తెలుగువారిలో మానవవాద ఉద్యమం
Posted by
innaiah
on Monday, June 20, 2016
(జూన్ 20వ 2016 తేదీ అంతర్జాతీయ హ్యూమనిస్ట్ ఉద్యమ దినోత్సవ సందర్భంగా)
తెలుగువారిలో మానవవాద ఉద్యమం
ఎందుకు క్షీణించింది ?
(From Andhra Jyothi Telugu daily from Hyderabad)
1940లో ప్రారంభమై 50 సంవత్సరాలపాటు తెలుగువారిమీద వివిధ రంగాలలో ప్రభావం చూపించిన మానవవాద ఉద్యమం క్రమేణా కొద్దిమంది వ్యక్తులకు పరిమితమై నిలిచింది. కానీ ప్రపంచంలో అనేకచోట్ల ఈ ఉద్యమం బలపడుతూ వైజ్ఞానిక రంగం మద్దత్తుతో ముందుకు సాగుతున్నది. ఈ సంవత్సరంలో అంతర్జాతీయ మానవవాద సంఘ మహాసభలు మాల్టాలో జరిగాయి. ఈ నెలలో అమెరికాలో అన్ని హ్యూమనిస్ట్, రేషనలిస్ట్, నాస్తిక, సెంటర్ ఫర్ ఎంక్వయిరీ, తదితర సంఘాలన్నీ వాషింగ్టన్ రాజధాని నగరంలో ప్రదర్శనలు, సభలు, ప్రసంగాలు, వీడియో ప్రసారాలు జయప్రదంగా జరిపారు. కొన్నేళ్ళుగా అమెరికాలో ఈ సంప్రదాయం కొనసాగుతుండగా హ్యూమనిస్టుల మాట చట్టసభలలో కూడా వినిపిస్తున్నది. ఇదే ధోరణి యూరోప్, ఆస్ట్రేలియా, కొన్ని ఆసియా దేశాలలో వ్యాపిస్తున్నది.
తెలుగువారిలో హ్యూమనిస్టు ఉద్యమం 1940 ప్రాంతాలలో ఎమ్.ఎన్.రాయ్ నాయకత్వాన ఆరంభం కాగా అనేకమంది మేథావులు ఉపాధ్యాయులు రచయితలు చురుకుగా పాల్గొన్నారు. రాజకీయాలలోశాస్త్రీయత కావాలని అనేక అధ్యయన తరగతులు నిర్వహించి, అనేక రచనల ద్వారా సమాజంలోకి వెళ్ళగలిగారు. రాజకీయ పార్టీగా ప్రయత్నించి విఫలమై ఉద్యమంగా కొనసాగారు. ఇందులో పాల్గొన్న వ్యక్తులు చాలా ప్రతిభావంతులు.
తెలుగు రంగంలో అబ్బూరి రామకృష్ణారావు మొదలు మానవవాద ఉద్యమంలో చురుకుగా కార్యక్రమాలు నిర్వహించిన వారి సంఖ్య చాలా ఉన్నది.
అర్థశతాబ్దంపాటు చైతన్యవంతంగా సాగిన హ్యూమనిస్టు ఉద్యమం నేడు వేళ్ళపై లెక్కించదగిన వ్యక్తులకు పరిమితం కావటం వాస్తవం. 1940లో రాజకీయ పార్టీగా ప్రారంభమైన హ్యూమనిస్టు ఉద్యమం 8 సంవత్సరాలపాటు దేశంలో ఆర్థిక రంగంలోనూ, రాజకీయ, వైజ్ఞానిక పరిధిలోనూ కొత్త ఆలోచనలు తెచ్చిపెట్టింది. 1946లో జరిగిన తొలి ఎన్నికలలో డిపాజిట్లు దక్కించుకోలేని హ్యూమనిస్టులు 1948లో పార్టీని రద్దు చేసుకున్నారు. పునర్వికాస ఉద్యమం చేపట్టి అన్ని రంగాలలో వైజ్ఞానిక దృక్పథం ప్రజలలోకి ప్రచారం చేయాలని తలపెట్టారు. అనేక రాజకీయ పాఠశాలలు నడిపి చైతన్యవంతమైన యువతను శిక్షితులను చేశారు. సాహిత్య రంగంలో వెలువరించిన రచనలు కొత్త దిశగా ఆలోచనలు అలరింపచేశాయి. ఇందులో త్రిపురనేని గోపీచంద్, పాలగుమ్మి పద్మరాజు, జి.వి.కృష్ణారావు, కోగంటి రాధాకృష్ణమూర్తి, ఆలూరి బైరాగి, నరసరాజు, పి.వి.సుబ్బారావు, ఎన్.వి.బ్రహ్మం, రావిపూడి వెంకటాద్రి, భట్టిప్రోలు హనుమంతరావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, పేర్కొనదగినవారు. గూడవల్లి రామబ్రహ్మం సంస్కరణల సినిమాలు తీసి కొత్తదారులు తొక్కారు. ఆయన నడిపిన పత్రిక కూడా ఆనాడు ధైర్యానికి మారుపేరుగా వుండేది. మల్లాది రామమూర్తి, సుబ్బమ్మ, సంఘంలో చొచ్చుకుపోయి సాంఘిక సేవ చాలామందిని ఆకట్టుకోగలదని నిరూపించారు. అఖిల భారత హ్యూమనిస్టు నాయకులు తరచు, పర్యటనలు చేసి తెలుగువారిని ఉత్సాహభరితులను చేస్తుండగా సెక్యులర్ ఆలోచనలు వ్యాపించాయి. దీనికి ఎ.బి.షా, నాయకత్వం వహించగా సి.హెచ్. రాజారెడ్డి, కొల్లా సుబ్బారావు, తోటకూర శ్రీరామమూర్తి, సిద్ధార్ధ్ భక్ష్, పోలు సత్యనారాయణ, మూసిన నారాయణ, చార్వాక వెంకటేశ్వర్లు, మండవ శ్రీరామమూర్తి, కోనేరు కుటుంబరావు, త్రిపురనేని గోపీచంద్, మేకా చక్రపాణి, ప్రభృతులు ఉన్నారు. ఆలపాటి రవీంద్రనాథ్ సాహిత్య సాంస్కృతిక రంగాలలో తెనాలి కేంద్రంగా పత్రికల ద్వారా ఉద్యమానికి విశేషంగా తోడ్పడ్డారు. ఎమ్.వి. శాస్త్రి, పెమ్మరాజు వెంకటరావు, ఎ.ఎల్.నరసింహారావు, కల్లూరి బసవేశ్వరరావు, ఎనలేని కృషి చేశారు. ఉపాధ్యాయులలో ఎలవర్తి రోశయ్య మొదలు అనేకమంది హ్యూమనిస్ట్ విద్యార్థులను తయారు చేయటంలో చేయూతనిచ్చారు.
అనేక తెలుగు పత్రికలు నడిపి, ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టి, విద్యాధికులను చేయటానికి ప్రయత్నించారు. రాడికల్, చార్వాక, సమీక్ష, రాడికల్ హ్యూమనిస్ట్, హేతువాది, వికాసం, జ్యోతి, మిసిమి, ప్రసారిత వంటి పత్రికలు బాగా తోడ్పడ్డాయి. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి నరిసెట్టి ఇన్నయ్య చేసిన హ్యూమనిస్టు సాహిత్యానువాదాలను, ముఖ్యంగా ఎమ్.ఎన్.రాయ్ రచనలను, శిబ్ నారాయణ్ రే, వి.బి.కర్నిక్, ఎ.బి.షా, అగేహానంద భారతి రచనలు వెలువరించాయి.
హ్యూమనిస్టు ఉద్యమంలోకి వచ్చిన సుప్రసిద్ధ ఎడిటర్, జర్నలిస్టు, రాజ్యసభ సభ్యులు నార్ల వెంకటేశ్వరరావు తమ అమూల్య రచనలతో చాలా ప్రభావాన్ని చూపెట్టాడు. అందులో ఆయన గీతపై వ్రాసిన విమర్శనా గ్రంథం విదేశీ హ్యూమనిస్టులు కూడా ప్రచురించారు. కలకత్తా నుండి సుశీల్ ముఖర్జీ, మినర్వా అసోసియేట్స్ ద్వారా నార్ల రచనలను వ్యాప్తిలోకి తెచ్చారు.
1955లో ఎమ్.ఎన్.రాయ్ చనిపోయిన తర్వాత ఉద్యమానికి తొలి దెబ్బ కలుగగా మిగిలినవారు కొంతకాలం పాటు చైతన్యతను నిలబెడుతూ వచ్చారు. ఇందులో అఖిల భారత స్థాయిలో వున్నవారు తెలుగు ప్రాంతంలో తరచు పర్యటన చేసి తోడ్పడ్డారు. జి.డి.పరేఖ్, వి.యం.తార్కుండే, సుశీల్ ముఖర్జీ, జె.బి.హెచ్. వాడియా, వి.బి. కర్నిక్, మణిబెన్ కారా, ఇందుమతి, ప్రేమనాథ్ బజాజ్, మొదలగువారున్నారు.
తెలుగువారిలో ఆవుల గోపాలకృష్ణమూర్తి చేస్తున్న కృషికి అపారమైన గుర్తింపు వచ్చింది. ఆయన ఒక తాలూకా కేంద్రం అడ్వకేటుగా ఉన్నప్పటికీ ఆయన సేవలను గమనించి, అమెరికా ప్రభుత్వం ఆధికారికంగా ఆహ్వానించడం 1963లో జరిగిన గొప్ప సంఘటన. ఆవుల సాంబశివరావు జస్టిస్ గా వుంటూనే మానవవాద సంఘాధ్యక్షులయి చాలా కృషి చేశారు. క్రమేణ రాజకీయ పాఠశాలలు, సాహిత్యం, సన్నగిల్లుతూ ఉద్యమం పలచబడి ఉన్నదా… లేదా... అన్న స్థితికి వచ్చింది. మరొకవైపు ప్రపంచంలో యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలో ఉద్యమం క్రమేణా బలపడుతూ ఉన్నది. ప్రాథమిక విద్యారంగం నుండి సిలబస్ శాస్త్రీయంగా ఉండడం, ఈ ఉద్యమానికి బలాన్ని చేకూర్చగలదు. కానీ అది జరగటంలేదు. విదేశాలలో సైంటిస్టులు కొందరు ఈ ఉద్యమానికి బలాన్ని సమకూరుస్తూండగా ఇండియాలో ఆ పరిస్థితి అట్టడుగునే వున్నది. హ్యూమనిస్టు ఉద్యమం అవసరం. కానీ, చాలా కృషి జరిగితే తప్ప ఇండియాలో దానికి భవిష్యత్తు సందేహాస్పదంగా వున్నది.
నరిసెట్టి ఇన్నయ్య
(అమెరికా నుండి)
1936లో ఫైజ్ పూర్ కాంగ్రెస్ సభలో రాయ్ చేసిన ఉపన్యాసం సాంప్రదాయ రాజకీయ ధోరణికి భిన్నంగా వున్నట్లు ఆ సభలకు హాజరైన ప్రతినిధులు భావించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఆ సభలకు హాజరైన ములుకుట్ల వెంకటశాస్త్రి ఎం.ఎన్.రాయ్ ని ఆహ్వానించారు. శాస్త్రి, కుందుర్తి ఈశ్వరదత్తు నడిపే పత్రికకు ప్రతినిధిగా అక్కడకు వెళ్లారు. అతని ఆహ్వానాన్ని రాయ్ అంగీకరించారు. వెన్నెలకంటి రాఘవయ్య కూడా ఆ సభలో పాల్గొని కార్మిక సమస్యలపట్ల రాయ్ పంథా నచ్చినందున వ్యవసాయ కార్మిక మహాసభకు రావలసిందిగా నెల్లూరుకు ఆహ్వానించారు. 1938 జూలై 31న ఎం.ఎన్.రాయ్ నెల్లూరుకు రాగా, అక్కడి నుండి రాయ్ ని కోస్తాంధ్ర తీరంలోని కాకినాడ పట్టణానికి ఎం.వి. శాస్త్రి తీసుకెళ్ళారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న అబ్బూరి రామకృష్ణారావు రాయ్ ని వాల్తేరుకు తీసుకొచ్చారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డికి పరిచయం చేశారు. వారిద్దరూ గొప్ప స్నేహితులయ్యారు. ‘జైలు ఉత్తరాలు’ అనే రాయ్ పుస్తకానికి సి.ఆర్.రెడ్డి గొప్ప పరిచయం రాశారు. అది రాయ్ జైలులో వుండగా ఎల్. ఎన్. రాయ్ కు రాసిన లేఖావళి. అప్పటి నుండి రాయ్ తరచుగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తూ వచ్చారు. జైలు ఉత్తరాలు గ్రంథాన్ని తరువాత అనువదించి రాడికల్ హ్యూమనిస్టు తెలుగు పక్షపత్రికలో ధారావాహికగా ప్రచురించారు.
బ్రిటిష్ పాలనలో రాయ్ ఆరేళ్ళు జైలు శిక్ష అనుభవించారు. ఆయన జైలు నుండి విడుదలయ్యే సమయానికి (1936) ‘ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాలు’ అనే అతని బృహద్రచన పూర్తయింది.
రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి అబ్బూరి రామకృష్ణారావు మొదటి రాష్ట్ర ఆర్గనైజర్ అయ్యారు. అతనికి ఎం.వి.శాస్త్రి, ఏ.ఎల్.నరసింహారావు, పెమ్మరాజు వెంకట్రావు, విజయనగరం మునిసిపల్ ఛైర్మన్ గా వున్న తాతా దేవకీనందన్ సమర్థవంతంగా సహకరించారు. ఆంధ్రలో రాయ్ సందేశం త్వరితగతిన వ్యాపించింది. రచయిత, సినీదర్శకుడైన త్రిపురనేని గోపీచంద్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి మొదటి రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. రాజకీయ కథానికలను తెలుగువారికి పరిచయం చేసిన గొప్ప రచయిత గోపీచంద్. అతడు కమ్యూనిస్టులను, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దుయ్యబట్టాడు. రాయ్ ఆలోచనలలో చాలా భాగం గోపీచంద్ కథానికలు, నాటకాలు, విమర్శల రూపంలో తెలుగులోకి తెచ్చారు. ఆనాడు పత్రికారంగం తీవ్రజాతీయ భావాలతో కూడి ఉన్నందువల్ల హ్యూమనిస్టుల రాడికల్ భావాలను వారు పట్టించుకోలేదు. ఈ కారణం చేతనే సినీదర్శకుడైన గూడవల్లి రామబ్రహ్మం ప్రజామిత్ర అనే వారపత్రికను ప్రారంభించి అందులో రాయిస్టుల వ్యాసాలను ప్రచురించేవారు.
రాడికల్ హ్యూమనిస్టులు ఎవరితోనూ రాజీపడలేదు. ఆంధ్రలో వారు రాజకీయ పాఠశాలలను నడిపి చాలామంది యువకులకు శిక్షణనిచ్చారు. విజయవాడ నుండి బండి బుచ్చయ్య సంపాదకత్వంలో నడిచే ములుకోల వంటి కొన్ని పత్రికలు మాత్రమే రాయిస్టుల వ్యాసాలను ప్రచురించాయి. 1940లో డెహ్రాడూన్ లో ప్రథమ రాడికల్ డెమోక్రటిక్ రాజకీయ పాఠశాలను నడిపారు. అక్కడ జరిగిన ప్రసంగాలన్నిటిని (సైంటిఫిక్ పాలిటిక్స్) ‘శాస్త్రీయ రాజకీయాలు’ అనే గ్రంథ రూపంలోకి తెచ్చారు. దాన్ని ‘వర్గ సంబంధాలు’గా తెలుగులోకి అనువదించారు. అది చాలామంది మేథావులను ఆకర్షించింది. కమ్యూనిస్టులకు తగిన సమాధానం చెప్పింది.
మానవవాదానికి అనుకూలంగా పాలగుమ్మి పద్మరాజు, జి.వి.కృష్ణారావు శక్తివంతమైన సాహిత్య రచయితలుగా ఆవిర్భవించారు. మానవవాదమే కేంద్రబావనగా పద్మరాజు అనేక నవలలు రాశారు. గాలివాన అనే అతని కథానిక ప్రపంచ కథానికల బహుమతిని గెలుచుకుంది. చాలా సినిమాలకు అతను స్క్రిప్టు రాశారు. రాయ్ ప్రతిపాదించిన తత్వానికి సిద్ధాంత రచయితగా జి.వి.కృష్ణారావు ఆవిర్భవించారు. కళలకు సంబంధించిన కమ్యూనిస్టుల సిద్దాంతాన్ని పూర్వపక్షం చేశారు.
కూచిపూడి గ్రామస్తుడైన కోగంటి రాధాకృష్ణమూర్తి ప్రజాస్వామ్య సాహిత్య ప్రచురణల పేరిట సంస్థనే ప్రారంభించారు. అనేక గ్రంథాలను, అనువాదాలను ప్రచురించారు.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రాయ్, అతని సన్నిహిత సహచరుడైన జి.డి.పరేఖ్ ప్రజాప్రణాళిక పేరిట ప్రత్యామ్నాయ ఆర్థిక ప్రణాళికను ప్రతిపాదించారు. బిర్లా తదితర ధనవంతుల బొంబాయి ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రణాళికను పరిగణించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఫాసిస్టులకు, నాజీలకు వ్యతిరేకంగా బ్రిటీషువారిని సమర్థించినందుకు రాయ్ పై, రాడికల్స్ పై కమ్యూనిస్టులు దుష్ప్రచారం చేశారు. దాంతోనే ఆగిపోకుండా యుద్ధ ప్రచారానికి 13వేల రూపాయలు తీసుకున్నందుకు వారిని నిందించారు. బ్రిటిష్ వారిని యుద్ధ విషయంలో ఎందుకు సమర్థించిందనే విషయాన్నంతటినీ వి.బి.కర్నిక్ ప్రపంచానికి సహేతుకంగా వివరించారు.
డెహ్రాడూన్ లో రెండవ అఖిలభారత అధ్యయన శిబిరం జరిగింది. ఆ సందర్భంగా చేసిన ప్రసంగాలన్నిటిని న్యూ ఓరియెంటేషన్ గ్రంథంగా తీసుకొచ్చారు. అందులోని సారాంశాన్ని తెలుగులోకి అనువదించారు.
యుద్ధ సమయంలో బెంగాలులో, ప్రత్యేకించి కలకత్తా కమ్యూనిస్టులు రాడికల్స్ మీద దాడి చేశారు. వారి అధ్యయన తరగతులను అడ్డగించారు. వారి హింసాత్మక దాడికి గురైన వారిలో ఎం.వి.రామమూర్తిగారొకరు.
1946లో జరిగిన మొదటి ఎన్నికలలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ పోటీ చేసింది. అప్పుడు ఓటర్లు పరిమితంగానే ఉన్నారు. పన్నుకట్టే వారికి మాత్రమే ఓటు హక్కు వుండేది. ఆంధ్ర నుండి కొద్దిమంది అభ్యర్థులే పోటీచేసి గొప్ప సవాలును ఎదుర్కొన్నారు. రాజకీయ పార్టీల నుండి, జాతీయవాద ఓటర్ల నుండి వారు చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. దాంతో అభ్యర్థులందరూ ఎన్నికలలో ఓడిపోయారు. అయినప్పటికీ హ్యూమనిస్టు ప్రత్యామ్నాయాన్నిప్రచారం చేయడానికి రాడికల్స్ కు అదొక గొప్ప అవకాశమైంది. కోగంటి రాధాకృష్ణమూర్తి రావిపూడి వెంకటాద్రి, బండారు వందనం ఇంకా యితరులు పోటీ చేశారు. ఎం.వి.రామమూర్తి, గుత్తికొండ నరహరి, ఆవుల గోపాలకృష్ణమూర్తి, ఎన్.వి.బ్రహ్మం, మరికొందరు అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆ ఎన్నికలు రాడికల్ డెమోక్రటిక్ పార్టీనే గొప్ప మలుపు తిప్పాయి. ఆ ఎన్నికల తరువాత ఉద్యమం కోసం ఎం.ఎన్.రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీనే రద్దు చేయాలని ప్రతిపాదించారు. వెంటనే దాన్ని ప్రత్యామ్నాయ రాజకీయ తత్వంగా 22 సిద్ధాంతాల రూపంలో వెలువరించారు. సుదీర్ఘ చర్చలు జరిగాయి. వెంటనే తెలుగు అనువాదం వెలువడింది. పార్టీ లేకుండా, అధికారం లేకుండా రద్దు చేయడాన్ని ఫిలిప్ స్ప్రాట్ వ్యతిరేకించారు. అయినా రాయ్ తన సిద్ధాంతాన్ని వీడలేదు.
జవహర్ లాల్ నెహ్రూ అనే పేరుతో ఎం.ఎన్.రాయ్ ఒక శక్తివంతమైన చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. అందులో నెహ్రూ రాజకీయతత్వాన్ని బట్టబయలు చేశారు. అందులో నెహ్రూకు తగిన సమాధానాన్ని యిచ్చారు. నెహ్రూ విమర్శిస్తూ తనకు రాయ్ ఆర్థిక విధానాలు నచ్చాయిగాని, రాజకీయాలు నచ్చలేదన్నారు. దానికి రాయ్ ప్రతి విమర్శ చేస్తూ తన రాజకీయాలు, ఆర్థిక విషయాలు కలిసే వుంటాయని, వాటిని వేరు చేయలేమని సమాధానమిచ్చారు.
గాంధీపై రాయ్ చేసిన విమర్శను ఆంధ్రలోని తొలి రాడికల్ గ్రూపు చక్కగా ఆకళింపు చేసుకుంది. గోపీచంద్, ఆవుల గోపాలకృష్ణమూర్తి, గుత్తికొండ నరహరి ఆ విమర్శను సమర్థవంతంగా నిర్వహించారు. రాయ్ శాస్త్రీయ దృష్టితో గాంధీమత భావాలను దుయ్యబట్టారు. రాయ్ చేసిన విమర్శ ఆధారంగా ఆవుల గోపాలకృష్ణమూర్తి తెలుగులో గాంధీపై అనేక వ్యాసాలను ప్రచురించారు.
కోగంటి రాధాకృష్ణమూర్తి రాయ్ వ్యాసాలను చాలా వాటిని సులభశైలిలో తెలుగులోకి అనువదించారు. అతడు ప్రింటింగ్ ప్రెస్ ను పెట్టి అనేక హ్యూమనిస్టు రచనలను ప్రచురించారు.
రాయ్ `నవ్యమానవవాదా`న్ని ఆవుల గోపాలకృష్ణమూర్తి తెలిగించారు. అది చిన్నదైనా సిద్ధాంతం శక్తివంతమైనది.
స్వాతంత్ర్యానంతరం ఆంధ్రలో కమ్యూనిస్టులు గొప్ప బలమైన శక్తిగా వుండేవారు. వారిని సిద్ధాంతపరంగా, ప్రత్యామ్నాయాలతో ఎదుర్కోగలిగినవారు రాడికల్ డెమోక్రాట్లు మాత్రమే. ఎం.ఎన్.రాయ్, ఫిలిప్ స్ప్రాట్ లు ‘బియాండ్ కమ్యూనిజం’ అనే గ్రంథాన్ని తెచ్చారు. దాన్ని వెంటనే ఎం.వి.రామమూర్తిగారు తెలుగులోకి అనువదించారు. అది రాడికల్స్ కు బాగా ఉపయోగపడింది.
రాయ్ రచనలలో మకుటాయమానమైన బృహత్ గ్రంథం ‘రీజన్, రొమాంటిసిజమ్, రెవిల్యూషన్,’ (వివేకం, ఉద్వేగం, విప్లవం). నా తెలుగు అనువాదాన్ని తెలుగు అకాడమీ ప్రచురించింది. ఐరోపా రినైజాన్స్ ను అర్థం చేసుకోవాలంటే ఇది తప్పక చదవాల్సిన గ్రంథమని ఎరిక్ ఫ్రాం సిఫారసు చేసారు. (1955లో వెలువడిన అతని గ్రంథం ‘సేన్ సొసైటీ’లో). ఈ విషయాన్ని ఆవుల గోపాలకృష్ణమూర్తి రాడికల్ హ్యూమనిస్టుల దృష్టికి తెచ్చారు. ఈ గ్రంథంలోని మార్క్సిజం, హ్యూమనిజం వంటి కొన్ని భాగాలను జాస్తి జగన్నాథం తెనిగించారు. అది ‘వాహిని’ తెలుగు వారపత్రికలో ధారావాహికగా వచ్చింది.
ఆవుల గోపాలకృష్ణమూర్తి (1917-1967)
ఆంధ్రలోని రాయిస్టులు, హ్యూమనిస్టులలో ప్రతిభా వ్యక్తిత్వాలున్న మహనీయులు ఆవుల గోపాలకృష్ణమూర్తి. అతడు గొప్ప రచయిత, ఉపన్యాసకుడు. ఆ కారణంగా అతడు ‘వ్యాసోపన్యాసకుడు’గా ప్రసిద్ధి చెందారు. అతడు రాడికల్, రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష అనే వారపత్రికలకు సంపాదకులు. అతడు వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ తన కార్యకలాపాల ద్వారా మానవవాదాన్ని ప్రచారం చేశారు. మానవవాద ప్రచారంలో భాగంగా అతడు చాలా సెక్యులర్ పెళ్ళిళ్ళు చేశారు. సాహితీ చర్యలలో చురుకుగా పాల్గొని విశ్వనాథ సత్యనారాయణ వంటి అభ్యుదయ నిరోధక కవులను తీవ్రంగా విమర్శించాడు. రాయ్ ని, మానవవాదాన్ని విమర్శించే కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ వారికి, సోషలిస్టులకు, కాంగ్రెస్ వారికి సోషలిస్టులకు దీటుగా సమాధానాలిచ్చారు. అఖిల భారత రాడికల్ హ్యూమనిస్టు అధ్యయన తరగతులలో పాల్గొన్నారు. ఎ.జి.కె. కవులను, రచయితలను, గాయకులను, కళాకారులను ప్రోత్సహించి, కళల ద్వారా మానవవాద భావజాలన్ని ప్రచారం చేశారు.
బి.యస్.ఎల్.హనుమంతరావు చరిత్రను శాస్త్రీయంగా బోధించడమే గాక గ్రంథాలను రచించి ప్రచురించారు. కల్లూరి బసవేశ్వరరావు హనుమంతరావుతో కలిసి చరిత్ర పాఠ్యగ్రంథాలను రచించారు. ఎం.ఎన్.రాయ్ స్మృతులను తెలుగులోకి ప్రప్రథమంగా అనువదించింది హనుమంతరావే.
ఎం.ఎన్.రాయ్ రచించిన పిల్లి ఆత్మకథకు తెలుగులో మంచి పేరొచ్చింది. ముందుగా దాన్ని ఎ.వి.మోహన్ తెలుగులోకి అనువదించగా, తరువాత వెనిగళ్ళ కోమల కూడా దాన్ని తెలుగులోకి అనువదించారు. అది మూడుసార్లు పునర్ముద్రణ పొందింది.
ఆలపాటి రవీంద్రనాథ్ తెనాలి నుండి జ్యోతి పత్రికను ప్రారంభించారు. అది ఎం.ఎన్.రాయ్, ఎల్లెన్ రాయ్, ఇతర రాడికల్ హ్యూమనిస్టుల భావాలను ప్రచారం చేసి మంచి ప్రజాదరణ పొందింది. రవీంద్రనాథ్ కథలు చెప్పడంలో కొత్త ఎత్తుగడలను, ప్రవేశపెట్టారు. శాస్త్రీయ సెక్సు విద్యను, కుటుంబ నియంత్రణను కూడా అతడే పరిచయం చేశారు. ఎల్లెన్ రాయ్ వ్యాసాన్ని ప్రచురించి కుటుంబ నియంత్రణను ప్రోత్సహించినందుకుగాను 1948లో అతనిపై కేసు పెట్టారు. సంప్రదాయవాదులకు కుటుంబ నియంత్రణ భావమే మింగుడు పడేది కాదు. తరువాత అతడు మిసిమి మాసపత్రికను ప్రారంభించారు. అది సాహితీ ప్రియుల మన్ననలను అందుకొంది. సినీ రచయిత డి.వి.నరసరాజు జీవితాంతం రాయిస్టుగా వున్నారు. అతడు విరివిగా రచనలు చేశారు. వాటిలో కథానికలు, కథలు, వ్యంగ్యవ్యాసాలు మంచి పేరుగడించాయి.
‘రాడికల్ హ్యూమనిస్టు’ తెలుగు పత్రికకు కోగంటి సుబ్రహ్మణ్యం సంపాదకుడిగా వుండేవారు. హ్యూమనిజం భావాలను వ్యాప్తి చేయడంలో అతడు బాగా శ్రమించారు.
రావిపూడి వెంకటాద్రి 1946లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేశారు. అప్పుడు జాతీయ వాదుల నుండి కమ్యూనిస్టుల నుండి వ్యతిరేకత ఎదురైనా పల్లెల్లో రాయ్ భావాలను వ్యాప్తి చేయడానికి అదొక గొప్ప అవకాశాన్ని కలిగించింది. జ్యోతిషం, జీవనానికి మూలం, గతితర్కం వంటి రాయ్ భావాలను ప్రచారం చేయడంలో అందరికంటే ముందున్న రచయిత అతడు. అతడు ఎం.ఎన్.రాయ్ భావాలపై గొప్ప గ్రంథాలను రచించి కమ్యూనిస్టుల బండారాన్ని బయటపెట్టారు. అతడు తన ఉపన్యాసాల ద్వారా, అధ్యయన తరగతుల ద్వారా, ‘హేతువాది’ పత్రికకు సంపాదకత్వం వహించడం ద్వారా హేతువాద ఉద్యమాన్ని కాపాడారు. మార్క్సు గతితర్కాన్ని తీవ్రంగా విమర్శించి, హ్యూమనిజం గొప్పతనాన్ని చాటిన మొదటి హ్యూమనిస్టు వెంకటాద్రి. జ్యోతిష్యంలని బండారాన్ని సులభశైలిలో బయటపెట్టి, అంతరిక్ష శాస్త్రాధిక్యతను సమర్థించారు. ‘జీవమంటే ఏమిటి’ అనే తన గ్రంథం ద్వారా జీవుల పుట్టుకను, పెరుగుదలను శాస్త్రీయంగా వివరించి, మత నమ్మకాలలోని డొల్లతనాన్ని బయటపెట్టారు. ఎం.ఎన్.రాయ్ పట్ల కమ్యూనిస్టులు చేసిన తప్పుడు విమర్శలను ‘ఎం.ఎన్.రాయ్ భారత కమ్యూనిజం’ అనే తన ఉద్గ్రంథం ద్వారా తిప్పి కొట్టారు. వెంకటాద్రి ‘హేతువాది’ మాసపత్రికను నడపడానికి, మత విమర్శకు, మత నమ్మకాలకు, పద్ధతులను, కల్పితాలను విమర్శించడానికి అంకితమయ్యారు.
90వ పడిలో కూడా రావిపూడి వెంకటాద్రి హేతువాది పత్రికను చూస్తూ, రచనలు సాగిస్తూ తన లోగడ రచనలను సంపుటాలుగా వెలువరిస్తున్నారు. ఎమ్.ఎన్.రాయ్ జీవిత చరిత్రలో కమ్యూనిస్టుల పాత్రను విశ్లేషించి రాశారు.
డెహ్రాడూన్ లో జరిగిన అఖిల భారత రాడికల్ హ్యూమనిస్ట్ అధ్యయన తరగతుల్లో ముందుతరం విద్యార్థిగా పాల్గొన్నవారిలో ఎన్.వి.బ్రహ్మం ఒకరు. తెలుగులో బ్రహ్మం రాసిన ‘బైబిలు బండారం’ నిషేధానికి గురైంది. తరువాత సుప్రీంకోర్టు ఆ నిషేధాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అతడు తాను నడిపిన ట్యుటోరియల్ సంస్థ ద్వారా మానవవాద భావాలను ప్రచారం చేశారు.
గుంటూరులో ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో పనిచేసే ఎలవర్తి రోశయ్య ఎం.ఎన్.రాయ్ భావాలను తన విద్యార్థుల ద్వారా ప్రచారం చేసిన వారిలో ఆద్యుడు. అతని విద్యార్థులలో చాలామంది రాయిస్టులుగా తయారయ్యారు.
తెలుగులో మంచి వక్తగా ఉన్న గుత్తికొండ నరహరి రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి ఆంధ్రలో కార్యదర్శిగా పనిచేశారు. మంచి ఉపన్యాసాలు చేసే నరహరిపై కమ్యూనిస్టులు తీవ్ర విమర్శలు చేసేవారు. తన వాగ్ధాటితో వారి విమర్శలకు తగిన జవాబు చెప్పేవారు.
ఆంధ్రలో రాడికల్ హ్యూమనిస్టు భావజాలన్ని ప్రచారం చేసిన వారిలో ఎం.వి.రామమూర్తి చెప్పుకోదగినవారు. అతడు అఖిల భారత రాడికల్ డెమోక్రటిక్ సంఘానికి అధ్యక్షుడిగా వున్నాడు.తన భార్య మల్లాది సుబ్బమ్మతో కలిసి హ్యూమనిస్టు ఉద్యమానికి అంకితమై పనిచేశారు. అతడు వ్యాసాలు, పుస్తకాలు, అనువాదాలు రచించి ప్రచురించారు. కోగంటి రాధాకృష్ణమూర్తితో కలిసి ప్రజాస్వామ్య ప్రచురణలు అనే సంస్థను స్థాపించి, రాయ్ రచనలను తెలుగులోకి తీసుకొచ్చారు. రామమూర్తి ‘వికాసం’ మాసపత్రికను ప్రారంభించి కొన్ని సంవత్సరాలు దానికి సంపాదకుడిగా పనిచేశారు. అతడు భారతదేశమంతటా పర్యటించి మానవవాదులతో పరిచయాలు పెట్టుకున్నారు. 1940 నుండి జీవితాంతం వరకు రామమూర్తి హ్యూమనిస్టు ఉద్యమ వ్యాప్తికై కృషి చేశారు.
రాయ్ పేర్కొన్న విధంగా బచ్చు వెంకటేశ్వర్లు అనే యువకుడు రినైజాన్స్ క్లబ్ ను ఏర్పాటు చేసి యువకులను విశేషంగా ఆకర్షించారు. చీరాల పట్టణం నుండి దాన్ని నడుపుతూ పిన్న వయసులోనే అర్థాంతరంగా ప్రమాదంలో మరణించాడు.
ఉద్యమ ఆర్థిక సంక్షోభంలో వున్న సమయంలో కొల్లి శివరామిరెడ్డి అనే న్యాయవాది కెఠెవరం గ్రామం నుండి ‘సమీక్ష’ పత్రికకు సంపాదకుడిగా వుండి నడిపాడు. ఇతనికి తెనాలిలో ఉపాధ్యాయుడిగా వున్న ఎం.వి.రమణయ్య సహాయపడ్డాడు. తెనాలిలో ఉపాధ్యాయుడిగా వున్న పరశురాం మానవవాద భావాలు అట్టడుగు వర్గాల ప్రజలలో వ్యాపింపచేయడానికి సాహితీ ప్రక్రియను ఎన్నుకున్నాడు. గూడవల్లిలో మంచి ఉపన్యాసకుడిగా, రచయితగా వున్న మేకా చక్రపాణి స్థానికంగా హ్యూమనిస్టు భావాలను ప్రచారం చేశాడు. ఎం.నారాయణ, తెలంగాణా ప్రాంతంలో పల్లెపల్లెల్లో పర్యటించి ఎం.ఎన్.రాయ్ ప్రతిపాదించిన అధికార వికేంద్రీకరణ, ప్రజలకే అధికారం అనే భావాలకు విస్తృత ప్రచారం కల్పించాడు. రాయ్ రచనలను ఆ ప్రాంత ప్రజల్లోకి తీసుకెళ్ళిన నారాయణ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి మరణించారు.
మద్రాసులోని బ్రిటిష్ కౌన్సిల్ లో పనిచేసిన వి.ఎస్.అవధాని ఆధ్యయన తరగతుల్లో పాల్గొని ఎం.ఎన్.రాయ్ ని వ్యతిరేకించి, ఆ వార్తలను దిన పత్రికలలో రాకుండా అడ్డుపడ్డారు. తరువాత రాయ్ రచనలు చదివిన నార్ల పూర్తిగా మారిపోయాడు. రాయ్ గురించి, హ్యూమనిజం గురించి అనేక రచనలు చేసి ప్రచురించాడు. తన రచనలలో కొన్నింటిని వి.ఎం. తార్కుండే, ప్రేమనాథ్ బజాజ్, నిరంజన్ ధర్, సుశీల్ ముఖర్జీలకు అంకితమిచ్చాడు. శిబ్ నారాయణ్ రే, ఎ.బి.షా. తార్కుండే గార్లకు సన్నిహితుడయ్యాడు.
చీరాల నుండి అంచా బాపారావు హ్యూమనిస్టు పత్రికలకు సంపాదకత్వం వహించాడు. సంక్షోభ సమయంలో ఉద్యమానికి తోడ్పడ్డాడు. చీరాలలోని అతడి వివేక విద్యాలయం చాలా కాలం మానవవాద కార్యకలాపాలకు కేంద్రంగా వుండేది.
ఉద్యమం క్లిష్టపరిస్థితుల్లో వున్నప్పుడు ఆదుకోడానికి ఎం.బసవపున్నారావు చాలా కష్టపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లో నేను ఛైర్మన్ గా వుండి హేతువాద, నాస్తిక వాద సంఘాల సమాఖ్య (ఫెరా) ఏర్పరచడం జరిగింది. అనేక మానవవాద కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాము.
ప్రేమానంద్ ను ఆహ్వానించి, యువకుల కోసం మ్యాజిక్ తరగతులు నిర్వహించారు. ప్రేమానంద్ దొంగ గురువుల, బాబాల, అమ్మల బండారాన్ని బయట పెట్టాడు.
తెనాలిలో గురజాల సీతారామయ్య నిరంతరం ఉద్యమానికి ఆర్థిక సహాయాన్ని అందజేసి బాగా ఆదుకున్నాడు. అతని ఎం.ఎన్.రాయ్ భవన్, నవీన లాడ్ది అనేక సభలు, సెమినార్లు, అధ్యయన తరగతులు నిర్వహించుకోడానికి బాగా తోడ్పడ్డాయి.
సి.ఎల్.ఎన్. గాంధీ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమానికి సహాయపడుతున్నారు. ఎస్.ఎ. బక్షి మతాంతర సెక్యులర్ వివాహం చేసుకొని ఉద్యమంలో ఆదర్శంగా నిలిచారు. ఆయన భార్య విజయలక్ష్మి రచయిత్రి, హేతువాద ప్రచారం రచనల ద్వారా చేస్తున్నారు. అనేక అధ్యయన శిబిరాలు సభలు సమావేశాలు జరిపి మానవవాదానికి తోడ్పడ్డారు. పత్రికలలో రచనల ద్వారా, పాఠశాల పెట్టి శాస్త్రీయంగా పాఠాలు చెప్పటం ద్వారా మానవవాదాభ్యుదయానికి తోడ్పడ్డారు.
పసల భీమన్న తన మ్యాజిక్ ప్రదర్శనల ద్వారా యువతలో శాస్త్రీయ భావాల వ్యాప్తికి కృషి చేస్తున్నాడు. అతడు కొన్ని పుస్తకాలు కూడా రచించాడు. ఉద్యమ వ్యాప్తికి కృషిచేసిన వారిలో క్షేత్ర స్థాయిలో అనేకమంది ఉన్నారు. అటువంటి వారిలో గోరంట్ల రాఘవయ్య ఒకడు.
సి.హెచ్. రాజారెడ్డి తన లిబర్టీ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా, పబ్లికేషన్స్ ద్వారా ఉద్యమానికి పెద్ద అండగా నిలిచాడు. కొంతకాలం సమీక్ష పత్రికకు సంపాదకత్వం వహించాడు.
తోటకూర వెంకటేశ్వర్లు ‘చార్వాక’ మాసపత్రికకు సంపాదకుడిగా వున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పత్రిక వల్ల చాలామంది యువకులు స్ఫూర్తి పొందారు.
నేను ఎం.ఎన్.రాయ్, ఎ.బి.షా, వి.బి.కార్నిక్, శిబ్ నారాయణ్ రే, అగేహానంద భారతి, వి.ఆర్.నార్ల రచనలను తెలుగులోకి అనువదించాము. వాటిని తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయాలు ప్రచురించాయి.
చీరాల పట్టణం నుండి ‘హేతువాది’ అనే మాసపత్రిక రావిపూడి వెంకటాద్రి సంపాదకత్వంలో, మేడూరి సత్యనారాయణ సహయ సహకారాలతో వెలువడుతోంది. ఇంకొల్లు గ్రామంలోని చురుకైన, రాడికల్ భావాలుగల యువకులు మేడూరి సత్యనారాయణ, కుర్రా హనుమంతరావు, కరి హరిబాబు, షేక్ బాబు తమ శక్తిని, కాలన్ని ఉద్యమానికి ధారబోస్తున్నారు. మేడూరి సత్యనారాయణ ఆయన హేతువాద ప్రచారానికి తెలుగు యూనివర్సిటీవారు కవిరాజు బహుమతిని ప్రకటించారు.
రాయ్ బ్రతికున్న రోజుల్లో పెదనందిపాడు గ్రామం నుండి లావు అంకమ్మ మానవవాద ఉద్యమం కోసం కృషి చేసాడు. ఇటీవల ప్రభుత్వోద్యోగం నుండి పదవి విరమణ చేసిన గుమ్మా వీరన్నగారు గత మూడు దశాబ్దాలుగా తన శక్తి సామర్థ్యాలను ఉద్యమానికై వినియోగిస్తున్నాడు. ఆలోచనను రేకెత్తించే అనేక వ్యాసాలను తెలుగు పత్రికలకు రాయడమే గాక మానవాదంపై కొన్ని గ్రంథాలను రచించి ప్రచురించాడు. మానవవాద వ్యాప్తికోసం అతనే కొన్ని పుస్తకాలను తెలుగులోకి అనువదించాడు. వీరన్న చాలా అధ్యయన తరగతుల్లో, సమావేశాలలో పాల్గొన్నాడు. ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అతడు ఇప్పటికీ శాయశక్తులా కృషి చేస్తున్నాడు. వి.ఎం.తార్కుండే గారు ఇంగ్లీషులో రాసిన ‘రాడికల్ హ్యూమనిజం’ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. దాన్ని తెలుగు అకాడమీ వారు ప్రచురించారు. గుమ్మా వీరన్న రాష్ట్ర హేతువాద సంఘాధ్యక్షులుగా రచనలు సాగిస్తూ, అనువాదాలు చేస్తూ, సభలలో పాల్గొంటూ ఉద్యమ వ్యాప్తికి తోడ్పడుతున్నారు.
అమెరికాలోని న్యూయార్క్ లో వుంటున్న ఆరమళ్ళ పూర్ణచంద్ర మానవవాద ఉద్యమానికి, ఇంకొల్లులోని రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ కు నిరంతరం సహాయపడుతూనే వున్నాడు. అతను శాస్త్రీయ గ్రంథాలను, వ్యాసాలను రచించాడు. ఆంధ్రప్రదేశ్ మానవవాద ఉద్యమానికి ఆర్థిక సహాయమేగాక చాలా పుస్తకాల ప్రచురణకు తోడ్పడ్డాడు. అటువంటివారిలో ఇంకా నర్రాకోటయ్య, నార్నె వెంకటసుబ్బయ్య, సి.రంగనాయకులు, రాఘవరావు, పర్వతయ్య ఉన్నారు.
తెనాలి నుండి ప్రఫుల్ల చంద్ర తన ఆలోచనాత్మకమైన రచనల ద్వారా ఉద్యమానికి తోడ్పడ్డారు. హైదరాబాదులో ఉన్న సి.ఎల్.ఎన్. గాంధీ ఉద్యమానికి తన సహాయ సహకారాలను అందిస్తున్నారు.
మల్లాది సుబ్బమ్మ మహిళాభ్యుదయానికై కృషి చేశారు. సెక్యులర్ హ్యూమనిజానికి తోడ్పడ్డారు. ఆమె తన నివాసం నుండే మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. ఆమె ‘స్త్రీ స్వేచ్ఛ’ అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించారు. అది మానవవాద భావాల వ్యాప్తికి తోడ్పడింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆవుల సాంబశివరావు జీవితాంతం మానవవాద ఉద్యమానికి సహాయపడుతూ స్ఫూర్తిగా నిలిచాడు. అతడు మానవవాదంపై అనేక వ్యాసాలు రాశాడు.
విజయవాడ నుండి మండవ శ్రీరామమూర్తి, అవనిగడ్డ నుండి కోనేరు కుటుంబరావు, గోకుల్ చంద్, పోలు సత్యనారాయణ, వై. రాఘవయ్య, బి.ఎ.వి.శర్మ, ఆలూరి భుజంగరావు వివిధ స్థాయిల్లో ఉద్యమాభివృద్ధికై పనిచేశారు.
ఉద్యమ ప్రారంభ దశలో బండారు వందనం పనిచేశారు. అతడు 1946లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశాడు. జంపాల శ్యామసుందరరావు, కొసరాజు సాంబశివరావు, కొసరాజు అమ్మయ్య, వాసిరెడ్డి శివలింగయ్య ఉద్యమంలో పనిచేసిన వారిలో వున్నారు.
తెనాలిలో న్యాయవాద వృత్తిలో వున్న పి.వి.సుబ్బారావు ఉద్యమారంభ దశలో పనిచేయడమే గాక వ్యాసాలు, పుస్తకాలు రాశాడు.
పరమయ్య, చలమయ్య, చుంచు శేషయ్య, జాన నాగేశ్వరరావు, కొల్లా సుబ్బరావు ఉద్యమం కోసం కృషి చేశారు. కొల్లా సుబ్బారావు, రాయ్ భావాలను ప్రచురించడమే గాక సహకార ఆర్థిక విధానం గురించి రాశాడు. రెండు పుస్తకాలను కూడా తెలుగులోకి అనువదించాడు. గురువులు, పి.యస్.రాజు, సత్యనారాయణ రాజు ఉద్యమం కోసం కృషిచేశారు.
జాస్తి రామస్వామి, జాస్తి జవహర్ లాల్ వివిధ స్థాయిల్లో ఉద్యమానికి తోడ్పడడమే గాక సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఎం.వి.శాస్త్రి పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికయ్యాడు.
ఎ.బి.షా. సెక్యులర్ సొసైటీని స్థాపించి తరచుగా రాష్ట్రాన్ని సందర్శించి రాష్ట్ర శాఖను ఏర్పాటు చేశాడు. సాంస్కృతిక స్వేచ్ఛ కోసం పనిచేశాడు. ఎ.బి.షా. రచించిన ‘సైంటిఫిక్ మెథడ్’ గ్రంథాన్ని నేను శాస్త్రీయ పద్ధతిగా తెలుగు అనువాదం చేశాను. అది మూడు ముద్రణలు పొందింది. 1970 దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తత్వ శాస్త్ర విభాగం వారు ఎం.ఎన్.రాయ్ రాజకీయ తత్వాన్ని ఎం.ఎ. సిలబస్ లో పెట్టారు. రాజకీయ శాస్త్ర విభాగం వారు ఎం.ఎన్.రాయ్ రాజకీయ తత్వాన్ని ఎం.ఎ. సిలబస్ లో పెట్టారు. రాజకీయ శాస్త్ర విభాగం వారు ఎం.ఎన్.రాయ్ రాజకీయ తత్వాన్ని ఎం.ఎ. విద్యార్థులకు బోధించారు.
ఎ.బి.షా. ఆంధ్రప్రదేశ్ లో సెక్యులర్ సొసైటీ శాఖను నెలకొల్పి దాని బాధ్యతను నాకు అప్పగించారు. ఆంధ్రలో మేథోపరమైన చర్చలు, సెమినార్లు చాలా జరిగాయి. ఆ సెమినార్లలో విశ్వవిద్యాలయ మేధావులే కాక హిందూ, ముస్లిం, క్రైస్తవ సంఘాలవారు కూడా పాల్గొన్నారు.
సెక్యులర్ భావాల వ్యాప్తికి ప్రొ.బి.ఎ.వి.శర్మ, వి.కె.సిన్హా ప్రొ.ఆలం కుందుమిరి, ప్రొ.కె.శేషాద్రి కృషి చేశారు. షా రచనలలో చాలా వాటిని నేను తెలుగులోకి అనువదించాను.
మత ఫండమెటలిస్టులు ఎ.బి.షా సెక్యులరిస్టులపై దాడి జరిపారు. అయినా వారు ఆ దాడిని ఎదుర్కొని నిలబడ్డారు. వి.ఎస్.అవధాని సెక్యులరిస్టు, హ్యూమనిస్టు క్యాంపుల్లో పాల్గొన్నారు. న్యాయమూర్తులు పింగళి జగన్మోహనరెడ్డి, ఎ.గంగాధరరావు, జీవన్ రెడ్డి, చిన్నప్పరెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని సెక్యులరిస్టు, హ్యూమనిస్టు అధ్యయన తరగతుల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. 1982లో ఎ.బి.షా మరిణించాక సెక్యులర్ వాద ఉద్యమం వెనకడుగేసింది.
పంచాయతీ రాజ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికై వి.బి.కర్నిక్ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమంతో నిరంతర పరిచయాన్ని కలిగివున్నాడు. కార్నిక్ ఎం.ఎన్.రాయ్ జీవిత చరిత్ర నేను తెలుగులోకి అనువదించగా తెలుగు అకాడమీ వాటిని ప్రచురించింది.
డా.జి.ఆర్.డాల్వి స్ఫూర్తిదాయకమైన ఆర్థికవేత్త. ఆంధ్రరాడికల్సి తో అతడు పరిచయాలను బాగా పెంచుకున్నాడు. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పనిచేశాడు. ఆ సమయంలో ప్రముఖ రాడికల్స్ గా వున్న వి.బి.కర్నిక, ఎ.బి.షా, నిస్సిమ్ ఎజికల్ లను హైదరాబాద్ కు ఆహ్వానించాడు. వారు వచ్చి అనేక ఉపన్యాసాలిస్తూ రాష్ట్రమంతటా పర్యటించారు. అదే విధంగా జె.బి.హెచ్. వాడియా, లక్ష్మన్ శాస్త్రి జోషి కూడా రాష్ట్రాన్ని సందర్శించారు. ప్రేమనాథ్ బజాజ్ కూడా హైదరాబాద్ తో నిరంతరం సత్సంబంధాలు కొనసాగించారు. ఇందుమతి రాడికల్ హ్యూమనిస్టు సంఘానికి అధ్యక్షురాలిగా వున్నపుడు ప్రొ.జయంతి పటేల్ రాష్ట్రంలో పర్యటించారు.
రాడికల్ హ్యూమనిస్టు సంఘానికి అధ్యక్షురాలుగా ఇందుమతి పరేఖ్ రాష్ట్రంతో సంబంధాలను కొనసాగించింది. భారత మహిళా సంఘానికి ఛైర్మన్ హోదాలో మణిబెన్ కారా రాష్ట్రాన్ని సందర్శించింది.
రాష్ట్రంలో ఆవుల గోపాలకృష్ణమూర్తి మానవవాద జ్యోతిని చేపట్టి ఉద్యమాన్ని కాపాడడానికి విశేష కృషి చేశాడు. 1967లో ఆయన ఆకస్మిక మరణంతో ఉద్యమానికి చాలా నష్టం వాటిల్లింది. అపుడు ఎం.వి.రామమూర్తి బాధ్యతలను స్వీకరించి, ఉద్యమ కార్యకలాపాలను నిర్వహించాడు. తరువాత రావిపూడి వెంకటాద్రి హేతువాద ఉద్యమాన్ని, హేతువాది పత్రికను కొనసాగించారు.
డా. పావులూరి కృష్ణ చౌదరి నిడుబ్రోలు - పొన్నూరులో ఎం.బి.బి.యస్. డాక్టర్ గా పేరుపొందారు. ఆయన ఉద్యమంలో విద్యార్థి నాయకుడుగా రాడికల్ స్టూడెంట్ అనే పత్రిక నిర్వహించారు. మానవవాద ఉద్యమంలో ఒక దశాబ్దం పాటు చురుకైన పాత్ర నిర్వహించారు.
రాడికల్ హ్యూమనిస్టు రచయితలు సృష్టించిన సాహిత్యంతో, అనువాదాలతో, పత్రికలతో తెలుగునాడు సంపన్నంగా వుంది. 1987లో రాష్ట్రంలో ఎం.ఎన్.రాయ్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి.
పి. సుబ్బరాజు (పి.ఎస్.ఆర్.) పాలకొల్లు కేంద్రంగా రక్తదానం, నేత్రదానం ఒక ఉద్యమంగా సాగించి మానవవాద భావవ్యాప్తికి తోడ్పడ్డారు. రాష్ట్ర హేతువాద సంఘాధ్యక్షుడుగా మానవవాద సంఘ ప్రముఖుడుగా అనేక రచనలు చేసి మత భావాలను విమర్శించి సిద్ధాంత వ్యాప్తికి తోడ్పడ్డారు. పురోహితుడు, మంత్రాలు లేని వివాహాలు జరిపించి మత మూలగ్రంథాలలోని లోపాలను బయటపెట్టారు. పి. సుబ్బరాజు, వెంకటాద్రితో కలిసి `ఆంధ్రప్రదేశ్ మానవవాద, హేతువాద చరిత్ర` రాయగా దానిని తెలుగు అకాడమీ వారు ప్రచురించారు.
ఎం.ఎన్.రాయ్ శత జయంతి సంవత్సరంలో అగేహానంద భారతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోను రాయ్ పై ఉపన్యాసాలిచ్చారు.
చీరాల పట్టణ సమీపంలో వున్న ఇంకొల్లు గ్రామంలో రాడికల్ హ్యూమనిస్టు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన స్థలాన్ని హ్యూమనిస్ట్ మిత్రుడు రావి సుబ్బారావు ఇచ్చారు. అక్కడ వార్షిక సమావేశాలు, ఇతర సభలు జరుపులూ సాహిత్యాన్ని ప్రచురిస్తూ కొద్దిమంది నిబద్ధత కలిగిన హ్యూమనిస్టులు సెంటర్ కోసం పనిచేస్తున్నాయి.
రాష్ట్రంలో మానవవాద ఉద్యమానికి తోడ్పడుతూ సన్నిహితంగా ఉన్నవారు ఆలూరి బైరాగి, డి.వి.నరసరాజు, రావెల సోమయ్య, రావెల అరుణ, సూర్యదేవర హనుమంతరావు, మండవ శ్రీరామమూర్తి, నార్నే వెంకట సుబ్బయ్య, కె.ఎస్. చలం, ఉన్నారు. నాస్తిక కేంద్రం నుండి గోరా, విజయం, లవణం, వికాస్; మానవ వికాస సంఘం నుండి బి. సాంబశివరావు ఆయన నడుపుతున్న `స్వేచ్ఛాలోచన` పత్రిక, విశాఖపట్టణం నుండి ఈశ్వర్, మొదలగువారున్నారు.
నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment