మన మరో రాచకొండ
Posted by
innaiah
on Monday, September 12, 2016
>
> రాచకొండ అనగానే మనకు సుప్రసిద్ధ విప్లవ రచయిత, కథకుడు, నాటక కర్త రాచకొండ విశ్వనాథ శాస్త్రి గుర్తుకు వస్తారు. ఆయన రాసిన ‘నిజం’ నాటకం నాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అది సహజం. ఆయన ప్రభావం, విమర్శ, హాస్యం అలా కొందరు పాఠకులను ఆకట్టుకున్నది. ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నది మరో రాచకొండను గురించి. ఆయన ఎవరో కాదు విశ్వనాథ శాస్త్రి సోదరుడే. పూర్తి పేరు నరసింహ శర్మ.
>
> ప్రస్తుతం 93 ఏళ్ళ వయసులో కొందరు తెలుగు రచయితలను విస్తృత ప్రపంచానికి తెలియపరచాలని విశేష కృషి చేస్తున్నారు. తనకు నచ్చిన కొందరు రచయిత్రులను, రచయితలను ఎంపిక చేసుకున్నారు. అందులో ముఖ్యంగా కవితలను ఇంగ్లీషులో అనువదించి అందిస్తున్నారు. ఎన.గోపి, ఎలనాగ కవితలు ఇంగ్లీషులోకి తెచ్చారు. ఇప్పుడు సుంకర వెంకమాంబ కవితలను కొన్నిటిని ఎంపిక చేసి ఇంగ్లీషులోకి అనువదించి ‘సంధ్యా రాగం’ పేరిట ప్రచురించారు. ‘అనురాగాలు - ఆత్మీయతలు’, ‘పడమటి సంధ్యారాగం’ పుస్తకాలను రచించారు. వృత్తి రీత్యా రాచకొండ విశ్వనాథ శాస్త్రి అడ్వకేట్ అయితే వారి సోదరులు నరసింహ శర్మ మనోచికిత్సా వైద్యులు. ఇండియాలో అమెరికాలో చాలాకాలం ఆ వృత్తిలో పేరు తెచ్చుకుని నేడు విశాఖలో స్థిరపడి రచనల, అనువాదాల రంగంలో ఆదర్శప్రాయమైన శ్రమ చేస్తున్నారు.
>
> రాచకొండ విశ్వనాథ శాస్త్రికంటే సాంఘిక రంగంలో ముందంజ వేసిన శర్మగారి జీవితంలో మరొక విశేషం ఉన్నది. 1949లోనే అన్నపూర్ణను కులాంతర వివాహం చేసుకున్నారు. వీరి పెండ్లి మంత్ర తంత్రాలు లేకుండా ఆధునిక పద్ధతిలో జరిగింది. పురోహితుడు కుమ్మమూరు వాస్తవ్యుడు రామకోటిరెడ్డి లౌకిక పురోహితుడు. వుయ్యూరులో జరిగిన వీరి పెళ్ళిలో దంపతులకు సుప్రసిద్ధకవి జాషువా తన కవితలతో ఆశీస్సులు అందజేశారు. శర్మగారు చేసుకున్న అన్నపూర్ణ కూడా డాక్టరే. వృద్ధాప్యంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. హైస్కూలు, కాలేజీ చదువుల తర్వాత శర్మగారు విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర వైద్య కళాశాలలో 1948లో మెడిసిన్ చదివారు. 1959లో ఎం.డి. పట్టా పొందారు. ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖలో 1950 నుంచి 1967 వరకు పనిచేశారు.
>
> 1967లో అమెరికా వెళ్ళి 18 ఏళ్ళు మెసాచుసేట్స్ వి.ఏ. హాస్పిటల్ (పెన్సిల్వేనియా)లో వివిధ వైద్యాలయాలలో, వివిధ రంగాలలో వైద్యసేవలందించారు. 1945లో అనాటమీలో ఒకసారి, 1947లో మెడిసిన్‌లో రెండవసారి స్వర్ణపతకాలను పొందారు. పదికి పైగా విలువైన రీసెర్చి పేపర్లు తయారు చేసి విదేశీ జర్నల్స్‌తో సహా అనేక జర్నల్స్‌కి రాశారు. వీటిని పరిశీలించిన అమెరికా యూనివర్సిటీ, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సురావిజ్ ఆహ్వానం మేరకు శర్మగారు అమెరికా వెళ్ళి సేవలందించారు. శర్మగారిది వైద్యవృత్తే అయినప్పటికీ గ్రంథ పఠనం, గ్రంథ సేకరణ, తెలుగు, ఇంగ్లీషు భాషలలో కవితారచన, కవితలను ఇంగ్లీషు నుండి తెలుగుకు అనువదించడం వీరి అభిరుచులు. కుప్పం ద్రవిడియన్ విశ్వవిద్యాలయం ప్రచురించిన రావిశాసి్త్ర కథల ఆంగ్లానువాదానికి సమన్వయ కర్తగా, అనువాదకులుగా ఉన్నారు. వారి ఆంగ్ల కవితా సంపుటి ‘హ్యూమన్ టచ్ అండ్ అదర్ పొయెమ్స్’, వెలువరించారు. సృజనాత్మక రచనలు చేయడంలో దిట్ట. గ్రంథ సేకరణ ఆయన అలవాటు. శర్మగారు ప్రకృతి ప్రేమికులు, ఆరాధకులు. మిత్రులు వీరిని ఎన్.ఎ్‌స.రాచకొండగా ఆప్యాయంగా పిలుచుకుంటారు. విశాఖ సాగరానికి, యారాడ కొండ - జనసాగరానికి ఈ రాచకొండ శిఖరాయమానాలు అంటారు.
>
> ‘అన్నపూర్ణాక్షరం’ పేర శర్మగారు రాసిన ఆంగ్ల కవితకి ప్రముఖ రచయితా విమర్శకుడూ రామతీర్థ తెలుగు అనువాదంతో ద్విభాషా కవితా సంపుటిగా వెలువడింది. షేక్స్‌పియర్ సానెట్‌లకు రాచకొండ నరసింహశర్మ అనువాదం చేశారు.
> అత్తవారింటికి ఉయ్యూరు వచ్చినప్పుడు సెంటర్‌లో దిగి, ఒక కూలీని మాట్లాడుకుని అతి తేలికైనవి కూలీ చేతికిచ్చి బరువైన సామాను తాను మోస్తూ అత్తవారింటికి నడిచి చేరేవారు. ఇల్లు చేరగానే స్టెతస్కోపుతో ఆ కూలీని పరీక్షించి అధిక బరువులు మోయవద్దని సలహా ఇస్తూ, మామూలుగా అందరూ ఇచ్చే కూలీకి పదిరెట్లు అతని జేబులో పెట్టి, ఆరోగ్యమైన భోజనం చేయమని చెప్పి, అతనికి ఆప్యాయంగా అత్తగారు భార్యలతో విస్తరిలో వడ్డింపజేసి కమ్మని భోజనం పెట్టి పంపించేవారు. హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్‌లో పనిచేస్తున్నప్పుడు తెలిసిన ముసలి రిక్షా డ్రైవర్ని కుదుర్చుకుని గోల్కొండకి అందులో కూర్చుని వెళ్ళేవారు. ఎత్తు పల్లాలొచ్చినప్పుడు దిగి, రిక్షావాడు అలసి నట్లు కనిపిస్తే అతన్ని రిక్షాలో కూర్చోపెట్టుకుని తానే రిక్షా తొక్కిన మానవమూర్తి రిక్షా దిగగానే అందరూ ఇచ్చే మామూలు కూలీకంటే కనీసం మూడురెట్లు డబ్బు ఇచ్చి పంపేవారు. పేషంట్లను ఆప్యాయంగా పలకరిస్తూ వ్యాధి లక్షణాలను పూర్తిగా వివరంగా తెలుసుకుంటూ సరైన మందులను ఇచ్చేవారు. మందులను రాయటానికి డాక్టర్ శర్మ గారికి అభ్యంతరం లేదు కాని అది చిట్టచివరి అంశం అనేవారు. మాటలతో, ఓదార్పుతో రోగులకి ఉపశమనం కల్గించాలే తప్ప మందులతో కాదు అని నమ్మి అలానే ప్రవర్తించేవారు. శర్మగారు పెద్దలతో, పిన్నలతో కలిసిపోయి సందడిగా వుంటారు.
> నరిసెట్టి ఇన్నయ్య
>
No comments:
Post a Comment