మహాభారతం పెనుభూతం-5 part

Truth about Gita





కైరోవద్ద పిరమిడ్లను పెనుభూతం వంటిదిగా కిప్లింగ్ అభివర్ణించాడు. మహాభారతానికి అదే వర్తించవచ్చు. పిరమిడ్ ఏడు అద్భుతాలలో ఒకటైతే, మహాభారతం 7 అభూత కల్పనలలో ఒకటిని చెప్పవచ్చు. పిరమిడ్ ఎత్తు 451 అడుగులు. మహాభారతం 18 పర్వాలలో, లక్ష శ్లోకాలలో ఉన్నది. ఒకప్పటి పిరమిడ్ పవిత్రత కోల్పోయి యాత్రికుల ఆకర్షణ స్థలంగా మారింది. మహాభారతానికి ఇంకా కొనసాగుతున్న పవిత్రత భారతదేశానికి పెద్ద ఉపద్రవం వంటింది. భారతీయుల జీవితాన్నీ, ఆలోచననూ అణచివేసే భారంగా అది తయారయింది.
మహాభారతం శతాబ్దాలుగా నేటి పెనుభూతస్థాయికి ఎలా చేరుకున్నదో గమనించాలి. వ్యాసుడు 8800 శ్లోకాలు చెప్పి జయ అని నామకరణం చేశాడు. వైశంపాయనుడు 24 వేల శ్లోకాలకు పెంచి భారతం అని పేరు పెట్టాడు. సౌతుడు లక్ష శ్లోకాలు పూర్తి చేసి మహాభారతంగా రూపొందించాడు. మధ్యలో మరెందరో జ్యోకం చేసుకొని యధాశక్తితో కలిపారు.
ఒక రచయిత కృషిలో జోక్యం చేసుకొని, రూపురేఖలో మార్చేసి, ముఖ్య సందేశాన్ని తారుమారు చేయటం హీనమైన నేరం. ప్రాచీన కాలం నుండి ఈ ఆధ్యాత్మిక దేశంలో అది సాగి పోతూనే వున్నది.
మత గ్రంధాలూ, ధర్మసూత్రాలూ రాజకీయ, ఆర్థిక రచనలూ, ఇతిహాసం, పురాణం అన్నీ యిలా మార్చేసారు. ఆ విధంగా చేయటంలో ప్రజాశక్తిని పెంపొందించినట్టూ, స్వర్గంలో స్థానం ఏర్పరచుకొన్నట్టూ భావించారు. అచ్చుయంత్రాలు వచ్చినా ఈ విధానాం ఆగలేదు.
మహాగ్రంధాలూ, ధర్మసూత్రాలూ రాజకీయ, ఆర్థిక రచనలూ, ఇతిహాసం, పురాణం అన్నీ యిలా మార్చేసారు. ఆ విధంగా చేయటంలో ప్రజాశక్తిని పెంపొందించినట్టూ, స్వర్గంలో స్థానం ఏర్పరచుకొన్నట్టూ భావించారు. అచ్చుయంత్రాలు వచ్చినా ఈ విధానం ఆగలేదు.
మహాభారతం, ఒక పెద్ద గేయం, సినిమా, రేడియో, టెలివిజన్, డ్రామాలు లేని రోజుల్లో గేయాలు పాడుకుంటూ కాలక్షేపం చేసేవారు. నాయకులూ, దేవుళ్ళూ కధా వస్తువులుగా ఉండేవి. రాజుల కొలువుల్లో సూతులు ఈ రచనలు చేస్తూ పోయారు. యజ్ఞయాగాదులలో వీరి అవసరం ఉండేవి. సంవత్సరాల తరబడి యజ్ఞాలు సాగుతుండగా విసుగు పుట్టకుండా గేయాలు పాడేవారు. రాజుల తృప్తి కోసం ఆ గేయాలను మారుస్తుండేవారు. మహాభారతం, రామాయణం పురాణాల కథాకాలక్షేపం అలా సాగేది.
తొలుత ప్రాకృతంలో ఉన్నదంతా తరువాత సంస్కృతంలోకి మార్చారు. సూత్రధారుల స్థానంలో బ్రాహ్మణులు వచ్చారు. స్తోత్రపాఠాలలో అర్థాన్నీ, సందేశాన్నీ మార్చివేశారు. భూసురులుగా తమ స్థానాన్ని భద్రపరచుకున్నారు. దేవుళ్ళకు మించి తమకు ఉన్నత స్థాయి ఉన్నట్టు భృగులు తిరగరాసుకున్నారు. (Irawati Karve : Yuganta, Poona, 1966, Page 5). అందులో ఒకరు విష్టువు వక్షస్థలాన్ని తన్నినట్లు, బ్రహ్మ-శివులను అణచి పెట్టినట్లు పేర్కొన్నారు. (Vemuri Sreenivasa Rao, Purvagathalahari, Madras, 1952, Page. 327-328).
జర్మనీలో హెర్మన్ వోల్డెన్ బర్గ్ బుద్ధునిపై నిశిత పరిశీలనా చరిత్ర ప్రచురించారు. మహాభారతం చిన్న ఇతిహాసంగా ప్రారంభమై, భయానకంగా, గందరగోళంగా మారిందని అన్నాడు. వి.ఎస్. సుక్తాంకర్ ఇతడి ప్రస్తావన చేశాడు.
మహాభారతాన్ని క్రమబద్ధంగా విశ్లేషించిన వాడు హాప్ కిన్స్. ఇతడు ఇలా అన్నాడు. ఈ ఇతిహాసం మనకెలా చేరింది. ప్రతి అధ్యాయమూ మార్పులకు గురై విస్తరించిన ప్రక్షిప్తాలు చోటు చేసుకొని, హద్దూ పద్దూ లేకుండా ప్రతి లేఖ కూడా సొంత రచనలను ప్రవేశపెట్టి కలగా పులగం చేశాడు. (V.W. Hopkins : The Great Epic of India, 1969, Calcutta, Page: 400). విన్ సెంట్ స్మిత్ ప్రకారం నేటి లక్ష శ్లోకాలలో 20 వేలు మాత్రమే కురుపాండుల సంఘర్షణకు సంబంధించినవి. మిగిలినదంతా కలిపారు. (Vincent Smith, Oxford History of India).
మహాభారతంలోని మూల అంశం ఎప్పుడు రచించారు. విస్తరణ ఎప్పుడు, ఎలా జరిగింది. ఎప్పుడు ఆగింది. ఈ మార్పులన్నింటికీ కారణం ఏమిటి.?
భిన్న పండితులు విభిన్న అభిప్రాయాలు వెల్లడించారు. పాణిని కాలంలో మహాభారతం సంస్కృత ఇతిహాసంగా లేదు. మహాభారతం అనే పదాన్ని పాణిని తన వ్యాకరణంలో విశేషంగా వాడాడు. వాసుదేవుడిని, అర్జునుడిని దేవుళ్ళుగా ప్రస్తావించారు. యుధిష్టిరుని మాట గూడా ఉన్నది. (Max muller, A History of Sanskrit Literature) అంటే కృష్ణుడితో పాటు అర్జునుడిని గూడా దేవుడుగా కొలిచారు.
పాణిని వ్యాకరణంలో కుంతి, మాద్రీ ప్రస్తావన పాండురాజు భార్యలుగా కాదు. కుంతుల ప్రాంతం నుండి కుంతి, మద్ర ప్రాంతం నుండి మాద్రి వచ్చినట్లున్నది. (Radhakummud Mukherjee, Hindu Civilization, 1950 Bombay, Page : 141) భారతం మహాభారతం అనే ప్రస్తావన తొలుత అశ్వలాయన గృహ్యసూత్రాలలో ఉన్నది. ఇది కూడా మధ్యలో ప్రవేశపెట్టిందేనని వెబర్ అన్నాడు. (Albrecht Weber : The History of Indian Literature, 1914, Page : 189) ఏమైనా యీ సూత్రం ఎప్పుడు వచ్చిందన్నది కూడా నిర్ధారణ కాలేదు.
పాణినికి ముందు సంస్కృత ఇతిహాసంగా మహాభారతం లేదు. ఈ వ్యాకరణ శాస్ర్తజ్ఞుడు ఎప్పటి వాడో సరైన కాలనిర్ణయం లేదు. (V. Rangacharya, Video India 1937, Madras Page : 69, 70) క్రీ.పూ. ఐదవ శతాబ్దంలో ఉండవచ్చునని భావిస్తున్నారు. మహాభారతం పాణిని అనంతరం క్రీ.పూ. 4-3 శతాబ్దాల మధ్య వచ్చి ఉండవచ్చునని రాప్ సన్, బార్నెట్, హాప్ కిన్స్, మెగ్డోనెల్, వింటర్నిజ్డ్ పండితులు భావిస్తున్నారు. వెబర్, వైద్యా అభిప్రాయం ద్వారా చెప్పించారన్నారు. అశ్వమేధపర్వంలో క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందగా, రాధాకుముద్ ముఖర్జీ క్రీ.పూ. 2వ శతాబ్దానికి తెచ్చారు.
మహాభారతం నేటి అవతారం దాల్చింది క్రీ.త. 4,5 శతాబ్దాలలోనే మార్పులూ, చేర్పులూ అన్నీ 4వ శతాబ్దం వరకూ జరుగుతూ వచ్చాయి. కలియుగంలో మనిషి పతనం ఆరంభం అయిందన్నారు. మహాభారతాన్ని అతి గౌరవంగా చూచే వి.యస్. సుక్తాంకర్ క్రీ.త. వెయ్యివరకూ అనేక చేర్పులు చేశారంటూ ఒప్పేసుకున్నారు. బండార్కర్ ప్రాచీన పరిశోధనా సంస్థవారు ప్రచురించిన మహాభారతంలో చాలా చేర్పులు జరిగాయన్నారు. విష్ణు అవతారవర్ణన, భీష్ముడి వైష్ణవ ధర్మాల్ని తెచ్చి పెట్టారన్నారు. ఇవి 2500 శ్లోకాల వరకూ ఉన్నాయి. ఇటీవలే యిలా జరిగినప్పుడు పూర్వకాలం యింకా ఎన్ని జరిగి ఉంటాయో ఊహించాల్సిందే. (V.S. Suktankar : On the Meaning of Mahabharata, Bombay 1957, Page : 22).
అంధ విశ్వాసంతో సనాతనులు ఈ విధంగా యిష్టం వచ్చినట్లు మలుచుకుంటూ పోయారు. వ్యాస మహాభారతంలో లక్ష శ్లోకాలున్నట్లు 5వ శతాబ్దంలో ఒక శాసనం పుట్టించారు.
మార్పులేమీ జరగలేదని వాదించారు. ఈ సంఖ్యను అట్టి పెట్టటానికి పాత వాటిని కొన్నిటిని తొలగించటం, కొత్తవాటిని చేర్చటం సునాయసంగా జరిపారు.
వ్యక్తిగత దేవుడనే భావనను పెంపొందించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. గౌతమబుద్ధుడు దేవుడున్నాడనీ, లేడనీ చెప్పలేదు. అతని శిష్యులు బుద్ధుడు చనిపోగానే అతడిని దేవుణ్ణి చేశారు. అతని జీవితాన్ని గురించి కథలు అల్లారు. వేద, బ్రాహ్మణవాదాన్ని దెబ్బ తీసేటంతగా బౌద్ధం పెరిగిపోయింది. ఇందుకు మారుగా క్రీస్తుపూర్వం 3,4 శతాబ్దాలకు మధుర ప్రాంతంలో గోవుల్ని కాచుకునే తెగల నాయకుడిని అడ్డం పెట్టి దేవుణ్ణి చేశారు. ద్రౌపదీ స్వయం వరంలో హఠాత్తుగా మహాభారత కథలోనికి కృష్ణుడు వచ్చేశాడు. అప్పటి నుండీ కృష్ణుడు పెరిగిపోయి దేవుడయ్యాడు. అంతవరకూ కురురాజులకు అనుకూలంగా ఉన్న కథను పాండురాజుల వైపు తిప్పారు. జనమేజయుడి యజ్ఞంలో ఈ మార్పు జరిగినట్లు పిఠాపురానికి చెందిన పెండ్యాల శాస్ర్తి, ప్రాచీన భారతాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్యులు భావించారు. జనమేజయుడు పాండు సంతతి వారు. ఉదారంగా దానాలు చేశారు. అతడికి తృప్తి నిచ్చేటట్లు కథను మార్చారు. ఐనా దోషాలు కనిపిస్తూనే ఉన్నాయి.

సామాజిక అంతస్తులలో పురోహిత వర్గాన్నీ, ఉన్నత స్థాయిలో పెట్టటానికి ప్రయత్నించారు. మహాభారతం బ్రాహ్మణుల విజ్ఞాన సర్వస్వమని రాప్ సన్ పండితుడు సృష్టీకరించాడు. బౌద్ధ కాలాన్ని గురించి రాసిన రైస్ డేవిస్ మహాభారతం పురోహితుల చేతుల్లో మార్పుచెందిందన్నారు. బౌద్దుల వలన దెబ్బతిన్న ప్రతిష్ఠను పునరుద్ధరించడానికి బ్రాహ్మణులు యిలాంటి పనిచేశారు. ప్రజా బాహుళ్యంలో ఉన్న కధల్ని బ్రాహ్మణులు సానుభూతితో స్వీకరిస్తున్నారని చూపడానికి కూడా యిలా చేశారు. వేదసాహిత్యంలో లేనివన్నీ ఇందులో సజీవంగా ప్రవేశపెట్టారు. ఆర్యులకు సంబంధించిన ఈ అంశాలు మహాభారతంలో చోటు చేసుకున్నాయి. (Rhys Davis : Buddhist India) ఏమైనా అమానుషంగా ప్రక్షిప్తాలు జరిపారు. గుప్తులకు ముందు మాహాభారతాన్ని తిరగరాయటం గమనిస్తే ఆటవిక ఆచారమైన సతీ సహగమనం కూడా తిరగదోడారని కోశాంబి అన్నారు. (An Introduction to the study of Indian History), బ్రిటిష్ వారు శాసన బద్ధంగా నిషేధించిన సతి 150 సం.రాల తరువాత తిరిగి ప్రవేశించింది. అలాగే భారతీయుల జీవితాన్ని ప్రభావితం చేయటంలో మహాభారతం పుస్తకాలను మించిపోయిందని సర్ పెర్సివల్ గ్రీవిత్స్ అన్నారు. పాండురాజు భార్యల మధ్య ఎవరు సతీసహగమనం చేయాలనే అంశంపై వివాదాన్ని మహాభారతంలో ప్రవేశపెట్టారు. దీన్ని తిరగరాసినప్పుడు తిరోగమన ప్రభావం ఘోరంగా పరిణమించింది. కులధర్మంగా చంపేయమని భగవద్గీత బోధించింది కూడా మహాభారతంలో తెచ్చిపెట్టారు.
V R Narla Telugu : Innaiah Narisetti

భ్రమల భయం--గీత రూపొందిన తీరూ






అధ్యాయం నాలుగు

పురావస్తు శాస్రం మాట్లాడదు. కాని సత్యాన్ని బయట పెడుతుంది. సాహిత్యానికి అలంకరణలు చేసే స్వభావం ఉన్నది. అందులో గాధలూ, ఇతిహాసాలలో ఉపమానాలూ, అలంకారాలూ, గజి బిజిగా అల్లుకొని ఉంటాయి. కనుక ప్రాచీన చరిత్రల గురించి రాసేటప్పుడు సాహిత్యంలో సాక్ష్యాధారాలను అతి జాగ్రత్తగా స్వీకరించాలి. ఇతర ఆధారాలతో ముఖ్యంగా పురావస్తు శాస్రంతో సరితూగుతున్నదో లేదో గమనించి చేపట్టాలి.
సుమేరియా చరిత్రకారులు ఇలాంటి జాగ్రత్త వహించారు. అలాగే ప్రాచీన దేశాలైన బాబిలోనియా, అస్సీరియా, ఈజిప్ట్, ఫినీషియా, క్రీట్, మీడియా, ఫైరియా, లిడియా, కార్తేజ్, గ్రీస్, రోమ్, పర్ష్యా, చైనాకు సంబంధించిన చరిత్రకారులు తగు జాగ్రత్త వహించారు. కాని, ప్రాచీన భారతావనికి సంబంధించిన చరిత్రకారులు తగు జాగ్రత్త తీసుకోలేదు. భ్రమలంటే వారు భయపడ్డారా? రెండువేల సంవత్సరాల పాటు పుక్కిటి పురాణాల మధ్య మనం నివశించాం. అదే మనకు ఔషధంగా మారింది. మోతాదు ఎక్కువై భ్రాంతిలో పడ్డాం. ప్రస్తుతాన్ని పక్కకు నెట్టి, గతాన్ని భజన చేస్తున్నాం. అయోధ్య గొప్పతనాన్నీ హస్తినాపురం వెలుగుల్నీ చెప్పుకొంటున్నాం. ఇంద్రప్రస్తలో, మయసభను గురించి పొగుడుకుంటున్నాం.
గతాన్ని తవ్వితీసి ఆర్యులను గురించి తెలుసుకుంటే, వాస్తవాలెన్నో బయటపడతాయి. రాముడూ, కృష్ణుడూ పాలించిన స్వర్గయుగాల భ్రమలు చెదిరిపోతాయి. రామాయణ మహాభారతాలకు చెందిన స్థలాలను తవ్వినప్పుడు అలాంటి సత్యాలు బయటకొస్తున్నాయి. భారతదేశానికి దండయాత్రీకులుగా వచ్చిన ఆర్యుల నాగరికత గురించి పుక్కిటి గాధలు బట్ట బయలు అవుతున్నాయి. దేశంలో ఉన్న ప్రజలు నాగరికులుగా, దాడి చేసిన వారు ఆటవికులుగా చరిత్ర చూపుతున్నది. హరప్పా ఉన్నత నాగరికతను ఆర్యులు ధ్వంసం చేశారు.
ఆ తరువాత వెయ్యేళ్ళకు గాని మగధ సామ్రాజ్యం తలెత్తలేదు. హరప్పా, మోహంజోదారో వంటి నగరాలు, కాళీబంగాన్, రంగవూరు వంటి పట్టణాలు, లోతల్ వంటి రేవులు మళ్ళీ రాలేదు. ఆర్యులు మట్టి ఇళ్ళలో ఉంటూ, కుండల్లో వండుకుని, తాగటానికీ, తినటానికీ మట్టి పాత్రలు వాడారు. నగర జీవితానికీ, సౌకర్యాలకూ వారుదూరం. వారి సంస్కృతి పేదది. గ్రామాలలో నివశిస్తూ, ఆవుల్ని పెంచుకున్నారు. ఆవులే వారికి సంపద, ప్రతిష్ఠాకరమైన విలువిచ్చాయి. సోమరసం ఆరగించేవారు. ఆర్యుల సంస్కృతి అల్పస్థాయిలోనే వుండేది. మెసపొటోమియాలో అమురుల వలె ఆర్యులకు కూడా నగరం అంటే తెలియదని, స్టూవర్డ్ పిగాట్ రాశాడు. (Pre Historic India, by Piggort Stauart 1962, Page : 265) సర్ మార్టిమర్ వీలర్ గొప్ప పురావస్తు శాస్ర్తజ్ఞుడు. ఆర్య సంస్కృతి గుర్తించదగినంత గొప్ప సంఘటనగా విడదీసి చూపటానికి ఆధారాలేవీ కనిపించటం లేదని రాశాడు. (Mortimer Wheeler : Civilization of the Indus Vallery, London 1966, Page : 97).
రామ, కృష్ణ భక్తులు ఈ విదేశీ శాస్త్రజ్ఞుల రచనలను పరిశీలించి వారు తప్పు అని రుజువు చేయగలిగితే బాగుండును. రామాయణ, మహాభారతాలకు సంబంధించిన స్థలాలను తవ్వి అలా చేస్తే సంతోషించవచ్చు. కాని, చెదురుమదురుగా లభించిన పూసలూ, రంగులు వేసిన కుండలూ, 12 గదులతో కూడిన మట్టియిళ్ళూ చూపి అదే గొప్ప సంస్కృతిగా ఆకాశానికి ఏత్తే ప్రయత్నాలు చేస్తున్నారు. మగధ సామ్రాజ్యం తలెత్తే వరకూ ఆర్యుల సంస్కృతి నిస్సందేహంగా అల్పస్థాయిలో కొనసాగింది.
క్రీ.పూ. 8వ శతాబ్దంలో గంగానది వరదల వలన నాగరికతంతా కొట్టుకుపోయినట్లు పురాణాల్లో రాసిఉందని చెపుతున్నారు. అప్పుడు కౌరవుల రాజధాని కొశాంబీకి మారిందట. హస్తినాపురం వద్ద తవ్వకాలలో యిది బయటపడిందటున్నారు. హస్తినాపురాన్ని పురాణాల ప్రకారం అస్తినుడు స్థాపించాడు. దుష్యంతుడికీ, అతడి కుమారుడు భరతుడికీ హస్తినాపురం రాజధాని అన్నారు. పురాణాల వంశ పారంపర్య జాబితాలో దుష్యంతుడి తరువాత 5వ వారసుడుగా హస్తినుడు వచ్చాడు. అతడు స్థాపించిన రాజధాని ముత్తాతల రాజధాని ఎలా అవుతుంది. పురాణాలన్నీ యిలాంటి అసంగతాలతోనే ఉన్నాయి. (Amar Chand : Hastinapura, 1952, Banares, Page : 7, 8).
భారీ కట్టడాల అవశేషాలు భౌతిక సంస్కృతికి చిహ్నాలు. అలాంటివి హస్తినాపురంలో లేవు. ఎ. ఘోష్ ఇలా హెచ్చరించాడు. మహాభారతగాధల గురించి పురావస్తు శాఖ త్రవ్వకాల ద్వారా సాక్ష్యాధారాలు అందించినట్లు చెపుతారు. అలాంటి నిర్ణయాలకు రావటం తొందరపాటవుతుంది. కౌరవుల రాజధాని హస్తినాపురం భారీ వరదల వలన కొట్టుకుపోయిందని కధలు అల్లారు. ఇతిహాసాల సంప్రదాయాలను సమర్ధించుకోటానికి పురావస్తుశాఖ పరిశోనలను అడ్డంపెట్టుకోవాలి. (A. Ghosh : Ancient India, No.11.12 New Delhi, 1954-55, Page:3).
మన ప్రాచీన గ్రంధాలు ఎంత పెద్దగా ఉంటే వాటి భాష్యాలు, వాటి చరిత్ర కాలక్రమం, భూగోళం అంత చిలవలు పలవలుగా ఉంటుంది. మన సనాతనులు గుడ్డిగా వాటిని అనుసరిస్తారు.
ప్రాచీన భారత చరిత్రలో మహాభారత యుద్ధం ప్రథమ అధికారిక సంఘటనగా సి.వి. వైద్య పేర్కొన్నారు. దీనిని ఎవరూ సందేహించటం లేదన్నారు. (C.V. Vaidya : The Mahabharata War, Bombay, 1929, Page:55). ఆ సంఘటన మాత్రమే కాదు, అది జరిగిన తేదీలు సహితం ప్రశ్నార్ధకంగానే మిగిలాయి. చరిత్రకారుడు విన్ సెంట్ స్మిత్ రాస్తూ మౌర్య సామ్రాజ్యం తలెత్తటంతో చరిత్రకారుడు ఆంధకారంలోంచి వెలుగులోకి వచ్చినట్లయింది. తేదీలు నిర్దుష్టంగా తెలిసాయి. (Vincent Smith : The oxford History of India, 1958, Page:95).
సనాతనులకు అలాంటివి మింగుడు పడవు. సూర్యవంశం నుండి దిగివచ్చిన క్షత్రియులు కేవలం ఆర్యవంశంలో ప్రాచీన భారత దేశంతో పాటు యావత్తు ప్రపంచాన్నీ పరిపాలించారన్న వారే షట్ చక్రవర్తులు. చంద్రగుప్త మౌర్యులతో ప్రారంభించటం విన్ సెంట్ స్మిత్ వంటి యూరోపియన్ల కుట్రమాత్రమే అన్నారు. అలెగ్జాంటర్ తో సమకాలీనులైన చంద్రగుప్తుడు మౌర్యవంశానికి చెందడనీ, అతడు గుప్తవంశంవాడనీ అన్నారు. క్రీ.పూ. 4 వేల సంవత్సరాల క్రితం గుప్త సామ్రాజ్యం ఉన్నదన్నారు. దీనికి పంచాంగాలూ, పురాణాలూ ఆధారాలన్నారు. ద్వాపర, కలియుగాల మధ్య క్రీ.పూ. 3102లో మహాభారత యుద్ధం జరిగిందన్నారు. దీనివలన ఒక వెయ్యి సంవత్సరాలు అశోకుడిని వెనుక్కు నెట్టినట్లయిందని ఎ.ఎ. మెగ్డానెల్ అన్నాడు. (A.A. Macdonell : India’s Part, 1956, Varanasi).
1966లో విలర్డ్ ఎఫ్. లిబి అనే రసాయన శాస్రజ్ఞుడికి కార్బన్-14 డేటింగ్ కనుగొన్నందుకు నోబుల్ బహుమానం వచ్చింది. గతాన్ని తెలుసుకోడానికి ఇతని ప్రక్రియ చాలా వరకు ఉపయోగపడుతున్నది. 40 వేల సం.రాల వరకు కనుగొనే అవకాశం లభించింది. (Libbi Willard F.H. : The Frontiers of Knownedge, Newyork 1975). ఈ విధానంలో దోషాలు కూడా అనల్పంగానే ఉన్నాయి. అది అంగీకరిస్తే ప్రాచీన భారత చరిత్ర తెలుసుకోటానికి పంచాంగాలూ, పురాణాలూ పక్కన పెట్టాల్సిందే. చరిత్ర కారుల ముసుగులో వైద్య వంటి వారెందరో పక్కిటి గాధల్ని చరిత్ర తొడుగుతో చూపారు. అలాంటి వారిని గమనంలోకి తీసుకోరాదు. వారికి ప్రాధాన్యత యిస్తే, చెత్తాచెదారానికి ప్రాముఖ్యత యిచ్చినట్లే.
కార్బన్-14 డేటింగ్ విధానంలో సర్ విలియం జోన్స్ భారత చరిత్ర కాలాన్ని సరిగ్గా చూపాడు. చంద్రగుప్త, అలెగ్జాండర్ సమకాలీనతను నిర్ధారించాడు. అశోకుని శాసనాలు తెలుసుకోటానికి బ్రహ్మీ, ఖరోస్తి లిపి జేమ్స్ ప్రిన్ సెస్ వెలుగులోకి తెచ్చాడు. ప్రాచీన భారత భౌగోళిక విషయాలను ఏర్చికూర్చిన ఖ్యాతి అలెగ్జాండర్ కానింగ్ హాంకు దక్కింది. ప్రిషాల అంటే శూద్ర అనీ, పాపపంకిలుడనీ నిఘంటువులు పేర్కొన్నట్లు ఎందరికి తెలుసు. దేవానాం ప్రియ అనే అశోకుని బిరుదు శాసనాలపై ఉన్నది. దానికి ఉన్మత్తుడు అనే అర్ధాన్ని మన ఇతిహాసాలూ, పురాణాలూ అంటగట్టాయని ఎందరికి తెలుసు.
కురుక్షేత్ర యుద్ధం బహుశ పుక్కిటి పురాణమే కావచ్చు. క్రీ.పూ. వెయ్యి సంవత్సరాలలో ఒకవేళ ఇది జరిగే ఉంటే, కేవలం ఆర్య తెగల మధ్య కలహమే తప్ప యుద్ధం మాత్రం కాదు. వేదసాహిత్యంలో దీని ప్రస్తావన లేదు. ఈ కలహం కూడా కూరు-పాండవుల మధ్య అయి ఉండదు. మహాభారత అధ్యయన పరులు ఇలాంటి భావాలను వెల్లడించారు.
విన్ సెంట్ స్మిత్ మహాభారత యుద్ధాన్ని చారిత్రకేతర కధగా భావించాడు. ఆల్ బ్రెట్ వెబర్ ఆర్య తెగల కలహంగానే భావించాడు. (Albreckt Weber : The History of Indian Literature, London, 1914, Page : 187). రోమిలాధాపర్ దీన్ని కేవలం స్థానిక ముఠాతగాదాకా చెప్పింది. (A History of India, 1968) భాషమ్ దీన్ని యుద్ధంగా పేర్కొన్నప్పటికీ అతిశయోక్తులే చాలా జోడించారు అన్నాడు. కురుక్షేత్ర యుద్ధం కౌరవులకూ, పాంచాలురకూ మధ్య జరిగిందనీ, దీనికి పాండవులను జోడించడంలో బ్రాహ్మణాసక్తి ఉన్నదనీ క్రిస్టియన్ లాసన్ రాశాడు. (Pre Musalman India, Vol.II, Vedic India, Part I, Madras, 1937). మహాభారతాన్ని సొంతంగా పరిశీలించిన పెండ్యాల శాస్త్రి (పిఠాపురం) కూడా అలాంటి అభిప్రాయానికే వచ్చారు.
దీని అంతటినీ బట్టి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన చరిత్ర, తేదీలు, పాల్గోన్నవారూ అన్నీ సందేహాస్పదాలే. అలాగే కృష్ణుడు, గీత కూడా, మన ప్రాచీన భారత చారిత్రక తేదీలను నిర్ధారించే ప్రయత్నం కొందరు సనాతనులు చేస్తూనే అన్నారు. ఎ.డి. పుసల్కర్ పాషండుడూ కాదు. సందేహవాదీ కాదు. అతడు ఇలా అన్నాడు. మహాభారతానికి సంబంధించి గ్రహ నక్షత్రాలను ఆధారంగా తేదీలు నిర్ణయిస్తున్నారు. దీనివలన భిన్న ఫలితాలు వచ్చాయి. పరస్పర విరుద్ధ వాస్తవాలు బయట పడ్డాయి. కనుక అలాంటి వాటిని ఉత్తరోత్తరా ప్రవేశపెట్టినట్లు భావించి నిరాకరించాలి. (A.D Pusalkar : History and Culutre of the Indian People Vol.I. Vedic Age Page : 269).
పుసల్కర్ చేసిన విమర్శల వంటివి భారతదేశానికే పరిమితం కాలేదు. క్రీ.పూ. 4004 మార్చి 23న బైబుల్ ప్రకారం భగవంతుడు ఆడంను సృష్టించినట్లు బిషప్ ఆషర్ ప్రకటించారు. అతని ప్రేరేపణతో గాబోలు, వెలంది గోపాలయ్యర్ కురుక్షేత్ర యుద్ధం క్రీ.పూ. 1194 అక్టోబరు 14న మొదలయిందన్నాడు. కలియుగం క్రీ.పూ. 312 ఫిబ్రవరిలో ఆరంభమయిందనీ, ఆ తరువాత 36 ఏళ్ళకు కురుక్షేత్ర యుద్ధం జరిగిందనీ, మరొక పండితుడు ప్రకటించాడు. (S.B. Roy : Ancient India, 1975). అతడి ప్రకారం క్రీ.పూ. 3227 వరకూ కృష్ణుడు 125 ఏళ్ళు బ్రతికాడన్నాడు. కృష్ణుడు చనిపోయిననాడే కలియుగం మొదలయిందన్నారు. ఆదాయపు పన్ను అధికారిగా రిటైరయి అతడు ఇలాంటి తేదీల నిర్ణయానికి పూనుకున్నారు. ఇండియా అనే భారత దేశం అలాంటివారితో నిండి ఉన్నది. వారికి నమోవాకాలు.

Narla Venkateswararao Telugu: Innaiah Narisetti

గీతా రహస్యం---తేదీల ఒడిదుడుకులు





అధ్యాయం మూడు

కలియుగం అనేది చాలా మోటుభావన. పురావస్తుశాఖ పరిశోధనలకు విరుద్ధమైనది. ఆటవిక, బర్బర, నాగరిక యుగాలు చరిత్రలో సుప్రసిద్ధమైనవి. వీటిలో వివిధ దశలున్నాయి. ఒక దశ కొత్త దశకు స్థానం కల్పిస్తూ మిళితమౌతూ పోతుంది. పక్క పక్కనే వివిధ దశలూ వుండవచ్చు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో క్రమేణ ధర్మం క్షీణిస్తూ, శాంతి సంపదలు కోల్పోతూ ఉంటాయనే భావన ఛాందసమైనది. అయినప్పటికీ కలియుగం ఎప్పుడు ప్రారంభమయిందా అనే చర్చ చేస్తూ ఉంటారు.
కలియుగం నిర్ధారితమైతే కురుక్షేత్ర యుద్ధం తేదీలు చెప్పవచ్చునని సనాతనుల ఉద్దేశం. వీరి అభిప్రాయంలో 3101 క్రీ.పూ. కలియుగం ప్రారంభమైనప్పటి నుండి 5 వేల సం.రాలు గడిచేసరికి క్రీ.త. 1899 వచ్చిందని అన్నారు. దీనితో అంగీకరిస్తున్నట్లు వైద్య చెప్పాడు. (Mahabharatha-A Criticism, 1929 : Page 55, 56) సనాతనులు ఎంత ఎలుగెత్తి చాటితే అంత ఖచ్చితంగా నమ్మినట్లు భావిస్తారు. భారతదేశానికి అదొక విషాద పరిణామం. మూఢ నమ్మకాలకూ, వివేచనా రాహిత్యానికీ భారత దేశం చాలా సారవంతమయింది.
కృత, కలియుగాలనేవి హిందువుల నిమిత్తం ప్రత్యేకంగా రూపొందించిన దైవ నిర్ణయమని నమ్మారు. ఇవి మిగిలిన ప్రపంచానికి చెందవు. ఇతర ప్రజలకూ, లోకానికీ ఎలాంటి పెత్తూలేదు. విదేశాలకు పోకుండా హిందువులను వేలాది సంవత్సరాలు ఆపారు అది నత్త జీవితం వంటిది.
కలియుగారంభంలో ఆర్యులు సంచారజాతులు. 1500 సం.రాలు పాటు తిరిగి సింధులోయకు చేరారు. మరో 500 ఏళ్ళకు గంగా యమున ప్రాంతాలకు చేరారు. అలా స్థిరపడిన ఆర్య తెగల మధ్య నేటి ఢిల్లీగా పేర్కొంటున్న ప్రాంతంలో క్రీస్తు పూర్వం 3102-3101 ప్రాంతాలలో పోరాటాలు జరగటం సంభవమా? సప్త సింధు ప్రాంతం ఆర్యుల అసలు ప్రాంతమని అభినాష్ చంద్రదాస్ పేర్కొన్నాడు. అక్కడి నుండి నలువైపులా వెళ్ళి తమ దివ్య సంస్కృతిని ఆర్యులు వెదజల్లారన్నారు. ఈ సిద్ధాంతాలను వివరించటానికి దాస్ రెండు పెద్ద గ్రంధాలు రాశారు. వీటిని నవ్వులాటకైనా చదవాలనిపించదు. (Rigvedic India, Rigvedic Culture).
కలియుగం క్రీ.పూ. 3102లో ఆరంభమైందనటానికి శాసనాలు ఆధారం ఉండదన్నారు. అయిహోలా శాసనం రెండవ పులకేసికి చెందినది. పశ్చిమ చాళుక్య రాజ్యంలోని ఈ శాసనం చాలా ప్రాచీనమైనది. (A.D. Pusalker, History and Culture of the Indian People Vol. I. The Vedic Age) అయితే యిది క్రీ.త. 634కు చెందినది. అలాంటప్పుడు 3736 సం.రాల తరువాత వచ్చిన శాసనాన్ని కలియుగానికి సాక్ష్యంగా సనాతనులు మాత్రమే స్వీకరించగలరు ఆర్యభట్ట అంచనాల ప్రకారం కలియుగం క్రీ.పూ. 3102లో ప్రారంభమైంది. కాని, ఆర్యభట్ట క్రీస్తు తరువాతవాడు. 3600 సం.రాల తరువాత ఉన్న ఆర్యభట్టు ఖగోళ అంచనాల ఆధారంగా చెపుతున్నాననటం సనాతనులకు నచ్చవచ్చు.
కలియుగారంభాన్ని, రాజరికాల తేదీలను భవిష్యపురాణం అందించగా మత్స్య, వాయు, బ్రహ్మాండ పురాణాలు అనుకరించాయి. ఈ భవిష్య పురాణం నటనకు మారుపేరు. భవిష్యత్తులోకి తొంగిచూచి రాజ్యాలు రావటం, పోవటాన్ని చెప్పగలమన్నారు. వాటి ఆధారంగా కలియుగం ఎప్పుడు మొదలయిందో అంచనాలు వేస్తామన్నారు.
పురాణాలలో రాజ్యాలూ, రాజులు పట్టీల తేడా ఉన్నది. ప్రతి పురాణంలోనూ వివిధ రాజ్యాల కాలాలు అనేక విరుద్ధాలతో కూడి ఉన్నది. 14 నుండి 25 సం.రాల వరకూ ఈ తేడాలు కనిపిస్తున్నవి. పర్గీటర్ అంచనాలలో 18 సం.రాల కాలపరిమితి ఒక్కొక్క రాజ్య పాలనకు ఉన్నది. వైద్య ఈ పరిమితిని 20 సం.రాలన్నారు.
బాషమ్ 19 సం.రాలకు కుదించాడు. టి.టి. శ్రీనివాసయ్యంగార్ 25 సం.రాల వరకూ పెంచాడు. విన్ సెంట్ స్మిత్ 25. 2 సం. రాలన్నారు. ఎ.డి.పుసాల్ కర్ 18 సం.రాలకు తగ్గించాడు. పి.ఎల్. భార్గవ, 20 సం.రాలన్నాడు. పురాణంలోని రాజ్యాల కాలపరిమితిని ఫ్లిట్, హార్నెల్ అనేవారు 15 సం.రాలకు పరిమితం చేశారు. ఎ.ఎస్. ఐటేకర్ 16.5 సం.రాలన్నారు. బి.బి.లాల్ 14.5 సం.రాలన్నాడు. ఎస్.యస్. ప్రధాన్ 14 సం.రాలన్నాడు. విసుగు పుట్టించే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దాం.
ఏ ఇరువురు చరిత్రకారులూ రాజ్యాల పరిమితిని గురించి ఏకాభిప్రాయానికి రాలేక పోయారంటే వారు స్వీకరించిన ఆధారాలు తప్పుడివి కావటమే కారణం. ఈ సామ్రాజ్యాల పట్టిక చాలా పెద్దదయినప్పుడు సగటు సంఖ్య 5కు మించి లెక్కల్లో పెద్ద తేడా వస్తుంది. ఏ రాజు తరువాత ఎవరు వచ్చారనేది తేలకుండా పోతుంది.
చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 332లో తన రాజ్యాన్ని ప్రారంభించాడు. అదే నందులరాజ్యానికి చివరి దశ. అప్పటి నుండి, అంటే మహాపద్మనంద కాలం నుండీ కురుక్షేత్ర యుద్ధం వరకూ వెనక్కు వెళ్ళాలంటే 24 యిక్ష్వాకులూ, 27 పాంచాలులూ, 24 కాశీలూ, 28 హైహయులూ, 32 కళింగులూ, 25 అశ్మకులూ, 26 కురులూ, 28 మైధిలులూ, 23 సూరసేనులూ, 20 వీత హోత్రులూ స్వీకరించాలి.
257 సమకాలీన రాజులను పరిగణనలోకి తీసుకుంటే, ఒక్కొక్కరికీ సగటున వంశానికి 26 రాజులను చూపవచ్చు. ఒక్కొక్క రాజుపాలన 18 సం.రాలుగా అంచనా వేస్తే 468 సం.రాలవుతుంది. నంద సామ్రాజ్యం క్రీ.పూ. 850 వరకూ వెనక్కు వెళ్ళ వలసి ఉంటుంది. కురుక్షేత్రయుద్ధానికీ, 10 సామ్రాజ్యాలకూ మధ్య మరికొందరు రాజులున్నారు. వారికొక 100 సం.రాలు కలిపితే కలియుగం క్రీ.పూ. 1132లో కలియుగం మొదలైనట్లు చెప్పాలి. ఈ అంచనాలలో విపరీతమైన ఊహలున్నాయి. రాజులపాలన కాలపరిమితికి నిర్ధారణ లేదు. పురాణాల ప్రకారం నందసామ్రాజ్యం 100 ఏళ్ళున్నది. జైన లెక్కల ప్రకారం 150 సం.రాలు. సిలోన్ అంచనాల ప్రకారం ఇది 22 ఏళ్ళు. మహాపద్మ పాలన 88 ఏళ్ళున్నదని కొందరు, 12 సం.రాలు మాత్రమేనని మరి కొందరు అన్నారు.
వృద్ధగార్గ, వరాహమిహిర అనేవారు క్రీ.త. సుప్రసిద్ధ ఖగోళ శాస్ర్తజ్ఞులు. కలియుగ ప్రారంభమైన తరువాత 653 సం.రాలకు కురుక్షేత్ర యుద్ధం జరిగిందని వీరన్నారు. అంటే క్రీ.పూ. 2449-48లో అన్నమాట. దీనికి కాశ్మీరు చరిత్రకారుడు బి.సి. కల్హణ పూర్తి మద్దుత్తునిచ్చారు. కె.పి. జైస్వాల్ అనే చరిత్రకారుడు క్రీ.పూ. 1424లో జరిగిందన్నారు.
ఇలాంటి ఆధారాలను పురస్కరించుకొని కురుక్షేత్ర యుద్ధాన్ని నిర్ణయించటం గీతా పారాణం చేయటం అర్థం లేనిది. అయినా 1500 సం.రాల పాటు యుద్ధ కాల నిర్ణానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో కొన్ని తేదీలు ఉదహరిస్తాను. ఆర్యభట్ట, భాస్కరాచార్య క్రీ.పూ. 3102 అన్నారు. సి.వి. వైద్య క్రీ.పూ. 3101, వృద్ధ గార్గ, వరాహమిహిర, కల్హణ, బి.సి. సేన్ క్రీ.పూ. 2444-48, జె.ఎస్. కరండికర్ క్రీ.పూ. 1922, బంకిమ్ చంద్ర చటర్జీ, ధీరేంద్రనాధ్ పాల్ క్రీ.పూ. 15వ శతాబ్దం, ఎం. రంగారావు క్రీ.పూ. 1468, పి.టి. శ్రీనివాసయ్యంగార్ క్రీ.పూ. 1450, హెచ్.టి. కోల్ బ్రూక్, లార్డ్ ఎల్ఫిన్సన్, హెచ్.హెచ్. విల్సన్, బాలగంగాధరతిలక్, శీతానాధ్ తత్వభూషణ్, ఆర్.సి. మజుందార్, హెచ్.సి. రాయ్ చౌదరి, పాల్ రేణు, ఎ. భాషమ్ క్రీ.పూ. 14వ శతాబ్దం, ఎ. జి. శంకర్ క్రీ.పూ. 1198, విన్ సెంట్ స్మిత్ క్రీ.పూ. 1000.
ఇంకా ఎక్కువ చర్చ సాగిస్తే తేదీలతో పాటు గందరగోళం కూడా పెరుగుతుంది. ఈ చర్చలో పాల్గొన్న వారిలో వివేచనాపరులు కలియుగం కట్టుకథ అన్నారు. జె.ఎఫ్. ప్లీట్ ఈ విషయంలో ఆర్యభట్లపై నెపం వేశారు. క్రీ.త. 498లో ఆంధ్రరాజ్యం అంతమైనప్పుడు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని కె.పి. జైస్వాల్ అన్నాడు. కలియుగ ఆరంభాన్ని గురించిన అంచనాలు భారతీయ ఖగోళ శాస్ర్తజ్ఞుల కృత్రిమ లెక్కలపై ఆధారపడ్డాయన్నారు. దీని కౌరవ, పాండవ సంఘర్షణలు జోడించారు. మొత్తం మీద కలియుగ భావన నమ్మకంతో అల్లిన కథ మాత్రమే.

V.R Narla Telugu version: Innaiah Narisetti