http://kinige.com/book/Rythu+ Rajakeeyamlo+Vijayarajakumar+ Narisetty
విజయరాజకుమార్ అనేది ఆయన స్వయంగా పెట్టుకున్న పేరు. తల్లిదండ్రులు పెట్టిన పేరు థామస్. పాతరెడ్డిపాలెంలో కాథలిక్కులు ఉండేవారు. తల్లిదండ్రులు ఆ శాఖకు చెందినవారు. కానీ తండ్రి రాజయ్య మతాన్ని పాటించేవారు కాదు. తల్లి మాత్రమే అనుసరించేది. విజయరాజకుమార్ తొలుత మతానికి దూరంగా రాజకీయాలలో ఉన్నారు. రోమన్ కాథలిక్కులు ఆ గ్రామానికి, గుంటూరు జిల్లాకు తరలివచ్చిన వారు. కడపలో గండికోట ప్రాంతం నుండి వచ్చిన వారని విజయ రాజకుమార్ కొంత పరిశోధన చేసి చెబుతుండేవారు.
* * *
1952 నుండి 65 వరకు కోస్తా తీరంలో తెలుగువారి తిరుగులేని రాజకీయోపన్యాసులుగా పదిహేను సంవత్సరాల పాటు విజృంభించిన విజయరాజకుమార్ సంక్షిప్త చరిత్ర ఇది. ఆంధ్ర ఏర్పడిన రోజులు మొదలు విజయరాజకుమార్ రాజకీయాలలో ఆకర్షనీయమైన ప్రసంగాలు చేసి జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆచార్య రంగా(1900-1995) అనుచరుడిగా కృషికార్ లోక్ పార్టీ(1951), ఐక్య కాంగ్రెస్, స్వతంత్ర్య పార్టీలో ఆయనకు విపరీతంగా డిమాండు వుండేది. కోస్తా జిల్లాలలో బహుశా ఆయన పర్యటించని ప్రాంతం, ఉపన్యసించని కేంద్రాలు అరుదు అని చెప్పవచ్చు. ఆంధ్రలో కమ్యూనిస్టులు అధికారంలోకి రాకుండా కీలకోపన్యాసాలుచేసిన వ్యక్తిగా ఆయన జనాన్ని ఆకర్షించారు. ఎన్.వీరాచారి, విజయరాజ కుమార్‌లు జంటగా పర్యటనలు చేసి తొలి ఎన్నికలలోను, 1955లో జరిగిన ఉపఎన్నికలలోను విజృంభించి తమ ప్రసంగాలతో ఉర్రూతలూగించేవారు. కమ్యూనిస్టులు వీరిని ‘రంగాగారి రేచు కుక్కలు’ అని దూషించేవారు. కామన్ ప్లాట్‌ఫాం మీదకు వచ్చి తనతో పాటు ప్రజల ఎదుట మాట్లాడమని సవాలు చేసినా కమ్యూనిస్టులు ఎవరూ ముందుకు రాలేకపోయారు. పామర జనానికి అర్ధమయ్యేటట్లు వీరాచారి మాట్లాడగా చదువుకున్న వారికి, యువతకు బాగా హత్తుకుపోయేటట్లు విజయరాజ కుమార్ మాట్లాడేవాడు. ఆయన మార్క్సిజంలో బాగా రిఫరెన్సులు ఇచ్చేవారు. కమ్యూనిస్టుల నోరు మూయించడానికి ఆయన వాదనలు తోడ్పడ్డాయి. అలాంటి వ్యక్తిని గురించి ఇంతవరకు తెలియని విషయాలు అందించే ప్రయత్నమిది.