Govind Choudary, producer Doordarshan, Hyderabad
Posted by
innaiah
on Thursday, December 14, 2017
దూరదర్శన్ ప్రథమ ప్రొడ్యూసర్ గా కీ. శే. గోవిందు చౌదరి గారి కృషి
నరిసెట్టి ఇన్నయ్యగారి మాటలలో
దూరదర్శన్ కేంద్రం కొత్తగా హైదరాబాదులో ప్రారంభించినప్పుడు రాజభవన్ రోడ్డులో పాత భవనాలలో వుండేది. అందులో డ్రామా విభాగానికి ప్రొడ్యూసర్ గా గోవిందు చౌదరి వుండేవాడు. ఆయన యువకులు, ఉత్సాహవంతులు పూనా ఫిలిం ఇన్టిట్యూట్ లో తర్ఫీదు అయి వచ్చినవారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన గోవిందు చౌదరి అక్కడ రాజకీయాలలో ప్రముఖపాత్ర వహిస్తున్న చల్లా సుబ్బరాయుడు, మొదలగు వారితో సన్నిహితంగా వుండేవారు. హైదరాబాదు దూరదర్శన్ లో అనేక కార్యక్రమాలు ప్రసారం చేసి అచిరకాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు తోడుగా మరొక ప్రొడ్యూసర్ పార్వతి వుండేవారు. వీరిరువురూ ఎందరో వ్యక్తులను దూరదర్శన్ ద్వారా పరిచయం చేసి ప్రతిభను వెలికి తీసి చూపారు. గోవిందు వాటి సమకాలీన రాజకీయ వాదులతోనూ, శాసనసభ్యులు, మంత్రులతోనూ పరిచయం గలవాడు కూడా.
గోవిందు చౌదరిగారు నాకు అత్యంత సన్నిహితులని తెలిసి తమకు దూరదర్శన్ లో కార్యక్రమం ఏదైనా ఇప్పించమని నన్నపనేని రాజకుమారి, కాట్రగడ్డ ప్రసూన కోరారు. వారితో తొలుత ఒక చర్చా కార్యక్రమం గోవిందు చౌదరి ఏర్పాటు చేశారు. తెలంగాణా నుండి విజయారెడ్డి అనే గృహిణిని కూడా చర్చలో ప్రవేశపెట్టారు. దూరదర్శన్ అప్పుడే ప్రారంభం కావటం, కార్యక్రమాలు రూపొందించటంలో పరిణితి కోసం ప్రయత్నాలు జరిగాయి.
దూరదర్శన్ లో కార్యక్రమాలు ప్రారంభమయే సమయంలోనే చౌదరిగారు మా ఇంటికి వచ్చారు. మా అబ్బాయి రాజును చూసి సినిమాపాటల కార్యక్రమం ఒకటి పెడదామనుకుంటున్నాం దానికి ఏం పేరు పెడితే బాగుంటుందని అడిగారు. వెంటనే తడుముకోకుండా ‘చిత్రహింస’ అని చెప్పాడు. దానికి చౌదరిగారు తలుచుకుని తలుచుకుని నవ్వారు.
డ్రామాలలో, నాటకాలలో అనేకమందిని దూరదర్శన్ ద్వారా వెలికి తెచ్చి గోవిందు కృషి చేసేవారు. ఆ కృషిలో భాగంగా ఆటలు ఆడటానికి, డ్రామాలు వేయటానికి ఉత్సాహం చూపిన వారిని బాగా ముందుకు తీసుకువచ్చారు. పొన్నూరు నుండి ఒక ముస్లిం కుటుంబాన్ని ఆవిధంగా ప్రోత్సహించి వారి పాటలని, కచేరీలను ప్రచారంలోకి తెచ్చారు. అందులో మహిజ అనే అమ్మాయి సినిమాలలో నటించడానికి తర్ఫీదు ఇచ్చారు. గోవిందు చౌదరిగారి జీవితం ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సాగిపోతుండగా కొన్ని అనారోగ్య కారణాలవల్ల హఠాత్తుగా మరణించారు. మంచి ప్రతిభావంతుణ్ని అతి తక్కువ కాలంలో కోల్పోవడం బాధాకరమైన విషయం.
No comments:
Post a Comment