అబ్బూరి రామకృష్ణారావు-సాహితీపరులతో సరసాలు



ఆంధ్ర చరిత్రలో ఒక ప్రధాన పాత్ర వహించిన కవి అబ్బూరి. స్టేజి స్పెషలిస్ట్ గా, కవిగా తెలిసిన వారు, ఆయన రాజకీయాలు గుర్తెరుగరు. కమ్యూనిస్టుగా జీవితం ఆరంభించిన అబ్బూరి, రాడికల్ హ్యూమనిస్ట్ గా మారి, చివరకు భక్తుడుగా మిగిలారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్ గా వుంటూ, స్టేజి గురించి శ్రద్ధ వహించారు. అప్పుడే విద్యార్థిగా ఆయన్ను చూచాను. నాడు వైస్ ఛాన్సలర్ గా వున్న కట్టమంచి రామలింగా రెడ్డికి సన్నిహితుడు అబ్బూరి. అబ్బూరి రామకృష్ణారావు తెనాలి నుండి వచ్చారు. ఆంధ్ర యూనివర్శిటీలో ప్రముఖంగా స్థానం సంపాదించారు.
కాంగ్రెస్ లో రాడికల్ పాత్ర చేబట్టిన ఎం.ఎన్. రాయ్ (మానవేంద్ర నాథరాయ్) పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన్ను ఎం. వి. శాస్త్రి ద్వారా ఆంధ్రకు రప్పించాడు. వైస్ ఛాన్సలర్ కు పరిచయం చేశాడు. ఎం.ఎన్.రాయ్ ను యూనివర్శిటీలో చేరమని సి.ఆర్.రెడ్డి చేసిన ఆహ్వానాన్ని, మర్యాదగా రాయ్ తృణీకరించాడు.
అబ్బూరి, కమ్యూనిస్టు కాంగ్రేస్ రాజకీయాలకు భిన్నంగా, రాడికల్ డెమొక్రటిక్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహకుడయ్యారు. 1940 నుండీ 1948 వరకూ ఆ బాధ్యతలు నిర్వహించి, ఎం.ఎన్. రాయ్ మానవవాద కార్యక్రమాలు ఆంధ్రలో ప్రచారం చేశారు. ఆయనకు తోడుగా విజయనగరంలో తాతా దేవకీనందన్, శ్రీకాకుళం నెల్లిమర్లలో పెమ్మరాజు వెంకట్రావు, కాకినాడలో ములుకుట్ల వెంకటశాస్త్రి తెనాలి నుండి ఆవుల గోపాలకృష్ణ మూర్తి, త్రిపురనేని గోపీచంద్, గుత్తికొండ నరహరి మరెందరో తోడ్పడ్డారు.
కన్యాశుల్కం మొదలు అనేక నాటకాలు స్టేజిపై నిర్దుష్టంగా ప్రదర్శింపజేసిన అబ్బూరి, మంచి కవి, రచయిత. హైదరాబాద్ లో చివరి దశలో స్ధిరపడ్డారు. ఆయన గురువు ఎం.ఎన్. రాయ్ చనిపోయినప్పుడు, 1954లో ఒక గేయం ఇంగ్లీషులో రాసి డెహ్రడూన్ సమాధిలో వుంచారు.
1966 నుండీ నాకు బాగా సన్నిహితంగా అబ్బూరిని చూచే అవకాశం కలిగింది. ఆలపాటి రవీంద్రనాధ్ నేనూ చాలాసార్లు ఆయన్ను ఇంటి నుంచి సికింద్రాబాద్ సైలింగ్ క్లబ్బుకు తీసుకు వచ్చి, రెండు పెగ్గుల అనంతరం, ఆయన కబుర్లు విని ఎంతో సంతోషించేవాళ్లం. ఆరోగ్యరీత్యా ఆయన డ్రింక్స్ మానేస్తే మంచిదని డాక్టర్ చెప్పారట. ఆయన భార్య యింట్లోనిష్ఠగా ఆహార పానీయాలు కంట్రోల్ చేసింది. అది భరించలేక మాకు ఫోను చేసేవారు వెళ్ళి, ఆయన భార్యకు హామీ యిచ్చి, బయటకు తీసుకెళ్ళేవాళ్ళం. అదొక పెద్ద అనుభవం.
ఆయన చివరిసారిగా పాల్గొన్న హేతువాద సభ హైదరాబాద్ లో 1970 ప్రాంతాల్లో జరిగింది. మహారాష్ట్రలో వాయ్ WAI నుండి తర్క తీర్థ లక్ష్మణ శాస్త్రి జోషి వచ్చినప్పుడు సభ ఏర్పరచి, అబ్బూరిని పిలిచాం. అప్పటికే ఆయనలో బాగా వార్ధక్య లక్షణాలు వచ్చేశాయి. హేతువాదం సన్నగిల్లింది. ఆయన వాయిస్ రికార్టుచేశాం. అనుభవాలు చెప్పించాం. ఆ సమాచారాన్ని అబ్బూరి ఛాయాదేవి (ఆయన కోడలు) వాడారు.
ఒకసారి క్లబ్బులో చెప్పిన మాటలు యిలా వున్నాయి. జాబాలి కథ అబ్బూరి చెబుతూ, చదువు నేర్పమని గురువు దగ్గరకు వెడితే నీది ఏ కులం అని అడిగాడట. మా అమ్మను అడిగి చెబుతానని అతడు వెళ్ళాడట. మరునాడు వచ్చి, మా అమ్మ ఎన్నో యిళ్ళలో పనిచేసిందట. అప్పుడు గర్భం ధరించగా, నేను పుట్టానట. కనుక ఎవరికి పుట్టానో చెప్పజాలను అన్నదట. ఈ విషయం విని, నిజం చెప్పావు గనుక నీవు బ్రాహ్మణుడికే పుట్టి వుంటావని, గురువు చదువు చెప్పాడట. ఇలాంటి వ్యాఖ్యానాలు అబ్బూరి ఎన్నో చెప్పేవాడు.
1940 ప్రాంతాల్లో గాంధీని దుయ్యబడుతూ ఆవుల గోపాలకృష్ణ మూర్తి వ్యాసం రాస్తే, ఘాటైన విమర్శ భరించలేక, అబ్బూరి దానిపై ఎం.ఎన్. రాయ్ కి ఫిర్యాదు చేశాడు. కాని రాయ్ అది చదివి, ఆవులను ఏమీ అనలేక పోయాడు.
అబ్బూరికి వరద రాజేశ్వరరావు, గోపాలకృష్ణ అని యిరువురు కుమారులు. రాయ్ అనుచరులుగా వారూ వుండేవారు. ఒకసారి ఒక విదేశీ పండితుడు ఆంధ్ర యూనివర్శిటీకి వచ్చి, సి.ఆర్. రెడ్డి ఎక్కడ వుంటాడని అబ్బూరిని అడిగాడు. ఆంధ్ర యోని వర్శిటీలో అని నర్మ గర్భంగా జవాబు చెప్పాడట.
రచనలు : అభినవ కవితా ప్రశంస (వ్యాసం), సూర్యరాజు (కథలు), ఊహాగానం, నదీ సుందరి, మంగళ సూత్రం (నవల), త్రిశంకు (కావ్యం), చాటువులు. అనువాదాలు – రవీంద్ర రచనలు.

నరిసెట్టి ఇన్నయ్య


ఎలవర్తి రోసయ్య-సాహితీపరులతో సరసాలు

My teacher Yelavarthi Rosayya
పిలక పెంచి, వీరగ్రాంధిక వాదిగా, ప్రాచీన కవులు నన్నయ్య, తిక్కనలను ‘గారు’ అని సంబోధించిన ఎలవర్తి రోసయ్య ఒక విశిష్ట వ్యక్తి. భావాలలో ఉగ్రవాది. ఇంగ్లీషు టీచరైనా, తెలుగులో నిష్టాతుడు. గణితంలో, సంగీతంలో మంచి ప్రవేశం వుంది. తెనాలి తాలూకా తురుమెళ్ళ హైస్కూలులో చదివి, మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం చేసిన రోసయ్య, భీమవరం, గుంటూరులో కాలేజీ టీచర్ గా వేలాది మందిని ప్రభావితం చేశారు.
మంచి కవిత్వం అంటే చెవి కోసుకునే రోసయ్యకు ఆప్త స్నేహితుడుగా వున్న ఆవుల గోపాలకృష్ణ మూర్తి, చిట్కా ప్రయోగాలతో ఆయన్ను మార్చేశాడు. గుంటూరు కమ్మహాస్టల్లో వున్న రోసయ్యకు త్రిపురనేని రామస్వామి “సూతపురాణం” పద్యాలు వినిపించాడు. రోసయ్య ఆశ్చర్యపోయి, ఎవరు రాశారు, చాలా అద్భుతంగా వున్నాయని, ఆరాతీశాడు.
అలా ఆసక్తి పెరిగిన తరువాత అసలు విషయం చెబితే, కూలంకషంగా చదివి, రోసయ్య మారడానికి నాంది పలికారు. ఒక రాత్రి నిద్ర పోతున్న రోసయ్య పిలక కత్తిరించి, భావాలలోనే గాక భాషలోనూ, వేషంలోనూ రోసయ్యను మార్చేశారు ఎ.జి.కె. (ఆవుల గోపాలకృష్ణమూర్తి). ఎం.ఎన్. రాయ్ మానవ వాదం పట్ల బాగా ఆకర్షితుడైన రోసయ్య, అనేకమందిని రాయ్ పట్ల మొగ్గుచూపడానికి దోహదకారి అయ్యారు. రాయ్ అనుచరులు జి.డి. పరేఖ్, ఎ.బి.షాల ప్రసంగాలు, భావాలు శ్లాఘించారు. నేను గుంటూరు ఎ.పి. కాలేజీ (1954-58) విద్యార్థిగా, రోసయ్యగారి వలన మానవవాదినయ్యాను. గురువుగారు కాస్తా జీవితమంతా స్నేహితులయ్యారు. కాలేజీ కంటే ఆయన ఇంట్లో నేర్చిన విద్య చాలా ఉపయోగపడింది. రోసయ్యగారికి జ్ఞాపకశక్తి హెచ్చు. ఇంగ్లీషు తెలుగు పుస్తకాలలో విషయాలు చెబుతూ, పేజీలు తిరగేసి, కొటేషన్లు చూపేవారు. త్రిపురాన వేంకటరాయ “మొయిలు రాయభారం” నుండి పద్యాలు వినిపించేవారు. ఎం.ఎన్.రాయ్ సైన్స్ అండ్ ఫిలాసఫీలో, జటిలవిషయాలు విడమరచి చెప్పేవారు. వీటన్నిటికి తోడు రోసయ్య వీరగ్రాంధికవాది. అది ఎదురీత. కాలం చెల్లిన వాదం. అయినా అందుకు సమర్ధనీయంగా కొటేషన్లతో కూడిన చిన్న పుస్తకం రాశారు. అది ఎందుకో గాని అచ్చువేయలేదు. అడపదడప వ్యాసాలు అక్కడక్కడా రాసినా, అవీ తక్కువే.
సాహిత్యంలో ఔచిత్యం వుండాలని ఆవుల గోపాలకృష్ణ మూర్తి అంటే, ఎంతో మెచ్చుకున్నారు. చిన్నయసూరి అంటే రోసయ్యకు ఎక్కడ లేని మోజు. దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారిపట్ల గురు భావం. భట్టుమూర్తి వసుచరిత్ర, వీణపై వాయించవచ్చుననేవారు. ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్ పలికిస్తుందని, చౌడయ్య ఫిడేల్ పేడు మీద పేడు రాసినట్లుంటందనేవారు. ప్రాచ్యపాశ్చాత్య సంగీత, సాహిత్యకారులపై రోసయ్యకు రాగద్వేషాలు జాస్తి. శామ్యూల్ జాన్సన్, థామస్ గ్రే, మిల్టన్ అంటే యిష్టం.
పాఠాలు చెప్పేటప్పుడు క్రాస్ రిఫరెన్స్ లు విరివిగా చెప్పేవారు. పోర్షన్లు పూర్తి అయ్యేవికావు నాటకాల్లో పాత్రోచితంగా నటించి చూపేవారు. కాలేజీ టీచర్ గా, ప్రిన్సిపాల్ గా, చిన్న పిల్లల స్కూలు నిర్వాహకుడుగా రోసయ్య జీవితమంతా గడిపారు. కుమారుడు అమెరికాలో వుండటం వలన ఒకసారి వెళ్ళి పర్యటించి వచ్చారు.
స్వాతంత్రోద్యమ రోజులలోనే విధవా వివాహం చేసుకొని, జీవితాన్ని ఆ దర్శంగా ప్రారంభించారు. రోసయ్య గారితో 1954లో మొదలైన పరిచయం ఆయన అస్తమించే వరకూ సాగిందినాకు. అది చాలా వ్యక్తిత్వ వికాస స్నేహం. ఆయన Website పెట్టడంలో ఎలవర్తి రామరాజ భూషణుడుకు నేను యధాశక్తి తోడ్పడి, తృప్తి చెందాను.
పానుగంటి లక్ష్మీనరసింహారావు రచనలు అంటే రోసయ్యకు ప్రాణం. సాక్షి ఆరుభాగాలు, విమర్శాదర్శం, నాటకాలు చదివి, మైమరచి, నాకు యితరులకు చదివి వినిపించేవారు. పానుగంటి హాస్యం అడుగడుగునా ఆయనతో పాటు ఆనందించాం. వాడుక భాషా వాదులను, గిడుగు మొదలు ఎందరినో రోసయ్య దుయ్యబట్టేవారు. ఆ విషయంలో ఆయనతో ఏకీభవించ లేకపోయేవాడిని. కమ్మకులాభిమానం మాత్రం రోసయ్యగారు పోగొట్టు కోలేకపోవడం, యీ నేపధ్యంలో ఆశ్చర్యమే. ఎం.ఎన్.రాయ్ మానవవాదంతో, కులతత్వం ఎలా పొందికగా చూడగలిగారో అర్థం కాదు.
see website: http://yrosayya.com/
నరిసెట్టి ఇన్నయ్య


రాచకొండ విశ్వనాథశాస్త్రి-

సాహితీపరులతో -


రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనలంటే ఎంతో మందికి యిష్టం లేదు. రావిశాస్త్రి ఏది రాసినా పడీ పడీ చదివి, అభినందించేవారెందరో! ఈ వైవిధ్యానికి కారణాలు లేకపోలేదు. విశాఖపట్నం ప్రాంతంలో భాష, యాస వంటబడితే నచ్చితే, రాచకొండకు తిరుగులేని అభిమానులౌతారు. లేకుంటే దూరంగా పెట్టేస్తారు.
సంస్కృతంలో కాళిదాసు రచనలకు ఉపమానాలు బాగా వన్నెతెచ్చాయంటారు. అదేమో గాని తెలుగులో ప్రజల భాషతో రాచకొండ ఉపమానాలు చాలా గొప్పగా వుంటాయి. బీనాదేవి తప్ప మరెవరూ ఆ దరిదాపులకు రాలేకపోయారు. రచనలతో బాటు కోర్టులను, ప్లీడర్లను, డాక్టర్లను, గుడిసెల జనాన్ని ఎంత పరిశీలించాడో రావి శాస్త్రి. అది ఆయన జీవితమంతా కనిపిస్తుంది. సామాన్యుల జీవితాల్ని కథల్లో, నాటకాల్లో, నవలల్లో రాచకొండ రాసిన తీరు ఒక పట్టాన పట్టు బడేది కాదు.
1995 ప్రాంతంలో అమెరికాలోని ఫిలడల్ఫియాలో రాచకొండ నరసింహశాస్త్రిని కలిశాను. ఆయన రావి శాస్ర్తి సోదరుడుని తెలిసి, కాస్త ఇంటర్వ్యు చేశాను. తన సోదరుడి రచనలు కొన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేయదలచినట్లు చెప్పారు. సంతోషించాను. కాని చాలా జటిలమైన ప్రయత్నం అన్నాను. రాచకొండ నుడికారంలోనే ఆ కష్టం వుంది. నరసింహశాస్త్రి డాక్టర్ గా రిటైర్ అయి, విశాఖకు వెళ్ళిపోయారు తరువాత.
గోరాశాస్త్రి నన్ను రాచకొండకు పరిచయం చేశారు. 1970 ప్రాంతాల్లో ఆరంభమైన ఆ పరిచయం చివరి దాకా సాగింది. మేము హైదరాబాద్ నియోమైసూరు కేఫ్ (అబిడ్స్ సెంటర్) లో కలసినప్పుడు, సి. ధర్మారావు వచ్చి చేరేవారు.
రాచకొండ శిష్యుడు, మిత్రుడు, అనుచరుడు సంకు పాపారావును మిత్రుడు తుమ్మల గోపాలరావు పరిచయం చేశారు. పాపారావు అనేక విషయాలు చెప్పారు రాచకొండ గురించి, వారిద్దరికీ చివర్లో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, “రాముడికి దేవాలయాలుంటే, హనుమంతుడికీ గుడులుంటాయని” సంకు పాపారావు అనేవారు.
కన్యాశుల్కంలో, నిజం నాటకంలో రాచకొండ పాత్రధారి అయినప్పుడు చూచి సంతోషించాను. రాచకొండతో పరిచయమయ్యేనాటికే ఆయన రచనలు కొన్ని చదివాను. ఆ తరువాత చాలా చదివాను. నాకు బాగా నచ్చిన రచనలవి.
కనక మహాలక్ష్మికి మొక్కడం మొదలు విరసం (విప్లవ రచయితల సంఘం) వరకూ పయనించిన రావిశాస్త్రి చివరి దశలో అజ్ఞేయవాది (Agnostic) గా మిగిలానన్నాడు. రచనలకు పరిమితంగాని ఆచరణ వాదిగావడంతో 1975లో ఇందిరాగాంధి విధించిన ఎమర్జన్సీలో జైలు పాలయ్యాడు.
హాస్య ప్రియుడు రావిశాస్త్రి, చతుర సంభాషణకారుడు. బాగా ఔపోసనం నాలుగు పెగ్గులు పట్టించినప్పుడు సమయస్ఫూర్తి జోక్స్ చెప్పి, నవ్వించేవాడు. అందులో పచ్చివీ, ఎండువీ మిళితమై వుండేవి. ఒకసారి మాటల్లో ఒకాయన చెబుతూ రావిశాస్త్రి స్నేహితుని భార్య పుట్టింటికి వెళ్ళిందని చెప్పాడు. అయితే భోజనం ఎలా మరి అని రావిశాస్త్రి పరామర్శించాడు. వంటావిడ వుందని చెప్పగా “మంచిదే... తింటాడన్నమాట” అన్న రావిశాస్త్రి సమయోచిత శృంగార పలుకులు, విస్కీమత్తులో నవ్వులు పుట్టించాయి. కోర్టులో మాజిస్త్రేట్ బోనులోని ముద్దాయిని చూస్తూ అనుకున్నాడట. ఇంత చదువుకున్న నేనే దొంగలంజ కొడుకునైతే, వాడెలాంటి వాడు కావాలి అని, పూర్తి శిక్ష కుమ్మేశాడట.
రాచకొండకు ఇరువురు భార్యలు, విశాఖపట్నంలో రిక్షా వాళ్ళందరికీ ఆపద్భాంధవుడైన రాచకొండ తాగినప్పుడు ఎక్కడకు తీసుకెళ్ళాలో వారందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన ఒక రిక్షావాడు ఒకనాడు రాచకొండను అలాంటి దశలో పెద్ద భార్య దగ్గరకు తీసుకెళ్ళి తలుపు తడితే. “ఏరా, ఆసికాలా, ఏసికాలా” అంటూ తలుపేసుకున్నదట. అప్పుడు రెండో భార్య దగ్గరకు చేరేశాడట. స్వవిషయం చెప్పికూడా రాచకొండ నవ్వించాడు.
