ఇంతవరకూ తెలియని సినారె

ఏభై సంవత్సరాల పరిచయంతో సి. నారాయణరెడ్డిని గురించి కొన్ని విశేషాలు వెల్లడించటమే ఈ వ్యాసోద్దేశం. జ్యోతిష్య బోధన వ్యతిరేకించిన సినారె తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా చేసిన నారాయణ రెడ్డి అందరివలె పబ్బం గడుపుకుని పోలేదు. మానవవాద సంఘాల పక్షాన మేము కొంతమందిమి జ్యోతిష్యం బోధనాంశంగా ఉండడాన్ని అభ్యంతర పెడుతూ శాస్త్రీయ పరిశీలనలు జరపాలని కోరాము. దానికి సినారె స్పందించి వైజ్ఞానికంగా జ్యోతిష్యం నిలబడుతుందా? అనేది పరిశీలించాలని, ఖగోళ శాస్త్రంతో పోల్చి చూడాలని కోరారు. ఈ విషయం తెలిసి గవర్నింగ్ కౌన్సిల్ లో సభ్యులుగా వున్న ప్రసిద్ధ జ్యోతిష్యుడు రామన్ (బెంగుళూరు) సినారె పై కత్తులు నూరి నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు తీవ్రస్థాయిలో లేఖలు రాశారు. సినారెను తొలగించాలని డిమాండు చేశారు. ఈలోగా సినారె యూనివర్సిటీలో విషయాన్ని విచారణ జరిపించారు. నన్ను, ప్రొఫెసర్ కొత్తపల్లి వీరభద్రరావులను ఛాంబర్ లో వాదోపవాదాలు వినటానికి సమావేశం జరిపారు. అందరి సమక్షంలో వాదనలు విన్న తరవాత నా వాదన శాస్త్రీయంగా వున్నదని ఖగోళ శాస్త్రంతో పోల్చి జ్యోతిష్యాన్ని అధ్యయనం చేయటంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. జ్యోతిష్యులు బిత్తరపోయారు. దీనిపై చర్య తీసుకోకముందే సినారె ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా వెళ్ళిపోయారు. ఉస్మానియా యూనివర్సిటీలో సినారె తెలుగు శాఖలోను, నేను ఫిలాసఫీ శాఖలోను ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు 1967 నుండి ఇంచుమించు రోజూ కలిసేవాళ్ళం. నేను అప్పట్లో ఎం.ఎన్.రాసిన అరుదైన పుస్తకం మారుతున్న భారతదేశం తెలుగులోకి అనువదించాను. ఇది భారత చారిత్రక సంఘం వారి పథకం కింద జరిగిన కార్యక్రమం. తెలుగు అకాడమీ ప్రచురించటానికి స్వీకరించింది. ఎడిటర్ గా ఉన్న సినారె ‘జనానికి అర్థమయ్యేటట్లు అనువదించ’మని నా వ్రాతప్రతి చూసి చెప్పారు. అలా నిష్కర్షగా చెప్పడానికి మా స్నేహం అడ్డు రాలేదు. అది ఆయనలోని లక్షణం. తెలుగు అకాడమీ నేను చేసిన ఎమ్.ఎన్. రాయ్ రచనల అనువాదాలన్నీ ప్రచురించింది. వాటిని హైదరాబాదులోని జర్నలిస్ట్ అసోసియేషన్ లో ఆవిష్కరిస్తూ ముఖ్యంగా వివేచన, ఉద్వేగం, విప్లవం అనే గ్రంథాన్ని సినారె చాలా విపులంగా సమీక్షించారు. ఆనాడు ఆయన ఉపన్యాసం విని నాలుగు పెగ్గులు సేవించినట్లున్నదని జర్నలిస్ట్ వి. సతీష్ వ్యాఖ్యానించారు. సినారె ఇంట్లో ఆచార్య రంగా కొంతకాలం అద్దెకుండేవారు. ఇది హైదరాబాదులోని అశోక్ నగర్ లో వుండేది. అక్కడ తరచు సినారెతో నేను కలుస్తుండేవాడిని. 1948 నుండి రవీంద్రనాథ్ ఆలపాటి సంపాదకత్వాన వెలువడిన జ్యోతి పత్రికలో సినారె రచనలు చేశారు. ఆ తరువాత హైదరాబాదులో సినారె రవీంద్రనాథ్ నేను కలసి ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చెయ్యటం ఆనవాయితీగా మారింది. ఎన్నో సంగతులు సినారె ఆసక్తికరంగా చెబుతుంటే అందుకు దీటుగా రవీంద్రనాథ్ తనకు తెలిసిన అంశాలు ఎంతో బాగా చెప్పేవారు. ఇవన్నీ నాకు మధురానుభవాలు. సినారె వాదోపవాదాలలో పాల్గొన్నప్పటికీ నేను ఆ రంగంలో ప్రవేశించేవాడిని కాదు. నా మిత్రులు డి.ఆంజనేయులు (రచయిత జర్నలిస్ట్) తెలుగు కవులు, రచయితలను ఇతర రాష్ట్రాల వారికి, బయట ప్రపంచానికి తెలియపరుస్తూ అనేక సాహిత్య వ్యాసాలు రాసేవారు. అది గ్రంథస్థం అయినప్పుడు అందులో నారాయణ రెడ్డిపై ఒక చక్కని వ్యాసం వున్నది. కానీ, అక్కడక్కడ వున్న నిశిత పరిశీలనలు మాత్రం సినారెకు నచ్చలేదు. డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగు భాష ప్రచారం కోసం కరీంనగర్ నుండి కథానిలయం వరకు సాహిత్య యాత్ర తలపెట్టారు. అందులో సినారె నేను పాల్గొన్నాము. ఇద్దరం విశాఖపట్టణంలో బహిరంగ సమావేశంలో మాట్లాడాము. నేను సాహిత్యపరంగా మానవవాద దృష్ట్యా కొన్ని సమావేశాలు హైదరాబాదులో జరిపాము. ముఖ్యమైన వాటికి సినారె నా ఆహ్వానంపై వచ్చి మాట్లాడేవారు. సంజీవదేవ్ హైదరాబాదు వచ్చినప్పుడు జరిపిన సమావేశాలలో సినారె పిలవగానే వచ్చి ప్రసంగించేవారు. మొత్తం మీద సినారెతో ఇలాంటి అనుభవాలు ఎన్నో వున్నాయి. ఆయనకు ఇప్పుడు 87 సంవత్సరాల వయస్సు వచ్చింది. జ్ఞాపక శక్తి బాగా వున్నది. అమెరికా నుండి ఫోను చేసి పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడతారు. సినారెతో మధురానుభూతులు చిరస్మరణీయాలు. •నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment