మానవ విలువలతొ జీవనం-ఇన్నయ్యస్వీయ చరిత్ర డిల్లిలో విడుదల

Living with values by N Innaiah (Jun 1, 2013)

మానవ విలువలతొ జీవనం
స్వీయ చరిత్ర డిల్లిలో విడుదల
అమజాన్ లో లభిస్తున్నది
go to amazon.com

రాజకీయాలలో పెద్ద మనిషి-బెజవాడ గోపాలరెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 3



బెజవాడ గోపాలరెడ్డి
(1907-1997)
ఆంధ్రకు మలి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి 1950లో బెజవాడను విజయవాడగా మార్చారు. బెజవాడ గోపాలరెడ్డిని అప్పటి నుండి ‘విజయవాడ గోపాలరెడ్డి’ అంటారా అని జోక్ వాడుకలోకి వచ్చింది.
నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడే బెజవాడ గోపాలరెడ్డి గురించి తెలుసుకుంటుండేవాడిని. పత్రికలు అందుకు ఆధారం. ఆయన 1937 నాటికే మంత్రి పదవి చేపట్టిన సీనియర్ నాయకుడు. కర్నూలు ఆంధ్ర రాజధానిగా ఉన్నప్పుడు నేను కొన్ని కారణాలుగా తరచు అక్కడికి వెళ్ళడం తటస్థించింది. అప్పుడే తొలిసారి గోపాలరెడ్డిగారిని ఆయన బంగళాలో కలిశాను. గౌతులచ్చన్న, గోవాడ పరంధామయ్యలతో కలిసి ఆయన బంగళాకు వెళ్ళినప్పుడు నేను కాలేజీ విద్యార్థిని మాత్రమే. నమస్కరించి, పెద్దలు మాట్లాడుకుంటుంటే వింటూ కూర్చున్నాను. మధ్యలో నన్ను పరిచయం చేసి, లచ్చన్నగారు “మిమ్మల్ని చూడాలి అని అంటే వెంటబెట్టుకొచ్చాను” అని చెప్పారు.  సంతోషం అంటూ గోపాలరెడ్డిగారు ఏవో కుశల ప్రశ్నలు వేశారు. ఆ తరువాత చాలాకాలం నేను గోపాలరెడ్డిని కలవలేదు. కాని ఆయన రాజకీయ జీవితాన్ని గమనిస్తూ వచ్చాను. నేను కర్నూలులో రెండవసారి గోపాలరెడ్డిగారి బంగళాకు వెళ్ళినప్పుడు సినీనటి భానుమతి అక్కడ ఉన్నది. గోపాలరెడ్డిగారి ఇంటికి కళాకారులు, కవులు రావడం ఆనవాయితీ. సంస్కృతి, భాష, కళల పట్ల అభిమానం గల గోపాలరెడ్డిగారు ఎక్కడికి వెళ్ళినా అలాంటి వారిని పిలిపించుకునేవారు.
1955 ఉప ఎన్నికలలో గోపాలరెడ్డిగారి ఉపన్యాసాలు విన్నాను. మిగిలిన వారికీ ఆయనకూ విమర్శలలో స్థాయీభేదం ఉన్నది. నెల్లూరు యాసతో చక్కగా, హుందాగా మాట్లాడేవారు. ఎన్నికల అనంతరం గోపాలరెడ్డిగారి ప్రాధాన్యత రాష్ట్రంలో తగ్గిపోయింది. ఆ తరువాత ఆయన గవర్నరుగా, కేంద్రమంత్రిగా వెళ్ళారు. చాలాకాలం నేను ఆయన్ను కలుసుకోలేదు. చివరి దశాబ్దంలో మళ్లీ సన్నిహితంగా ఉండగలిగాం. హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఆయన కబురు చేసేవారు. జూబ్లీహిల్స్ లో మాగుంట సుబ్బరామిరెడ్డి గెస్ట్ హౌస్ లో బస చేసేవాడు. అక్కడ కలుసుకొని విందు ఆరగించి, కవితలు విని, కబుర్లు చెప్పుకోవడం రివాజు అయింది. నగరంలో ఏవైనా కార్యక్రమాలుంటే నన్ను తోడు తీసుకెళ్ళేవారు. ‘మిసిమి’ పత్రిక సంపాదకులు ఆలపాటి రవీంద్రనాథ్ సన్నిహిత మిత్రులుగా గోపాలరెడ్డిని కలుస్తుండేవారు. కొన్ని పర్యాయాలు మేము ముగ్గురం కలసి కార్యక్రమాలకు వెళ్లేవాళ్ళం. గోపాలరెడ్డిగారు ఉత్తర ప్రత్యుత్తరాలకు పెట్టింది పేరు. మేము ఇరువురం ఆవిధంగా చాలా ఉత్తరాలు రాసుకున్నాము. అందులో కొన్నింటిని నేను హైదరాబాదులోని స్టేట్ ఆర్కైవ్స్ కు ఇచ్చాను. ఎప్పుడైనా నెల్లూరు వెడితే ఇంటికి వెళ్ళి కాసేపు కాలక్షేపం చేసేవాడిని. ఒకసారి అలా వెళ్ళినప్పుడు పెద్ద ఇంట్లో ఆయన ఒక్కరే కూర్చుని ఉన్నారు. ఆయన శ్రీమతి లోపల ఎక్కడో ఉన్నారు. నాకు కనీసం ఒక కప్పు కాఫీ ఇద్దామని సహాయకుడికోసం కేక వేస్తే ఎవరూ పలకలేదు. నేను అందుకొని మీతో కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకోడానికి వచ్చాను. కాఫీలు అక్కరలేదు. మీరు ఆ విషయం పట్టించుకోనక్కరలేదు అని చెప్పాను. కానీ ఏమీ ఇవ్వలేకపోయాననే ఫీలింగు ఆయన ముఖంలో కనిపించింది. ఎన్నో పదవులు నిర్వహించిన గోపాలరెడ్డిగారు రిటైర్ అయిన తర్వాత అంత సాధారణ జీవితం గడిపారు. నేటి రాజకీయ నాయకులతో పోల్చుకుంటే తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
గోపాలరెడ్డిగారు తరచు మదరాసు వెళ్ళినప్పుడు మిత్రులను తన వద్దకు రప్పించుకొనడం, తానే వారి దగ్గరకు వెళ్ళటం ఆనవాయితీగా ఉండేది. అలా కలిసేవారిలో చందూర్, డి.ఆంజనేయులు మొదలైనవారుండేవారు. నేను ఆంజనేయులుగారింట్లో కొన్నిసార్లు గోపాలరెడ్డిగారిని కలిశాను. అనేక సందర్భాలలో గత రాజకీయ జీవత ఘట్టాలలో వివిధ అంశాల గురించి అరమరికలు లేకుండా అడిగేవాడిని. కొన్ని దాటవేసేవారు. మరికొన్నిటిని పరిమితంగా చెప్పేవారు. ఆయనకు ఠాగోర్ కవితలు ఇష్టం. కొన్నిటిని తెలుగులోకి అనువదించారు. ఆ ప్రభావంలో కొన్ని రచనలు చేసారు. బెంగాల్ ప్రభావం ఆయన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. అది నాకంత ఆకర్షణీయంగా అనిపించలేదు. కానీ, ఆయన మాత్రం తన రచనలు ప్రచురించినప్పుడు నాకు ఒక ప్రతి ఇచ్చేవారు. ‘ఆమె’ అనే శీర్షికన రాసిన కవితలు వినిపించినప్పుడు, ఈ ఆమె అనే పాత్ర నిజ జీవితంలో ఎవరినైనా పోలి ఉన్నదా? అని ప్రశ్నిస్తే ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. గోపాలరెడ్డిగారితో పరిచయం, సంభాషణలు, కాలక్షేపాలు ఎక్కవగా రాజకీయేతరంగానే గడిచాయి.
విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ్ అవార్డు విషయమై ఉన్న సందేహాలు, తెరవెనుక జరిగిన కథనం, అవార్డు ఇప్పించిన తీరు గురించి ఎన్నిసార్లు గుచ్చి గుచ్చి అడిగినా గోపాలరెడ్డిగారు, అవన్నీ ఇప్పుడు ఎందుకులే అయిపోయిందేదో అయిపోయింది అని చెప్పారే తప్ప అసలు విషయాలు బయట పెట్టలేదు. నేను కూడా తెగేదాకా లాగకూడదని అంతటితో వదిలేశాను.
గోపాలరెడ్డిగారికి కళలు, చెస్, హిందీ భాషాభివృద్ధి బాగా ఇష్టమైన విషయాలు. ఆయన చుట్టూ ఎప్పుడూ కవులూ, గాయకులు, కళాకారులు కొలువు తీరి ఉండేవారు.

- నరిసెట్టి ఇన్నయ్య

టంగుటూరి ప్రకాశం పంతులు-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 2


టంగుటూరి ప్రకాశం

(1872-1957)
రాజకీయాల్లో ధైర్యంగా పోరాడి, సంపాదన తనది అని చూచుకోకుండా దేశ సేవలో ఖర్చుపెట్టి, ప్రజల మధ్య పర్యటించి ఉద్యమాలు నిర్విరామంగా సాగించిన ధీశాలి. కనుక ఆయన తప్పులు చేసినా, అప్పులు చేసినా జనం అభ్యంతర పెట్టలేదు. పార్టీలు మార్చినా అది ఒక పెద్ద తప్పుగా పరిగణించలేదు. రాష్ట్రస్థాయిలోనే కాక దేశస్థాయిలో నాయకుడుగా మోతీలాల్ నెహ్రూ సరసన స్వరాజ్యపార్టీ స్థాయిలో రాజకీయ దురంధరుడిగా కేంద్ర శాసనసభలో తన వాణిని వినిపించిన నాయకుడు ఆయన. మదన్ మోహన్ మాలవ్య పెట్టిన నేషనల్ పార్టీలో పనిచేశారు. మద్రాసు నుండి ‘స్వరాజ్య’ దినపత్రిక పెట్టి ఇంగ్లీషులోను, తెలుగులోనూ నానా తిప్పలు పడి నడిపించిన టంగుటూరి ప్రకాశం సమయానికి జీతాలు ఇవ్వలేకపోయినా సిబ్బంది గొణగలేదు. స్వాతంత్ర్య పోరాటంలో నిమగ్నుడైనందున తీరికలేక తాను రాసిన విషయాన్ని ఉప సంపాదకులకు ఇచ్చి స్టైల్ (శైలి) పెట్టమనేవారట.  ఆయన సేవల కృషి ఫలితం అదంతా. ముఠా రాజకీయాలలో మునిగి తేలినా, పదవులు వచ్చినప్పుడు సంపాయించుకోకుండా ప్రజలకోసం సంస్కరణలు తలపెట్టి నిజమైన ప్రజాసేవకుడిగా మార్గదర్శకత్వం చూపాడు. రాజగోపాలచారి వంటి వ్యక్తులతో తారసిల్లి అటు శాసనసభలోనూ, ఇటు బయటా పోరాడారు. ముఖ్యమంత్రిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం, ఫిర్కా స్థాయిలో సంస్కరణలు తలపెట్టడం, ఖాదీ ఉద్యమానికి అనుకూలంగా నూలు మిల్లులను రద్దుచేయటం వంటివి ఆనాడు ప్రకాశం మాత్రమే చేయగలిగాడు. కమ్యూనిస్టులపై తీవ్ర చర్యలు తీసుకోవడం, వారిపై మలబారు పోలీసులను పిలిపించి దమనకాండ జరిపించడం కూడా ప్రకాశం రాజకీయ జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. రాజగోపాలాచారి ఆయనకు వ్యతిరేకి.
మద్రాసును ఆంధ్రలో భాగం చేయాలని ఎంతో తిప్పలు పడి టంగుటూరి ప్రకాశం విఫలమయ్యారు. ఆంధ్రులకు చెందాల్సిన నగరం అని నిరూపించదలచి తొలి ఎన్నికలలో మద్రాసు బీచ్ నియోజక వర్గంలో పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినా ఎన్నికల జైత్రయాత్ర జరిపి ఆంధ్రలో పర్యటించి వరుసగా కొమ్ములు తిరిగిన ఆంధ్ర కాంగ్రెస్ మంత్రులను - కల్లూరి చంద్రమౌళి మొదలు, కళా వెంకట్రావు వరకు మట్టి కరిపించారు. అటువంటి చరిత్రగల ప్రకాశం కమ్యూనిస్టులతో కలిసి తొలి ముఖ్యమంత్రి కావటానికి ప్రయత్నించి కుదరక, కాంగ్రెసుతో చేతులు కలిపి సఫలమయ్యారు. ఆయనకు సన్నిహితులుగా తెన్నేటి విశ్వనాథం చివరి వరకు నిలిచారు.
తొలుత నేనెలా కలిశాను?
నేను కర్నూలులో తొలుత ప్రకాశంపంతులుగారిని విద్యార్థి దశలో కలిసినప్పుడు చాలా సంతోషించాను. నేను గుంటూరు ఏ.సి. కాలేజీలో చదువుతూండగా రెండుమూడు పర్యాయాలు కర్నూలు రాజధానికి వెళ్ళటం. మరికొన్నిసార్లు గుంటూరులోనే ప్రకాశం పంతులుగారిని కలిసే అవకాశం ఏర్పడింది. అదొక గమ్మత్తయిన సందర్భం. గుంటూరులో లచ్చన్న అనుచరులు, వడ్డెంగుంట వెంకటేశ్వర్లు, మాదాల పెద్ద తిమ్మయ్య, రిక్షా యూనియన్ నాయకులుగా ఉన్నారు. అప్పుడు తొక్కుడు రిక్షాలు ఉండేవి. రిక్షాలో ఒక్కరే ఎక్కాలని నియమం వుండేది. విజయనగరంలో ఇద్దరిని ఎక్కనిస్తున్నట్టు తెలిసి అలాగే తమను కూడా అనుమతించాలని రాష్ట్ర ఐ.జి.పి.నంబియార్ ను కోరాలనుకున్నారు. ఆయనకు తెలుగు రాదని, ఇంగ్లీషులో మాట్లాడేవారు కావాలని నన్ను వెంటపెట్టుకుని కర్నూలు వెళ్ళారు. అయితే నాకు వచ్చిన ఇంగ్లీషు కూడా అప్పట్లో అంతంత మాత్రమే. కర్నూలు పోలీసు డేరాలలో ఉంటున్న నంబియార్ దగ్గరకు వెళ్ళాము. నేను వచ్చీరాని ఇంగ్లీషులో తడబడుతూ విషయం చెబుతూంటే, నంబియార్ గ్రహించి, ఆయనే స్వయంగా తెలుగులో మాట్లాడారు. హమ్మయ్య అనుకుని, పిటిషన్ ఇచ్చి వచ్చిన పని చెప్పాము. ఆయన ఇద్దరిని రిక్షాలో ఎక్కడానికి అనుమతించారు. వచ్చిన పని సఫలమైంది. గనక నాయకులను చూచి వెళదాం అనుకున్నాం. ఆ విధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశంగారి బంగళాకు వెళ్ళాము. ఆనాడు ‘సెక్యూరిటీ’ ఆర్భాటం అంతగా లేదు. ఎవరినైనా త్వరగా కలుసుకోవడానికి వీలుండేది. ప్రకాశంగారిని కలిసి నమస్కరించి, కూర్చున్నాము. అప్పటికే ఆయన కురువృద్ధుడైపోయాడు. కదలిక సన్నగిల్లింది. చూపు తగ్గింది. జ్ఞాపకశక్తి కూడా మందగించింది. చేతులలో కొద్దిగా వణుకు వచ్చింది. మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారు. ఆయనపట్ల గౌరవంతో, వీరారాధనతో వెళ్ళాం గనక, పలకరించిందే చాలని తృప్తి పడ్డాము. ఆయన కొంచెంసేపు అదీ ఇదీ మాట్లాడి, గుంటూరు సంగతులు కూడా అడిగారు. తొలి కలయిక పరిచయం ఆ విధంగా జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మరో రెండుసార్లు కర్నూలులో లచ్చన్నగారి వెంట ప్రకాశంగారిని కలవగలిగాను.
నేను చిన్నవాడినని భావించకుండా ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టిన ప్రకాశంగారి సన్నిధి మరపురానిది. అయితే నేను గౌతు లచ్చన్న వెంట మరోసారి వెళ్ళటం వలన అటువంటి ఆదరణ లభించింది. గౌతు లచ్చన్నగారు మా కుటుంబానికి సన్నిహితులు. రంగాగారి అనుచరులుగా మా తండ్రి రాజయ్య, మా అన్న విజయరాజకుమార్ ఉండటం వలన లచ్చన్నగారు తరచు మా యింటికి వచ్చేవారు. ఆ విధంగా నేను దగ్గరయ్యాను. అలాగే ఓబులరెడ్డి, నీరుకొండ రామారావుగార్లతోనూ దగ్గర అయ్యాను. అయితే నాకు రంగాగారి పార్టీ రాజకీయాలతో సంబంధం లేదు. నాకున్నదల్లా వ్యక్తిగత అభిమానం మాత్రమే. నేను పార్టీ రాజకీయాలలో ఎన్నడూ లేను. ఉత్తరోత్తర రంగాగారికి కొన్నేళ్ళు పి.ఎ.గా ఉన్నప్పుడు కూడా పార్టీ రాజకీయాలకి దూరంగానే పనిచేయగలిగాను. అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేతీరుగా ‘ఏరా, అబ్బాయ్, ఎప్పుడొచ్చావ్?’ అని పలకరించిన తీరులో ఆప్యాయత కనబడింది. ఆ తరువాత గుంటూరులో ఆయన మునిసిపల్ ట్రావెలర్స్ బంగళాలో విడిది చేసినప్పుడు యధేచ్ఛగా కలవగలిగాను. అప్పటికి ఆయనకు ముఖ్యమంత్రి పదవి పోయింది. మరోసారి గౌతు లచ్చన్నగారితో కలసి బంగళాకు వెళ్ళి కలిశాను. నేను కేవలం వెంట వెళ్ళిన విద్యార్థిని మాత్రమే. అయినా కర్నూలులో కలిసిన జ్ఞాపకాలు ఆయనకు ఉండటం నన్ను ఆశ్చర్య పరచింది. “ఏరా! బాగున్నావా…?” అని అంటే, నన్ను జీవితంలో ఏరా అని పిలిచిన వ్యక్తులు అరుదు. అయినా ప్రకాశంగారు అలా పిలిస్తే ఆప్యాయత కనిపించింది. ఆయన లచ్చన్నతో మాట్లాడుతూ ‘లచ్చన్నా, ముఖ్యమంత్రి పదవికి నాపేరు చెప్పు’ అన్నారు. లచ్చన్న నమస్కారం పెట్టి బయటపడ్డారు. ప్రకాశంగారి దగ్గర జనం లేరు. అయితే అప్పటికే ఆయనలో తొంగిచూస్తున్న వార్థక్యం రాజకీయాలకు ఇక పనికిరాడనిపించింది. బయటకు వచ్చిన లచ్చన్న తన వారితో, ‘పంతులుగారికి ఈ వయస్సులోనూ ఇంకా ముఖ్యమంత్రి కావాలని ఉంది’ అన్నారు.
మరొకసారి గుంటూరులోనే ట్రావెలర్స్ బంగళాలో ప్రకాశంగారిని చూశాను. ఏనుగుల వెంకటరామయ్య, ఎస్.వి.పంతులు, నేను వెళ్ళాము. గది బయట ఒక బుట్టెడు బత్తాయి కాయలు పెట్టి వున్నాయి. కుర్చీలో నేతి చలపతి కూర్చొని బత్తాయికాయలు వలుచుకుని తింటున్నాడు. లోనకు వెళ్ళిన తరువాత వెంకటరామయ్య నమస్కారం పెట్టి, ‘పంతులుగారూ, మీ అభిమానులు మీ కోసం బత్తాయికాయలు ఇచ్చి వెళ్ళితే బయట నేతి చలపతి ఎద్దు తిన్నట్టు తింటున్నాడు’ అని ఎద్దేవగా చెప్పారు. ప్రకాశంగారు ‘ఒరే చలపతీ బత్తాయి కాయలన్నీ నువ్వే తినేస్తున్నావురా?’ అన్నారు. ‘లేదండీ, వచ్చిన వారికి పంచుతూనే ఉన్నాను’ అని చెప్పాడు. మేము నవ్వుకుని బయటకు వచ్చాము. వెంకట రామయ్యతో నేను ‘అదేమిటయ్యా అంత మోటుగా మాట్లాడావు’ అని అడిగితే ‘నేతి చలపతి విషయంలో అదేమీ మోటు కాదులే’ అన్నారు. అప్పట్లో వెంకటరామయ్య గుంటూరులో భారత సేవక్ సమాజ్ ఆఫీసులో పనిచేస్తుండేవారు. పరుచూరి వీరయ్య ఆయనకు బాస్. వెంకటరామయ్య హాస్య ప్రియుడు. చతురోక్తులకు పెట్టింది పేరు. ప్రకాశంగారంటే వీరాభిమానం వుండేది. ఆ విధంగానే కలిసి వెళ్ళాము.
గుండె చూపింది గాంధీగారికి - సిపాయి తుపాకికి గాదు
ప్రకాశంగారు ఆ తరువాత కొద్దిరోజులకే చనిపోయారు. చివరివరకూ కారులో ప్రయాణాలు చేస్తూ వచ్చారు. నేను ఆ తరువాత ప్రకాశంగారి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఆయన రచనలు, వ్యాసాలు చదివాను. రాజకీయాలలో పదవులలో ఆయన చేసిన పనులను నిశితంగా పరిశీలించాను. ప్రకాశంగారు తన స్వీయచరిత్ర రాసుకున్నారు. 1927లో సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు కాల్పులు జరపటం, ప్రకాశంగారు పోలీసులకు గుండె చూపెట్టి కాల్చుకోమన్నాడని చాలామంది చెప్పుకునేవారు. అది ఆయన ధైర్యానికి గీటురాయిగా పేర్కొన్నారు. ప్రకాశంగారు ఆ విషయాన్ని విపులంగా స్వీయచరిత్రలో రాశారు. కాల్పులలో చనిపోయిన వ్యక్తిని చూడటానికి వెళ్ళినప్పుడు ఒక పోలీసు ఆపటం, పక్కనున్నవారు ఆయన ప్రకాశం పంతులు అని చెప్పటం, అప్పుడు పోలీసులు అనుమతివ్వటం జరిగింది. ఇది ప్రకాశంగారు స్వయంగా రాసిన విషయం. కానీ ప్రజలలో ఆ విషయం ఆ విధంగా కాక ఒక వదంతిగా, కట్టుకథగా అల్లుకుపోయింది. ఆయన చెప్పిన విషయాన్నే యధావిధిగా ఉదహరించి 1982లో ఈనాడు దినపత్రికలో నేను ఒక వ్యాసం రాస్తే ప్రకాశం వీరాభిమానులు నాపై విరుచుకుపడ్డారు. అప్పట్లో ఎడిటర్ గా ఉన్న గజ్జల మల్లారెడ్డి ఆ విషయం చెప్పి వేలాది ఉత్తరాలు తమ కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు.
మహాత్మా గాంధీ తిరుగులేని నాయకుడుగా ఉన్నప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం అనంతరం జైలు నుండి బయటకు వచ్చిన ప్రకాశం జనం దగ్గర డబ్బు వసూలు చేసి లెక్కలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకున్నాడని, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కావడానికి తగడని అన్నారు. ప్రకాశం ధీరోదాత్తంగా గాంధీని ఎదిరించి, ప్రజా నాయకుడుగా కామరాజు నాడార్ సహకారంతో మద్రాసు ముఖ్యమంత్రి అయ్యాడు. రాజగోపాలాచారి కూడా గాంధీజీతో చేతులు కలిపి ప్రకాశాన్ని ఎదిరించాడు. వాటన్నిటినీ తట్టుకుని తిరుగులేని ప్రజా నాయకుడుగా, మదరాసు ముఖ్యమంత్రిగా ప్రకాశం తన సత్తా చూపాడు. ఆ విధంగా గాంధీజీకి గుండె చూపిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం.
రాజకీయాలలో ప్రకాశంగారు ఆచార్య రంగాతో కలవటం, విభేదించటం, రాష్ట్ర రాజకీయాలను చాలా మలుపులు తిప్పింది. అలాగే పట్టాభి సీతారామయ్యతో పడక రాజకీయాన్ని నడిపిన ప్రకాశం కాంగ్రెస్ కు భిన్న నాయకత్వం చూపారు. ఏమైనా టంగుటూరి ప్రకాశంగారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానూ, ఆ తరువాత చిరుపరిచయం నా అనుభవాలలో చిరస్మరణీయమైనది. ఆనాడు ప్రకాశంగారంటే ఒక రాజకీయ హీరోగా, ధైర్యానికి మారుపేరుగా ఉండేది. చివరి రోజులలో ఆయన కుమారుడు హనుమంతరావు వలన కొంత చెడు పేరు వచ్చిందని వినికిడి. ప్రకాశంగారికి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చినా రాజకీయాలలో రిటైర్ కాకుండా చనిపోయిన నాయకుడాయన.
నేను కలిసిన, పరిచయం చేసుకున్న తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం కాగా అది జీవితంలో మంచి అనుభూతి మిగిల్చింది. అతి కొద్ది పర్యాయాలు, అతి స్వల్ప పరిచయంతోనే నేను సరిపెట్టుకోవలసి వచ్చింది. నేను తొలిసారి కలిసేటప్పటికే ప్రకాశంగారు 80వ పడిలోకి రావడం ఆ తరువాత కొద్ది సంవత్సరాలకే ఆయన చనిపోవడం జరిగింది.


- నరిసెట్టి ఇన్నయ్య