గణపతి వెంకటేశ్వర్లు-బాల్య స్నేహమాధుర్యం

గణపతి వెంకటేశ్వర్లు మా వూరుకు ఒక పెద్ద చెరువు వుండేది. ఆ చెరువుకట్టపై కొందరు ఇళ్లు కట్టుకుని నివసించేవారు. వారిలో నా చిన్ననాటి స్నేహితుడు గణపతి వెంకటేశ్వర్లు కుటుంబం వుండేది. ఆర్థికంగా వారు పేదవారైనా చాలా ఆప్యాయంగా వుండేవారు. వారిలో చిన్నవాడు గణపతి వెంకటేశ్వర్లు నాకు చేబ్రోలు హైస్కూలులో క్లాస్ మేట్ ఆరోతరగతి నుండి హైస్కూలు పూర్తయ్యేవరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. నేను ఆ ఇంటికి వెళ్ళి చదువుతున్నప్పుడు నాకు లెక్కలు చెప్పేవాడు. అందులో వెంకటేశ్వర్లు చాలా చురుకైనవాడు. లెక్కలలో పాస్ కావడానికి అతడు తోడ్పడ్డాడు. పేద కుటుంబీకుడు కావటం వల్ల శని ఆదివారాలలో పక్క గ్రామం కొత్తరెడ్డి పాలెంకు వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆ విధంగా వచ్చిన సంపాదనను కుటుంబ ఖర్చులకి ఇచ్చేవాడు. నేను కూడా అతనితోపాటు వెళ్ళి ఎలా పనిచేస్తున్నాడో గమనించేవాణ్ణి. అతని శ్రమకు ఓర్పుకు ఆశ్చర్యపడేవాడిని. స్కూలులో మేము చదువులోను, ఆటలలోను కలిసిమెలిసి వుండేవాళ్ళం. బ్యాడ్మింటన్ వాలీబాల్ ఆటలలో పాల్గొనేవాళ్ళం. స్కూలులో జరిగిన స్కూలు పీపుల్స్ లీడర్ ఎన్నికకు మేము ఇరువురం పోటీ పడ్డాం. మాతోపాటు ముట్లూరు నుండి వచ్చే విద్యార్థి జోజులు కూడా తలపడ్డాడు. ప్రతీ తరగతికి వెళ్ళి విద్యార్థులకు కనపడి రావడం ఎన్నికకు ముందు ప్రక్రియ. ఆ ఎన్నికలో నా మిత్రుడు గణపతి వెంకటేశ్వరుడు గెలుపొందాడు. దానివలన మా స్నేహం ఏ మాత్రం చెడకపోగా యధావిధిగా మేము కలిసే వుండేవాళ్ళం. ఇతరేతర పుస్తకాలు పత్రికల వార్తల గురించి కూడా మాట్లాడుకునేవాళ్ళం. స్కూలు పూర్తయిన తర్వాత నేను గుంటూరు వెళ్ళినప్పుడు కొన్నాళ్ళు పాత గుంటూరులో ఏకా ఆంజనేయులుగారింటి ఎదురుగా అద్దెకుండేవాళ్ళం. మాకు సహాయపడే నిమిత్తం గణపతి వెంకటేశ్వర్ల తల్లి చెన్నమ్మ కొన్నాళ్ళు వున్నది. అప్పటికే ఆమెకు వృద్ధాప్యం వచ్చినందున ఎక్కువ రోజులు వుండలేక వెళ్ళిపోయింది. వెంకటేశ్వర్లు కాలేజీ చదువులు పూర్తి చేసుకుని త్రిపురాంతకంలో పోస్టు మాస్టరుగా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. అప్పట్లో ఆయనతో నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు వుండేవి కాదు. రిటైర్ అయిన తర్వాత ఆయన పిల్లలతో గుంటూరులో వుంటూండగా మళ్ళీ సంబంధాలు పునరుద్ధరించుకున్నాం. ఎక్కువగా ఫోనులో మాట్లాడుకుంటూండేవాళ్ళం. వెంకటేశ్వర్లు పద్య గద్య రచనలు చేయగా అందులో కొన్ని విజయవాడ ఆలిండియా రేడియో వారు ప్రసారం చేశారు. ఆ విషయం కూడా నాకు ఆలస్యంగానే తెలిసింది. ఏమైనా ఫోనులో మాట్లాడుకోవడం, సెల్ ఫోనులో చూసుకోవడంతో మా స్నేహం సంతోషంగా సాగింది. నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment