తునకు కాదని చెబుతూ తమ కావ్యమును తమ గురువైన వెంకట శాస్త్రిగారికి అంకితం చేశారు. తరువాత సీసపద్యం కేతన తిక్కన గురించి వ్రాసినదే. కొద్ది అక్షరాల మార్పులతో వీరూ వుపయోగించుకున్నారు. అంటే తమ గురువు తిక్కన అంతటివాడు. తాము మాత్రం కేతన అంతటి వాళ్ళు కాదని భావం. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ “అల నన్నయ్యకు లేదు తిక్కన్నకు లేదు” అని చెబుతూ తన గురించి, ఎక్కువగా చెప్పుకున్నాడు. అంటే నన్నయ్యకు తిక్కన్నకు తనవంటి శిష్యుడుంటే, చెళ్ళపిళ్ళ అంతటి వాళ్ళు అయ్యేవారన్నమాట. ఇది తప్పని అనటం లేదు. ఔచిత్యంలో అంతస్థులు యిలా వుంటాయి.” భారత సంస్కృతి భారత సంస్కృతి బహుళ ప్రచారంలోకి వచ్చి యన్నో యేండ్లు, పూండ్లు గడచిననూ, దాని వైవిధ్య వైశిష్ట్యాలను గ్రహించి, ఆచరించు లోకం కొరవడియున్నట్లే యెంచబడుచున్నది. తెలియనివారనేకులుండగా తెలిసినవారి ఆచరణ అనుసరణీయంగా లేమికి విచారణలేమి తోడౌట శోచనీయము. అసలే జంబూ ద్వీపం, అందులో కర్మభూమి, ఆర్యావర్తం, భారతదేశం. దీని సంస్కృతి దివంగతములు ప్రాకి, సనాతనమైన మన్ననలనంది, ప్రశస్తి గాంచినది. చతుర్వేదములు చాతుర్వర్ణ్యములకు జాలవేమోనన్నట్లు, పంచమ వేదంగా భారత సంహిత, ప్రతిభావ్యున్నతలలో గరీయ సత్యాన్ని చూపి, ఆవిష్కరింపజేయబడినది. నాటినుండి దానిపట్ల, అందలి ప్రతిపాద్య సంస్కృతిపట్ల మనవారు చూపిన, నేటికీ చూపుచున్న ఆదర, భక్తి ప్రపత్తులు నిర్విశేషములు, అట్లగుట, అట్టి సంస్కృతిని మనమొకసారి పరిశీలించుట ఆవసరమేగాక, లోక వృత్తమునకు అత్యంత ప్రాముఖ్యము. 2 భారత కథ అలౌకిక జగత్తు భావించినంత ప్రాచీనము గాని, ప్రశస్తము గాని కాదు. కొందరు పండితులు క్రీస్తుకు పూర్వం 1400 లేక 1000 మధ్య కాలమునాటిదనీ, మరికొందరు 1000 లేక 900 మధ్య కాలం నాటిదనీ భావించుచున్నారు. ప్రాచీన కాలంలో యెన్నో ఆటవిక, విహారజాతులు ఉత్తర భూముల్లో విహారం చేస్తూ వుండెడివి. గంగానదీ పై భాగంలో, యమునకు మధ్య ప్రాంతంలో ‘భరత జాతి’ యను నది వుండెను. ఋగ్వేదంలో, పాణిని రచనలో ‘భరతజాతి’ వుదాహృతమయ్యెను. ఇట్టి జాతులు ఉత్తరాదిని అనేకం కలవు. వేదకాలం నాటి పురుభరతులు చారిత్రకంగా ప్రాధాన్యత వహించిరి. సరస్వతి, గంగానదుల మధ్య వారి రాజ్యం మూడు భాగాలుగా హస్తినాపురి ముఖ్య పట్టణంగా పాలించిరి. అదే నేటి మీరట్ ప్రాంతం. భరత కుటుంబీకుల దాయభాగ అని నిర్ణయ యుద్ధ గాథలే భారత కథా విధాన గాథా స్రవంతులు. అభిమన్యు కుమారుడు పరీక్షిత్తు. ఆయన తనూజుడు జనమేజయుడు, భారత కథారచనా ప్రారంభుడు, భారత సంస్కృతికి పట్టుకొమ్మ, అతని యనంతరం శతానీక, అశ్వమేథ దత్త, అభిసింహ, కృష్ణ, నికషులు వారసులుగా పాలించిరి. నికషుని కాలంలో గంగ వరదలవల్ల హస్తినాపురి కొట్టుకొనిపోగా, ముఖ్య పట్టణము ‘కౌశాంబికి’ మార్చిరి. ఇది అల్హాబాదుకు 30 మైళ్ళలో ఉన్న నేటి ‘కోసాం’ పట్నం. నికషుని సమకాలికుడు విదేహ రాజగు జనకుడు. నేటి నేపాలు సరిహద్దులలోని జనకపూర్ ఆనాటి ముఖ్య పట్టణమైన మిథిల. ఇది మరొక సమకాలిక సాంస్కృతిక కేంద్రం. తరువాత, ఆర్య – ఆర్యేతర కలియకలతో మగధ రాజ్య కాలానికి వస్తాము. బౌద్ధ జైన సాహిత్యాలు ఆవిర్భవించిన కాలం, భారత తత్త్వం వచ్చిన రోజులు. బ్రాహ్మణాలలోని సంప్రదాయజ్ఞతకు భిన్నంగా, ఆలోచనాక్రమం, మానవత, సభ్యత పెరిగి, మానవ విజ్ఞాన, నిర్మాణ పరిధులు హెచ్చిన రోజులు మగధ, కోసల, వత్స, అవంతి పట్టణాలు దీనికి ముఖ్య కేంద్రం. 3 భారతము విచిత్ర కావ్యము... కావ్యమే కాదు, అదొక ప్రత్యేక సాహిత్యలోకం. భారతం రచించినది ఫలాని కవియనిగాని, అది ఫలాని కాలంలో వ్రాయబడినదని గాని, నిర్ణయింప వీలులేదు. ఎందరెందరి గాథలో, ధీరోదాత్త సంక్రందనలో, కూర్చి యేర్చి, చేర్చి, పెంచి, పోషించి, అసలు నాయకులకు, కథకు సంబంధం లేని, వుండ వీలులేని కాండలు, కథలు ఉపాఖ్యానాలు, పుక్కిట పురాణాలు, కలిపినారు. నీతి మంజరులు, తాత్త్విక గాథలు, బ్రాహ్మణ సంజనితములైన కథలు, కులవర్ణనలు, వర్ణాశ్రమ ధర్మ విశిష్టతలు, ప్రకృతి విశేషాలు పురాణ ఫక్కిలో చేర్చబడినవి. శైవ కథలు, వైష్ణవ చిద్విలాసాలు సంతరించారు, జగాలనంటిన యుగాలుగా ప్రోదిచేసిరి. దాని నొక భాషార్ణవ సామ్రాజ్యంగా మార్చిరి. వ్యాసుడు వైశంపాయనుని శిష్యుడై, జనమేజయునకు నివేదించిన గాథలే భారతముగా మనకు చిక్కినది. సూతుడు నైమిశారణ్యములో శౌనకాది మహామునుల కన్నట్లు, ఋషి ప్రోక్తమేగాక, ఋషులకై ప్రోక్తముగా దింపిరి. మొదట ‘జయ’ అను పేరబరగి, ‘భారతము’గా మారి, రాను రాను ‘మహాభారతము’గా పరిణతి నొందినది. 4 వింటర్ విట్స్ పండితుడన్నట్లు భారతం ఒక కావ్యం కాదు, ఒక పురాణం కాదు, అది ఒక సాహిత్యం. కథకు సంబంధం లేని పౌరుషగాథలు, భరతుని కథ, యయాతి కథ, నలదమయంతుల కథ, కథలో కథలుగా, నాటకంలో నాటికగా చేర్చబడినవి. శతపథ బ్రాహ్మణంలోని ‘నాదనైషధకథ’ గూడా బైటికి లాగబడింది. రామ కథవుంది. సంజయుని తల్లి విదుల కథ కలదు. కవుల గాథలే గాక, పుజారి భావాలతో నింపారు. బ్రాహ్మణ దృక్పథంలోని మార్పుకై, కూర్పులు చేశారు. చవనుని కథ, అశ్వని దేవతలు వయస్కుని చేయుట, శతపథ, జైమిన్యాయ బ్రాహ్మణంలోని కథలను మార్చి భారతంలో జొనిపారు. ఇంద్రునంతటివాడు బ్రాహ్మణ సంతుష్టి చేయనిచో పదభ్రష్టుడౌనన్న కథలు చేర్చి, ఆయా ప్రతిభలను, మహిమలను వెలార్చారు. మను కథ, సావిత్రీ గాథలు కలిపాడు. జానపద పాటలనెన్నిటినో రూపం మార్చి చేర్చారని వింటర్ విట్స్ అభిప్రాయం. తీర్థయాత్రా భాగం బ్రాహ్మణ కథాకలనాన్ని బాగా పెంచింది. రోమన రుషి నోట విశేషించి ప్రసంగించిరి. ఆగస్త్యుని ప్రాశస్త్యముగాని, విశ్వామిత్ర, వశిష్ఠుల రాజర్షి, బ్రహ్మ వాద ప్రతివాదములు గాని బ్రాహ్మణ ప్రతిభను చాటినవే.. నాటి సాంఘిక వైషమ్య రీతులను చూపినవి. విదులుని, బావిలోని గాథలు, ముద్గలుని కథలు కర్మ సిద్ధాంత ప్రతి పాద్యాలుగాను, గౌతమి కథ మరణ దేవుని ప్రతిభను, కర్మ కాలచక్ర బలీయతకు నిదర్శనంగానూ, సాక్షీభూతంగానూ చెప్పిరి. పండ్రెండు పదమూడు పర్వాలలోని గాథలన్నీ కథకు అవసరం లేని ప్రాశస్త్య గాథలే.. భీష్మపాత్ర ద్వారా పరిపుష్టం చేయబడినవి. అసలు తత్వం, భగవద్గీత ఆవిర్భావం, భారత కథాకలనలోని ఫోర్జరీ భాగం, పురుషసూక్తానికి నకలు. భాగవత మత దృష్టి ప్రతిపాదింపబడి, వైష్ణవ మత దృష్టికి పరివర్తన పొందిన మార్గ రీతులు, ఛాయలు పరిశీలనార్హములు. ఇది మూలంలో లేని మూలభారతం. క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్ది నుండి, క్రీస్తు తర్వాత మొదటి శతాబ్దిలోగా పొందిన రూపం, చేర్చిన భాగం. హరివంశం అంతా అదేరకం. హరివంశ పర్వంగాని విష్ణు పురాణ భాగం గాని, భవిష్య పురాణంగాని అటులనే తటపటాయింపులు లేని చేర్పులు, కథ ఇట్టిది. 5 రెండు రకాల భారతం కలదు, ఉత్తర దక్షిణాదికాలు. ఉత్తరాది దానిలో, శారత, లేక కార్మిరి, కేపాలి, మైథిలి, బెంగాలి, దేవనాగరిలో కలవు. దక్షిణాదిన తెలుగు, మళయాళం, గ్రంథములు కలవు. ఉత్తర, దక్షిణ రీతులకు యూరియామడల దూరమున్నది. ఉత్తరాదివారి ప్రతికన్నా దక్షిణాదివారి ప్రతి సుదీర్ఘం, కొత్తలు చాల కలవు, చేర్పుల వైపరీత్యం విశేషం. భారత ప్రతులు కలకత్తా, బొంబాయి, కుంభకోణం ప్రతులు కలవు. ఒకదానికొకటి పోలనిరీతి కలవు. పూనాలోని భండార్కర్ కేంద్రంవారు సంగ్రధిత ప్రతిని సమగ్ర రూపంలో తేవాలని కృషి చేస్తున్నారు. శుంతాంకర్ పండితుడు, భారతాన్ని ‘పాతకొత్తల మేలు కలయిక’గా భావించాడు. ‘క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్ది తర్వాతనూ కాదు’ అని వింగర్ నిట్స్ అన్నారు. బౌద్ధులు, యవనులు భారతంలో వుదాహృతులైరి. బాణుడు, కుమారిలుడు గూడా పేర్కొనబడిరి. నాల్గవ శతాబ్ది నాటికి ‘స్మృతి’గా గౌరవాన్ని పొందనారంభించిరి. 6 భరతుల యుద్ధం చారిత్రకమే. తక్కిన కథ మాత్రం యెన్నో జానపద కథల సంహిత, అందుకే భారత సంహిత. సాంఖ్యాయాన శౌతసూత్రాలు గూడా కురుక్షేత్ర సంగ్రామాన్ని ప్రస్తావించినవి. అశ్వలాయన గృహసూత్రాలు భారత, మహాభారతాలను పేర్కొన్నవి. పతంజలికి ‘పాండు కథ’ తెలుసు. పాణిని పురాణ నామముల నిరూపణ జేయుటయేగాక, ‘మహా భారత శబ్ద విషయం’ పరామర్శించారు. మౌర్యుల అంతాన్ని చూచి, సుంగుల రాజ్యాన్ని స్థాపించిన పుష్యమిత్రుడు బ్రాహ్మణ సంప్రదాయాన్ని ప్రోది చేశాడు. మనుస్మృతిని, భారత, రామాయణాదులను బ్రాహ్మీణీకరణం చేశాడు, జమీందారీ, పూజారీ భావాలను సంఘటిత పరిచాడు, నేటికి మనకు పరంపరగా దిగిన మహాభారతాన్ని ఈ రూపంలోకి నిగదించి, వర్ణాశ్రమ ధర్మానుష్ఠానానికి ప్రియదూతియైనాడు. ఆయన కుమారుడు అగ్ని మిత్రుడే ‘మాళవికాగ్ని మిత్రాని’కి నాయకుడు. అది పూర్వం కథ. 7 