రాచకొండ సీరియల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడలేదు గాని, అచ్చయిన తరువాత చదివి ఆనందించిన పాఠకులలో నేనూ వున్నాను. ఆరు సారాకథలు, ఆరు సారోకథలు, నిజం నాటకం, రాజు మహిషి, సొమ్ములు పోనాయండి, అల్పజీవి అభిమాన రచనలు.
పేదల్ని ఆదుకునే ప్లీడర్ గా రావిశాస్త్రి ఒకసారి ఆసక్తికరమైన కేసును ఎదుర్కోవలసి వచ్చింది. రాజమండ్రిలో బోగం యువతికి అండగా నిలచినందుకు, నిరసనగా వినుకొండ నాగరాజు (కమెండో పత్రిక ఎడిటర్ ఉత్తరోత్తరా) కేసు పెట్టాడు. అది చాలా ఏళ్ళు సాగింది. చివరలో రావిశాస్త్రి స్వయంగా కోర్టులో నాగరాజును కలసి పరిచయం చేసుకున్నాడు. అలా ప్రత్యర్థి వచ్చి పరిచయం చేసుకోవడం నాగరాజును ఆశ్చర్యపరచింది. ఇద్దరూ హైదరాబాద్ లో మందు పార్టీ చేసుకుందామనుకున్నారు.
విరసం వారు రాచకొండను తమవాడిగా ముద్రవేసినా, కమ్యూనిస్టేతర వ్యక్తులతో రావిశాస్త్రి సన్నిహితంగానే మెలగాడు. గోరాశాస్త్రితో స్నేహమే అందుకు తార్కాణం. కథ చెప్పడమే కాదు వినడం కూడా తెలియాలంటాడు రావిశాస్త్రి.
విజయవాడలో ఒక సారి రావిశాస్త్రి రెస్క్యూ హోంకు వెళ్ళారు. వ్యభిచార వృత్తిలో వున్నవారిని తప్పించి, సాధారణ జీవితం గడపడానికి ఉద్దేశించిన ఆ Rescue Homeలో రావిశాస్త్రికి లోగడ తెలిసిన వారెందరో వున్నారు. వారిని పేరు పేరునా పిలిచి పరామర్శించి, కష్టసుఖాలు తెలుసుకున్నారు. పక్కనే వున్న తుమ్మల గోపాలరావు యిదంతా చూచి, ఆశ్చర్యపోయారు. రావిశాస్త్రి వారి పట్ల కనబరచిన మానవ సంక్షేమ దృష్టి గమనార్హం.
సుంకు పాపారావు ఎన్నో అంశాలు ఆసువుగా రావిశాస్త్రికి చెబుతుండేవారు. పోలీస్ ఉద్యోగం చేసిన పాపారావు తన అనుభవాలను, పోలీస్ ధోరణిలో చెబితే, తన యితివృత్తాలుగా రావిశాస్త్రి వాడారు. అలాంటివి గుర్తించి పాపారావుకు ధన్యవాదాలు చెప్పారుకూడా. హనుమంతుడి తోక ఎంతుందో R & B (రోడ్డు భవనాల శాఖ) కొలిచిందా ఏమిటి అంటూ సుంకు పాపారావు యధాలాఫంగా హాస్యంగా వాడే విషయాలు రావి శాస్త్రి కలంలో నిలిచాయి.
రచనలు : దేముడే చేశాడు (కథ), అల్పజీవి (నవల), కధాసాగరం (నాటిక), వచ్చేకాలం (నాటిక), ఆరు సారాకథలు, నిజం (నాటకం), ఆరు చిత్రాలు (కథలు), ఆరు సారో కథలు, మరో ఆరు చిత్రాలు, రాజు మహిషి (నవల), విషాదం, కలకంఠి, బాకీ కథలు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, ఋక్కులు, రత్తాలు-రాంబాబు, సొమ్ములు పోనాయండి, మూడు కధల బంగారం – నవల, ఇల్లు-నవల.
- నరిసెట్టి ఇన్నయ్య