భారత కర్తృత్వము నిర్ణయింపరానిది. వైశంపాయన సౌతికృతము మాత్రమే కాదు. గ్రంథ పరిమితియు నిర్వచింపరానిదియే! వావిళ్ళవారి ప్రతిని బట్టి 84,770 శ్లోకములు ఆంధ్ర సాహిత్య పరిషత్తులోని ప్రతినిబట్టి 99,057 శ్లోకములు నన్నయ్యభట్టు లెక్కలనుబట్టి 1,00,700 వచ్చినవి. తెలుగునాడులోని ప్రతులే ఇట్లుండ, అన్ని ప్రాంతముల ప్రతులు జూచిన శ్లోక సంఖ్య యెట్లుండునో! ఇది గ్రంథాకృతి. 8 ఇక తెలుగు భారత గాథలు నగ్రజన్ములకు ననుగ్రహమున జారుతర మహాగ్రహారంబులిచ్చుచు, విప్రకులము నెల్ల బ్రోచుచు, సమస్త వర్ణాశ్రమ ధర్మరక్షణ మహా మహితుడై రాజరాజ నరేంద్రుని దయతో తెలుగు భారతం నన్నపాద్యుని కథా కవితార్థ యుక్తిలో వెలసిల్లి.... ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, యధ్యాత్మలిదులు వేదాంతమనియు, నీతి, విచక్షణుల్ నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహా కావ్యమనియు, ..... ...... ..... ఐతిహాసికులితిహాసమనియు, బరమ పౌరాణికుల్ బహుపురాణ, సముచ్ఛయంబని మహిగొనియాడు చంద్రు సత్య వాక్ప్రబంథ..... సర్వలోక పూజ్యమయిన దాని, పంచమవేదమై పరగు భారత సంహితజేసెను. భారత దేశంలోని విజ్ఞానమంతా వేదంలో కలదని, వేదేతరంగా విజ్ఞానంగాని, జ్ఞానంగాని లేదనీ, భారతీయ సంప్రదాయము, భారతాన్ని ‘పంచమవేదం’ చేసి వ్యాసనామంతో, దీనికి మించి తత్త్వంగానీ, శాస్త్రంగాని, వేదాంతంగాని, నీతి శాస్త్రంగాని, మహాకావ్యంగాని. యితిహాసంగాని పురాణంగాని లేదను నవ్య భారత సంప్రదాయాన్ని రూఢి చేశారు. యుగాల విభజనకృత, త్రేతా ద్వాపర కలియుగములుగా బిగించి, ‘ధర్మంబు కాశికాస్థాన మధ్యంబున నాల్గు పాదంబుల నడిచియాడు’ స్థితి నుంచి యేకపాద గమనగా చేయగలిగాడు. సంస్కృతి, జాతి, మత, వర్ణ, కుల, దేశ పొలిమేరలలో మలుపబడగలిగినది కాదు. అది మానవవేద్యంగా మాత్రమే మనగలదు. పూర్ణ పురుష సంప్రదాయాన్ని యూహింపగలిగినవారు ఆ సదాశయాన్ని చేరగల సాధన సంచయాన్ని చేకూర్చుకొనలేక వర్ణాత్మక దృష్టిలో దవిలి, ఆశయ భంగమునకైన అంగీకరించిరిగాని, యేత ద్దృష్టిమానరైరి, అది భారత సంస్కృతికి జీవగర్ర. నన్నాపార్యుని దయచే, వర్ణాశ్రమ ధర్మ రక్షణకైన పంచమ వేదంగా, మారి మారిపోయినది. తిక్కన కొంత జీవమూది, అట్టి సాంఘిక వృత్త రక్షణకు పూర్తి దోహద క్రియగాకాక, శిల్ప దృష్టి చేర్చి, రక్షణ కల్పించినా, అసలు మూలమే సంకుచిత సంస్కృతీ విలసితం గనుక, భారత సంస్కృతి తెలుగులో అటులనే నిలచిపోయినది. భారత గత సాంఘిక దృష్టి సమాజ నిర్మాణ విధానం, అనాగరక, నాగరక మిశ్రితం, విస్తృత సంస్కృతికి విరుద్ధం. దీనికి మూలకారణం, మన పూర్వ అపరిణత తత్త్వ జ్ఞానము, కర్మకాండకు ప్రాధాన్యతనిచ్చి, జ్ఞాన భాగాన్ని వెల్లడి కానీయక మరుగు పరచిన కతానకల్లిన వికారము, ‘టక్కునేర్పెడి కవుల గంటాల వ్రాత’ అది. దీనికితోడు పాండవుల పౌత్రుడైన జనమేజయు పంపున భారత రచన సాగుటచే జనమేజయు పక్షీయులెల్లరు వుత్తమోత్తములనీ, వారికి సాయపడినవారు మహనీయులనీ, పాండవులతో దాయభాగ పోరాటం పెట్టుకున్న కౌరవులు దుష్టులని, వారికి సాయపడినవారు నీచులని గ్రంథం వ్రాయక తప్పినది కాదు. కవి తనను నియుక్తుణ్ణి చేసిన అస్థానమును గూర్చి వ్యతిరేకంగా వ్రాయడు. భారత కథలోని జుగుప్సకు ప్రధాన కారణమేయిది, తరువాత పెంచిన కవులు యెవరికి తోచినది వారు పూరించినా, మూలము పెంచురీతినే చేసిరి. వ్యాఖ్యాతములు లక్షలున్నను, వరవడి యేక రాసికము. 9 భారత సంస్కృతిని హేతువాద దృష్టితో, విమర్శ బుద్ధితో పరిశీలించినచో, అక్షర లక్షలుగా వివేక రహిత విధానాలు ధర్మాలుగా చిత్రించుట కనబడుతుంది. మంచిచెడుగా, చెడుమంచిగా యింతగా పరివర్తనం పొందిన కావ్య జగత్తు మరొకటి వుండదు, లేదు. పూర్వ విషయం మీద విలువ కట్టలేని ప్రాకృత లోకము, వర్తమాన సంఘటనల మీద మాత్రము యేమి విలువ కట్టగలదాయన్న సంశయము విజ్ఞులకుతోచి, భారత సంస్కృతి మీద, సంఘక్షేమ దృష్టితో అభ్యుదయ కాముల తిరుగుబాటు లేవదీసిరి. మహారాష్ట్ర నుండి డాక్టర్ ఫూళే, బెంగాలు నుండి రాజారామ్ మోహన్ రాయ్, ఆంధ్ర నుండి వేమన, కందుకూరి వీరేశలింగం, తమిళనాడు నుండి పిట్టి త్యాగరాయ శెట్టి, మలబారు నుండి డాక్టర్ నాయర్, కర్నాటకం నుండి బసవన్నవార్ తిరుగుబాటుకు తొలి నాయకులు. ఇంతకన్న తీవ్ర ధోరణిలో, సమగ్ర దృష్టితో త్రిపురనేని రామస్వామి తిరుగుబాటు వుద్యమాన్ని కావ్యరంగంలో లేవదీశారు. పెండ్యాల వెంకట సుబ్రమణ్య శాస్త్రి, కొడాలి లక్ష్మీనారాయణ, గోపరాజు రామచంద్రరావు మొదలుగాగలవారు కొంతకు కొంత అందుకొనిరి. ఆ తిరుగుబాటు భావ విప్లవం కలిగించింది, కాని దానికి యింకను సరియైన రూపం రాలేదు. అలలు లేచి, వెనుకాడినవి, పల్లములలో నీరు నిలచి వున్నది.

పువ్వాడ నాగేశ్వరరావువ్యాసాలు-ఆవుల గోపాలకృష్ణమూర్తి పీఠిక

పరిచయం ఈ వ్యాస సంపుటి రచయిత, రమారమి గత పాతికయేండ్లుగా ఒక ప్రత్యేక, విశిష్ట సాంఘిక దృక్పధంతో విషయ పరిశీలన చేస్తూ యిటీవల చరిత్రపట్ల మనసునిల్పి, కొన్ని రంగాలు కూలంకషంగా తరచి చూచి, సాంఘిక ఉద్యమాల రూపురేఖలను పరామర్శించి, ఒక బృహద్గ్రంథాన్ని తయారు చేయుటకై విషయ సేకరణ చేశారు. ఆ కృషి జరిగే సమయాల్లో ఆంధ్రలో కరణీకములను గూర్చి దేశంలో సంస్కృతమును గురించి దృష్టి సారించి ఆ యా విషయాలను తడవి చూపారు. నాగేశ్వరరావుగారి స్వభావ, తత్త్వములను యెరిగిన వారికి యీ పుస్తకం చదువుతుంటే వారితో మాట్లాడినట్లే ఉంటుంది. 'భాషను బట్టి మనిషిని పోల్చ' వచ్చు నన్న నానుడికి వీరి రచన బలీయమైన తార్కాణం. ఆంధ్ర సాంఘిక జీవితంలో 'కరణీకాలకు' మొన్న మొన్నటిదాకా కొన్ని ప్రాంతాల్లో యిప్పుడు గూడా చాలా ప్రముఖ స్థానం వుంది. గ్రామీణ జీవితాల్లో కరణాలు ఒక కీలక స్థానాన్ని ఆక్రమించారు. చారిత్రక సన్నివేశాలెట్లా ఉన్నా సాంఘిక జీవితాన్ని కొన్ని యెడల రాజకీయ జీవితాన్ని, నియతం చేయగల శక్తి, యీ కీలక స్థానాలకు దక్కింది. అది దృష్టిలో నుంచుకొనే నాగేశ్వరరావుగారు చారిత్రక విషయ సముపార్జన చేశారు. వ్యావహారిక రంగంలోని మర్మలేగాక, భాషా విషయక రంగంలో కూడా కరణీక కుటుంబాలవారి ప్రశస్తి గమనించిననే గాని తెలుగుదనం పాదుకొన్నచోట్లు పరిగణనకు రావు. వైదికమత జైత్రయాత్రా సాఫల్యతను చేకూర్చిన వారిలో ఈ వర్గానికున్న స్థానం మత గురువులకుగాని, పూజారులకు గాని, పురోహితులకుగాని లేదు. జీతం బత్తెంలేని తీవ్రకృషి వైదికానికి వీరు ప్రోది చేశారు. నేటి గ్రామీణ వ్యవస్థలో కరణాల పాత్ర పంచాయతీల ఆగమన, ఉద్ధృతంలో తగ్గినట్లు ఉన్నా కీలక పరిస్థితి కీలకంగానే ఉంది. ప్రభుత్వానికీ, వైదికానికీ, కరణాలు కీలకాలు, పునాదులు. ఒకరిచ్చిన వరుమానంతో తమకు నచ్చిన రెండవ కృషి గూడా చేస్తారు. ఇది మనసులో ఉంచుకొని వ్యాసం చూడండి. ఇతర ఆనుపానులు మీకే దృగ్గోచర మౌతై. ఈ పుస్తకానికి జీవం, మూడోవ్యాసం, సంస్కృత కధా కథనం. స్వరాజ్య పాలనారంభం కాగానే చిన్న పెద్దలందరూ ఆగుబ్బుగా రేగి, సంస్కృతాన్ని పునరుద్ధరించాలని సమావేశాల మీద సమావేశాలు చేసి, విశ్వ సంస్కృత పరిషత్తులను గూడాస్థాపించి, ప్రణాళికా బద్ధ కృషి సాగించారు. సంస్కృతం తెలియనివాడు భారతీయాత్మ నెరుగనివారన్నారు. 'సంస్కృత' మంటే 'సంస్కృతి' అని కూడా నవ్య నిర్వచనం చేశారు. సంస్కృతి, కేవలం ఒక భాషకాదన్న నగ్న సత్యాన్ని గూడా తిరస్కరించి, తికమకపెట్టనారంభించారు. క్రమస్థితిని ఆ నైజం బయటపడుతుంది. దాని బండారాన్ని మన రచయిత, చరిత్ర సమ్మతంగా, నిరాడంబరంగా, నిజంగా బయటకు లాగారు. దానికి తిరుగు లేదు, రచయిత వాదం అప్రతిహతం. సంస్కృతం నిజానికి ఒక మూలభాష కాదు. ఈ విషయం కొందరకు కష్టంగా వున్నా, చరిత్ర చెప్పే సత్యాన్ని గ్రహిస్తే, సత్యాన్ని సత్యంగా గ్రహించవచ్చు. రచయిత, యింకా వివరంగా, సోదాహరణాలన్నింటిని చూపితే, గ్రంథం విస్తరించినా, సత్యాన్ని కచ్చడాలు యెక్కువగా దొరికేవి, మంచి కవచాలు అందేవి. ఆ పని, విషయం కల్గిన మన రచయిత భవిష్యత్తులోనైనా చేసి తీరాలి, దానికై ఒక ప్రత్యేక పుస్తకం కావాలి. సంస్కృతం మూలభాష కాదు. ప్రాకృతం మూల భాష, ప్రాకృతాన్ని సంస్కరించి, దానికి సంస్కృతమని పేరు పెట్టి, పుత్రికకు మాతృస్థానాన్ని చేకూర్చి, పౌరాణిక నైతికత్వాన్ని రుజువుచేశారు. ఈ మూల సిద్ధాంతాన్ని చర్చా వేదికలోకి తెచ్చిన నాగేశ్వరరావుగారి కృషి నిజంగా సాహసోపేతం, ప్రశంసార్హం. కాని, సంస్కృతాన్నే సంస్కృతికి పర్యాయపదంగా వాడే ప్రాకృతలోకం నాగేశ్వరరావుగారిని ఆడిపోస్తుంది, పోయనిండు, పోయెడిదేమి? రెండవ వ్యాసాన్ని యీ వ్యాసపత్రయంలో వేయకుండా వుంటే బాగుండేది. దానిలోని విషయానికి, తతిమ్మా రెంటిలోని విషయానికి సామీప్యం లేదు. వైదికానికి భావం కూర్చింది సంస్కృతం, దానికి పాదులు చేర్చింది కరణీకాలు. రచయిత హేతువాది, హేతువాదానికి, చారిత్రక దృష్టి, శాస్త్రీయగీతి, నైతిక గమనం అవసరం. ఆ మూటిని రచయిత తనలో ఆకళింత చేసుకుని, తన భావ పరంపరను సూటిగా తను మాట్లాడే రీతిలో, హృదయానికి హత్తుకొనేటట్లు చెప్పారు. పాఠకలోకం, యీ గ్రంథాన్ని యీ దృష్టితో చూచి, యీ విధానానికి వూతాన్ని చేకూర్చి, యింకా ముందుకు విశాలవంతంగా పోయే, పోగలిగిన అలవాటు చేసుకోగలుగుతుందని ఆశిస్తాను, దానికి పుంతలు వేసిన నాగేశ్వరరావుగారిని అభినందిస్తాను. తెనాలి ఆవుల గోపాలకృష్ణమూర్తి 28-2-1958 ఎమ్‌.ఎ., ఎల్‌.ఎల్‌.బి. కీ.శే. పువ్వాడ నాగేశ్వరరావుగారు మానవవాదిగా గుంటూరులో ప్రజావాణి పత్రికకు రాసిన వ్యాసాలు గ్రంథస్థం చేశారు. ఆ రచనకు ఆవుల గోపాలకృష్ణమూర్తి పీఠిక రాశారు. అది తొలిసారి పత్రికలో ప్రచురణ నిమిత్తం.

గోలి నాగేశ్వరరావు -బాల్య స్నేహమాధుర్యం

బాల్య స్నేహమాధుర్యం గోలి నాగేశ్వరరావు నేను సూర్యదేవర నర్సయ్య హైస్కూల్ (చేబ్రోలు) లో ఆరవ తరగతి నుండి చదివినప్పుడు నాకు ప్రియ మిత్రుడుగా గోలి నాగేశ్వరరావు వుండేవాడు. మా వూరుకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ముట్లూరు గ్రామం నుండి రోజూ సైకిలు మీద కొందరు విద్యార్థులు వచ్చేవారు. వారిలో గోలి నాగేశ్వరరావు ఒకరు. అతను మా ఇంటి దగ్గర ఆగి నన్ను సైకిలు మీద ముందు కూర్చోపెట్టుకుని స్కూలుకి తీసుకెళ్ళేవారు. ఇది ఆరవ తరగతి నుండి ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తయ్యేవరకు కొనసాగింది. ముట్లూరు గ్రామం మా వూరు పాతరెడ్డి పాలెం - చేబ్రోలుకు సమీపంలో ఉండేది. దగ్గరలో మరే హైస్కూలు లేనందువల్ల అక్కడి విద్యార్థులంతా చదువు నిమిత్తం వచ్చేవారు. ఆ విధంగా ప్రారంభమయిన మా స్నేహం నాగేశ్వరరావు చనిపోయేవరకు కొనసాగింది. ముట్లూరు గ్రామం నుండి అనేకమంది విద్యార్థులు సైకిళ్ళమీద రోజూ వచ్చినా నాగేశ్వరరావు మాత్రం తప్పనిసరిగా ఆ ఇంటి ముందు ఆగి బెల్ కొట్టి నన్ను సైకిలు మీద కూర్చోబెట్టుకుని వెళ్ళేవారు. క్లాసులో ఒకేచోట కూర్చునే వాళ్ళం. కలిసి చదివేవాళ్ళం. హోం వర్క్ నోట్సులు ఎక్స్ ఛేంజ్ చేసుకునేవాళ్ళం. టీచర్లపై మా అభిప్రాయాలు కూడా ఒకే రకంగా వుండేవి. నాగేశ్వరరావు చాలా చక్కగా వుండేవాడు. శుభ్రమైన దుస్తులు ధరించి క్రమశిక్షణతో వుండేవాడు. నేను రానురాను వారి కుటుంబంలో ఒకడిగా అయిపోయాను. తరచు ముట్లూరు గ్రామం వెళ్ళి వారి ఇంట్లో కాలక్షేపం చేసి వచ్చేవాడిని. నాగేశ్వరరావు తండ్రి మగ్గం నేసేవాడు. వారి కుటుంబం అంతా ఆ మగ్గం పనుల్లోనే నిమగ్నమయ్యేవారు. స్కూలులో బ్యాట్మింటన్, వాలీబాల్ ఆటలలో కలిసి పాల్గొనే వాళ్ళం. చేబ్రోలుకు ఎనిమిది మైళ్ళ దూరాన వున్న గుంటూరు నగరం వెళ్ళి ఒకసారి హోటలులో దోసె తిని రావటం ఆ రోజులలో అదే మాకు వింతగా వుండేది. స్కూలులో ఉపాధ్యాయులపై మా అభిప్రాయాలు కూడా బాగా కలిసేవి. హైస్కూలు చదువు ముగిసిన తర్వాత నేను గుంటూరులో కాలేజీలో చేరటం, నాగేశ్వరరావు విజయవాడ పర్యటనతో మేము కొంచెం దూరమయ్యాం. స్నేహం మాత్రం అలాగే కొనసాగింది. నాగేశ్వరరావు విజయవాడలో శోభనాచల స్టూడియో కంపెనీ ఉద్యోగంలో సినిమా ప్రతినిధిగా చేరాడు. అయితే విడుదలయిన వారి సినిమాలకు కలెక్షన్ ఎలా వస్తున్నదో చూడటం సరిగా జమకడుతున్నారో లేదో గమనించటం, యాజమాన్యానికి ఎప్పటికప్పుడు తెలియచేయడం అతని విధి. నేను విజయవాడ వెళ్ళినప్పుడు గాంధీనగర్ లోని ఆఫీసుకు వెళ్ళి నాగేశ్వరరావుతో కాలక్షేపం చేసేవాడిని. వారి సినిమాలకు తీసుకెళ్ళేవారు. అలా జరుగుతుండగా నేను ఎమ్.ఎ. చదువు నిమిత్తం విశాఖపట్టణం పోవటంతో నాగేశ్వరరావు తాత్కాలికంగా దూరమయ్యాడు. మళ్ళీ నేను సంగారెడ్డిలో నాలుగు సంవత్సరాలపాటు టీచరుగా పనిచేసినప్పుడు నాగేశ్వరరావు కూడా అక్కడికి వచ్చి నేను పనిచేసే స్కూలులోనే సెకండరీ గ్రేడ్ టీచర్ గా వృత్తి కొనసాగించాడు. మళ్ళీ పాత రోజులవలె సన్నిహితులమయ్యాము. అప్పట్లో మా అక్క మెదక్ జిల్లా స్త్రీ సంక్షేమ శాఖాధికారిగా సంగారెడ్డిలో వుండేది. మేము ఇరువురం అక్కడ మళ్ళీ కలిసి వుండే అవకాశం వచ్చింది. అదే సాన్నిత్యంతో ఉన్నాము. ఇద్దరం కలిసి స్థానిక జిల్లా గ్రంథాలయానికి వెళ్ళి విపరీతంగా గ్రంథ పఠనం చేసేవాళ్ళం. వీరేశలింగం, మునిమాణిక్యం మొదలైన వారి రచనలు కలిసి చదివేవాళ్ళం. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా జనార్దన రెడ్డి మాకు బాగా సహకరించేవాడు. రోజూ సాయంకాలం కొద్దిమంది టీచర్లు కలిసి వూరి వెలుపలికి వెళ్ళి పొలాల్లో తిరిగి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం ఆనవాయితీగా వుండేది. 1964లో నా వివాహం తెనాలిలో అయినప్పుడు నాగేశ్వరరావు చీరాలకు చేరుకున్నారు. అతడు సుబ్బరావమ్మ అనే చక్కని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. నేను ఆ వివాహానికి హాజరై చాలా సంతోషించాను. నా పెళ్ళికి వద్దన్నా వినకుండా నాగేశ్వరరావు దంపతులు తాళి చేయించి ఇచ్చారు. అది నేను వాడలేదనుకోండి. అది వేరే విషయం. పెళ్ళికి నాగేశ్వరరావు వచ్చి చాలా సంతోషించాడు. క్రమంగా చీరాలలో ఉబ్బస వ్యాధితో బాధపడ్డాడు. అది రానురాను అతన్ని బాగా క్షీణింపచేసింది. ఆ సమయంలో నేను చీరాల వెళ్ళి చూసివస్తుండేవాడిని. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. కానీ నాగేశ్వరరావు త్వరలోనే ఉబ్బస వ్యాధితో చనిపోయాడు. కుమారుడు మాత్రం చదువుకుని ఆస్ట్రేలియా వెళ్ళి కుదురుకున్నాడు. ఏమైనా నాగేశ్వరరావుతో నా స్నేహం చాలా మధురమైనదిగా మిగిలిపోయింది. అతనితో ఒక ఫొటో వుండటం నాకెంతో ఆనందదాయకమైన విషయం. నరిసెట్టి ఇన్నయ్య